జగిత్యాల, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని పునఃసమీక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డికి పట్టభధ్రుల ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లన్న ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని తెచ్చి కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశం కల్పించిందని అన్నారు. వీటిలో విద్యాభ్యాసం చేసే వారిలో 25 శాతం తెలంగాణ స్థానికులకు, 75 శాతం ఓపెన్ క్యాటగిరీగా అవకాశం కల్పించారని చెప్పారు. దేశంతోపాటు విదేశాల్లోని వారు సైతం ఈ 75 శాతం కోటాలో అడ్మిషన్లు పొందేందుకు వీలున్నదని తెలిపారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట నిబంధనలు చూస్తే డబ్బునోడికే చదువు అన్నట్టుగా పరిస్థితి తయారైందని అన్నారు. స్థానికత అంశంపై జరిగిన పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో స్థానికతకు చోటులేకుండా పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రైవేట్ వర్సిటీల్లో 25 శాతం స్థానిక కోటాలో మాత్రమే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, 75 శాతం కోటాలో రిజర్వేషన్లు అమలు కావడం లేదని వెల్లడించారు. ఈ చట్టంపై సమీక్ష నిర్వహించి, మార్పులు తేవాలని రేవంత్‌రెడ్డిని కోరారు. ప్రైవేట్ వర్సిటీల్లో 75 శాతం కోటాను లోకల్‌కు కేటాయించి, 25శాతం కోటాను ఓపెన్ కోటాగా మార్చాలని సూచించారు.
అలా చేసినప్పుడే బడుగు, బలహీనవర్గాలు, మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ యునివర్సిటీల్లోని ఉద్యోగాల్లో సైతం 75 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికి కేటాయించేలా చూడాలని కోరారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే తమ పార్టీ రెండు గ్యారెంటీలను అమలు చేసిందని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం మహిళల్లో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు ఉద్దేశించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2వేల రూపాయల పెన్షన్‌ను 4 వేలకు.. రైతుభరోసా కింద 10 వేల పంట సాయాన్ని రూ. 15వేలకు పెంచబోతున్నదని చెప్పారు. ఏ పథకం వర్తించని ఆడబిడ్డలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కొత్త రేషన్‌కార్డులను కూడా జారీ చేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులకు టైమ్ లిమిట్ లేదని వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి, ప్రతి హ్యాబిటేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని నిర్ణయించడం సంతోషకరం, శుభపరిణామం అని పేర్కొన్నారు.