ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన ఓ కుటుంబం బిడ్డల చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చింది. భర్త, భార్య సౌజన్య (పేరు మార్చాము) చెరొక పని చేసుకుంటూ ఇద్దరు ఆడబిడ్డలు, ఓ కుమారుడిని చదివిస్తున్నారు. సౌజన్యపై తన కంపెనీలోని సూపర్వైజర్ కన్ను పడింది. లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. యజమానికి చెప్తే ఉన్న ఉద్యోగం పోతుందేమోనన్న భయం. అలాగని ఆ కీచకుడి బాధలు భరించలేకపోయింది. కొన్నాళ్లు భరించినా.. ఆఖరికి తట్టుకోలేకపోయింది. షీటీమ్‌కు కాల్ చేసి, తన గోడు వెళ్లబోసుకున్నది. వారు వాట్సప్ నంబర్ 7331194540 ఇవ్వడంతో.. తన కూతురి ద్వారా చాట్‌చేసి విషయాలన్నీ చెప్పింది. ఏం జరిగిందో ఏమో.. మొన్నటి నుంచీ ఆ సూపర్వైజర్ కనిపించడంలేదు. కర్ర విరగకుండా పాము చావకుండా వాడి పీడ విరగడైంది.
Sahas | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : మీరు మహిళా ఉద్యోగులా? మీరు పని చేస్తున్న చోట లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయా? మీకు తెలిసిన ఆడబిడ్డలెవరైనా లైంగిక వేధింపులకు గురవుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ‘సాహస్’ను సంప్రదించండి. https://womensafety wing. telangana.gov.in/sahas/ వెబ్సైట్లో సమస్య చెప్పుకోండి. లేదా 7331194540 నంబర్‌కు వాట్సప్ చేయండి. అదీ కుదరకపోతే మీ సమస్యను sahasmitru.ws w@gmail.comకు మెయిల్ చేయండి. పని ప్రదేశంలో మహిళల రక్షణ కోసం ‘సాహస్’ అనే కొత్త కార్యక్రమానికి తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ శ్రీకారం చుట్టింది. దీని ద్వారా మీ పేరు బయటికి రాకుండానే మిమ్మల్ని వేధిస్తున్నవారిపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసి, పోష్ యాక్టు-2013 కింద చట్టపరంగా చర్యలూ తీసుకోవచ్చు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదికల ప్రకారం తెలంగాణలోని మొత్తం 2 కోట్ల మహిళా జనాభాలో దాదాపు 80 లక్షల మంది ఉద్యోగులున్నారు. పని ప్రదేశంలోనూ మహిళలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీసులు ‘సాహస్’ లాంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈ ‘సాహస్’ను ప్రవేశపెట్టినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని అంతర్గత కమిటీలు ఏర్పాటు చేశారు. వాటిని బలోపేతం చేసి ’సాహస్’ ద్వారా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అనుసంధానమైన ఆర్గనైజేషన్ల నుంచి నిపుణులను తీసుకొని కమిటీ సభ్యులుగా నియమించారు. ఇప్పటికే ఆయా రంగాల్లో నిష్ణాతులైన న్యాయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు అందిస్తున్నది. ఒక మహిళ తన సంస్థలో లైంగిక వేధింపులకు గురైతే ‘సాహస్’ను సంప్రదించవచ్చు. ఈ కేసును వారు వెంటనే సంబంధిత కమిటీకి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ బాధితురాలి పేరు బయటపెట్టకుండానే విచారణ జరిపి, నిందితుడిపై చర్యలు తీసుకుంటుంది. ఆ కమిటీ సైతం చర్యలు తీసుకోకపోతే.. అప్పటికే భరించరాని వేధింపులకు గురైతే.. నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. కమిటీలతో సంబంధం లేకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.
మీ ఉద్యోగం పోతుందనో, మిమ్మల్ని మరింత బాధ పెడతారనో, లేనిపోని చిక్కులు వస్తాయనో భయపడి కీచకుల వేధింపులను భరించొద్దు. రహస్యంగానే ‘సాహస్’ను సంప్రదించొచ్చు. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. కాబట్టి ధైర్యం చేయండి. లోలోపల కుమిలిపోకండి. షీటీమ్స్, సాహస్ మీకు ఎల్లవేళలా అండ గా ఉంటాయి. ‘సాహస్’లో ఉన్న నిపుణుల సలహాలు తీసుకోండి. అవసరమైతే లీగల్ కౌన్సెలర్ల సాయం పొందండి. హెచ్వైఎస్ఈఏ, ఎఫ్‌టీసీసీఐ, సీఐఐ, క్రెడాయ్, టీఐఈ వంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి.
– శిఖాగోయెల్, ఏడీజీ ఉమెన్ సేఫ్టీ వింగ్