Skyroot Aerospace | స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన తన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.30 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా రాకెట్ లాంచింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ మేరకు ప్రయోగానికి నాలుగు నిమిషాల ముందు ప్రకటన వెలువడింది.
విక్రమ్-1 అనేది పూర్తిగా నాలుగు దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మొదటి మూడు దశలు సాలిడ్ ప్రొపల్షన్ను ఉపయోగిస్తాయి. నాలుగో దశ ఆర్బిటల్ ఇన్సర్షన్, ప్రిసిషన్ విన్యాసాల కోసం లిక్విడ్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. 350 కిలోల వరకు బరువు ఉన్న చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్లడానికి దీనిని నిర్మించారు. దీని మొదటి టెస్ట్ ఫ్లైట్ 60 డిగ్రీల వాలులో 450 కిలోమీటర్ల కక్ష్యను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. విక్రమ్-1 భారతీయ ఎర్త్ అబ్జర్వేషన్ నానోశాటిలైట్ మేకర్ గ్రహ స్పేస్, తదితర సంస్థల నుంచి బహుళ సాంకేతిక ప్రదర్శన పేలోడ్లను తీసుకెళ్లనుంది.