రైతుబంధు వరం.. తగ్గిన రుణభారం.. కేసీఆర్ పథకం.. తెచ్చిన ఫలితం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన ‘రైతుబంధు’ పథకం.. రాష్ట్ర రైతులను అప్పుల నుంచి విముక్తులను చేయడమే కాదు.. వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకునే అవసరాన్ని కూడా తగ్గించింది.
- పంట పెట్టుబడి సాయంతో రైతుకు ఆర్థిక తోడ్పాటు
- అప్పుల బాధ నుంచి తప్పించి ఆసరాగా నిలిచిన పథకం
- పంటల సాగు, ఉత్పత్తి పెంపునకు ఎంతో సాయపడింది
- సెంటర్ ఫర్ ఎకనమిక్, సోషల్ స్టడీస్ అధ్యయనం కితాబు
- సాగు అనుబంధ రంగాల్లోనూ ప్రగతి సాధించినట్టు వెల్లడి
ఒక ఆలోచన అన్నదాతల ఆత్మహత్యల్ని ఆపింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి రైతుల్ని కాపాడింది. పంట సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించి, సాగుకు భరోసాను ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకం.. ఎవుసం ప్రధానంగా బతికే తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చింది. కర్షకులపై రుణభారం తగ్గించింది. ఆర్థిక తోడ్పాటునందించింది. సాగు పథకాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన ‘రైతుబంధు’ పథకం.. రాష్ట్ర రైతులను అప్పుల నుంచి విముక్తులను చేయడమే కాదు.. వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకునే అవసరాన్ని కూడా తగ్గించింది. వారికి ఈ పథకం ఆర్థిక అండగా నిలిచి, పంటల సాగు, ఉత్పత్తి పెంపునకు ఎంతో సాయపడింది. పలు రంగాల అభివృద్ధిపై అధ్యయనం చేసే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అప్పుల తిప్పలు బంద్
సాధారణంగా రైతులు పంట సాగు సమయంలో పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు చేస్తారు. ఇది వారికి పెనుభారమై క్రమంగా వారిని రుణ ఊబిలోకి నెట్టే పరిస్థితుల్ని తెస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా ఉండాలనే సదుద్దేశంతో 2018లో నాటి సీఎం కేసీఆర్ ‘రైతుబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రైతులకు ఎకరాకు సీజన్‌కు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం పంపిణీ చేసేవారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగినన్ని రోజులూ.. రైతుబంధుకు ఎలాంటి నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పంటల సాగు సమయంలో రైతులకు ఎప్పటికప్పుడు సాయం అందించేవారు. నాటి సీఎం కేసీఆర్ ఏ ఉద్దేశంతో అయితే రైతుబంధు పథకాన్ని అమలు చేశారో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరినట్టు సెస్ తాజా నివేదికను విశ్లేషిస్తే అర్థమవుతున్నది. రైతుబంధు పథకం అమలు తర్వాత రైతులు ప్రైవేట్ రుణాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గినట్టు నివేదికలో తేలింది. 2015 నుంచి 2020 మధ్య ప్రైవేట్ రుణాలు తీసుకునే చిన్న రైతుల సంఖ్య 84.7 శాతం నుంచి 70.2 శాతానికి, మధ్యతరహా రైతుల్లో ఇది 82.5 శాతం నుంచి 62.1 శాతానికి, పెద్ద రైతుల్లో 78.1 శాతం నుంచి 64.9 శాతానికి తగ్గినట్టు వెల్లడించింది. మొత్తంగా రైతులందరిలో రుణాలు తీసుకునే పరిస్థితి దాదాపు 14 నుంచి 20 శాతం తగ్గినట్టుగా నివేదిక అంచనా వేసింది. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందడంతో పంటల సాగు పెరుగడంతో పాటు ధాన్యం ఉత్పత్తి కూడా పుంజుకున్నట్టు నివేదిక వెల్లడించింది.
ఇంకా ఎన్నెన్నో పథకాలు కూడా..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు సెస్ తన నివేదికలో పేర్కొన్నది. రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేయడమే కాకుండా కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, సాగుకు 24గంటల ఉచిత విద్యుత్తు, చెరువుల పునరుద్ధరణ, చేపలు, గొర్రెల పంపిణీ, వడ్డీలేని రు ణాలు, సబ్సిడీ విత్తనాల పంపిణీ, వ్యవసాయ యాం త్రికీకరణ ఇలా అనేక పథకాలను గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసినట్టు గురు చేసింది. పదేండ్లలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు పాలు, మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తిలోనూ వృద్ధి నమోదైనట్టుగా నివేదిక తెలిపింది.
వ్యవసాయ అభివృద్ధికి ఊతం
రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి అనేక రకాల సంక్షేమ పథకాల అమలు వల్ల బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయరంగం ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందినట్టుగా నివేదిక పేర్కొన్నది. వీటి కారణంగానే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 2014-15లో 131 లక్షల నుంచి 2022-23లో 222 లక్షల ఎకరాలకు చేరినట్టు వెల్లడించింది. ఇందులో ఆయకట్టు విస్తీర్ణం 62 లక్షల ఎకరాల నుంచి 135 లక్షల ఎకరాలకు పెరిగినట్టు పేర్కొన్నది. సాగు విస్తీర్ణం పెరుగడంతో పాటు రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సైతం గణనీయంగా పెరిగినట్టు నివేదిక గుర్తుచేసింది. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15లో 72 లక్షల టన్నులుండగా, 2022-23 నాటికి 207 లక్షల టన్నులకు చేరినట్టు వెల్లడించింది. 2021-22లో ఆహార ధాన్యాల దిగుబడిలో దేశంలోని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే.. తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. కేవలం వ్యవసాయరంగంలోనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అభివృద్ధి జరిగినట్టు నివేదిక వెల్లడించింది. 2015-16 నుంచి 2023-24 మధ్య మాంసం ఉత్పత్తి 5.42 లక్షల టన్నుల నుంచి 11.72 లక్షల టన్నులకు పెరుగగా.. గుడ్ల ఉత్పత్తి 1,120 కోట్ల నుంచి 1,864 కోట్లకు చేరినట్టు నివేదిక తెలిపింది. మంచినీటి చేపలు, రొయ్యల ఉత్పత్తి కూడా 2.36 లక్షల టన్నుల నుంచి 4.56 లక్షల టన్నులకు పెరిగినట్టు నివేదిక పేరొన్నది.
రైతుబంధుకు కాంగ్రెస్ పాతర…
రైతులను రుణ ఊబి నుంచి బయటపడేయడంతో పాటు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకాన్ని అనంతర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాతర పెట్టింది. రైతుబంధు లక్ష్యాలను నీరుగారుస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో సాగు సీజన్ మొదలైందంటే రైతుబంధు నిధులు అకౌంట్లలో జమవుతాయనే భరోసా రైతుల్లో ఉండేది. 11 సీజన్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకంగా రూ. 83 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కానీ కాంగ్రెస్ ఎన్నికల ముందు రైతుబంధు పథకాన్ని రైతుభరోసాగా మార్చడంతో పాటు ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక రూ.12 వేలకే పరిమితం చేసింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

