PM Vishwakarma | పీఎం విశ్వకర్మ యోజనలో 18 వృత్తులకే చోటు.. లబ్ధిదారులకిచ్చే రూ.లక్ష కూడా 18 నెలల్లో తిరిగి కట్టాల్సిందే
పంద్రాగస్టునాడు ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పీఎం విశ్వకర్మ యోజనలోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. ఈ పథకంలో చాలా హస్తకళలకు చోటే దక్కలేదు. ఎంపికైన లబ్ధిదారులకు ఇచ్చే రూ. లక్ష రుణం కూడా 18 నెలల్లోనే తిరిగి చెల్లించాల్సన నిబంధన కూడా ఉంది.
- చేతివృత్తులకు మొండిచెయ్యి..
- కేంద్రం ఇచ్చేది లక్ష.. 18 నెలల్లో తిరిగి కట్టాల్సిందే
- సంక్లిష్టంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
- చేతివృత్తులన్నింటికీ తెలంగాణలో లక్షసాయం
- నిబంధనల్లేకుండా అందిస్తున్న కేసీఆర్ సర్కార్
PM Vishwakarma | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): పంద్రాగస్టునాడు ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పీఎం విశ్వకర్మ యోజనలోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. ఈ పథకంలో చాలా హస్తకళలకు చోటే దక్కలేదు. ఎంపికైన లబ్ధిదారులకు ఇచ్చే రూ. లక్ష రుణం కూడా 18 నెలల్లోనే తిరిగి చెల్లించాల్సన నిబంధన కూడా ఉంది. ఈ పథకానికి సంబంధించి తాజాగా విడుదలైన ఉత్తర్వుల్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, బోట్మేకర్, పనిముట్ల తయారీదారు (ఆర్మరర్), హ్యామర్ అండ్ టూల్‌కిట్ మేకర్, లాక్సిత్, శిల్పి, స్టోన్ బ్రేకర్, చర్మకారులు, తాపీమేస్తీ, బుట్టలు/చాపలు/పొరకల తయారీ, బొమ్మల తయారీ, బార్బర్, పూలదండల తయారీ, ధోబీ, టైలర్, చేప వలలు తయారీదారులు వంటి 18 రకాల హస్తకళలు, చేతి వృత్తులకే స్థానం కల్పించారు. అయితే, ప్రజాదరణ కలిగిన అనేక చేతి వృత్తులకు ఇందులో స్థానం దక్కకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఇటీవలి కాలంలో తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన మగ్గం వర్క్‌కు ఈ పథకంలో చోటు దక్కలేదు. అలాగే, బంజారా నీడిల్క్రాఫ్ట్స్, రాష్ర్టానికి గర్వకారణమైన బిద్రీక్రాఫ్ట్, ముత్యాల నగల తయారీ, కాంస్య విగ్రహాల తయారీ, గిరిజన ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ వంటి కళలకు కూడా పీఎం విశ్వకర్మ పథకంలో చోటు లభించలేదు. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మల్ హస్తకళల ఊసు కూడా లేదు.
గిరిజన కళలకు చోటు నిల్
దేశంలోని వివిధ ప్రాంతాల్లో గిరిజనులు స్థానిక సంప్రదాయ కళల ఆధారంగా అనేక చేతివృత్తులను నిర్వహిస్తున్నారు. బుట్టల తయారీ, సిరామిక్స్, క్లాక్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, డెకరేటివ్ పెయింటింగ్, గ్లాస్‌వర్క్, ఫ్యాబ్రిక్, ఫర్నిచర్, బహుమతులు, గృహాలంకరణ, ఆభరణాలు, లెదర్ క్రాఫ్ట్స్, మెటల్ క్రాఫ్ట్స్, కుండలు, తోలుబొమ్మల తయారీ వంటివి ఇందులో ఉన్నాయి. జార్ఖండ్‌లో కర్ర, వెదురు, టెర్రకోటతో వివిధ అలంకరణ వస్తువుల తయారీ, ఒడిశాలో జానపద చిత్రలేఖనం, లోహచిత్రాలు, కొమ్ము, ఎముక ఉత్పత్తులు, ఇత్తడి, వెండి ఫిలిగ్రీ తదితర హస్తకళలు అధికంగా ఉన్నాయి. ఇవేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ రకాల ఫ్యాషన్ వస్తువులు తయారవుతున్నాయి. ఇందులో హ్యాండ్ బ్యాగులనుంచి బూట్ల వరకు, చెవి పోగుల నుంచి పూసల నెక్లెస్‌ల వరకు ఉన్నాయి. పీఎం విశ్వకర్మ పథకంలో వీటిలో ఒక్కదానికి కూడా స్థానం లభించలేదు.
నిబంధనల్లో స్పష్టత కరువు
పీఎం విశ్వకర్మ పథకంలో పలు కళలకు చోటు లభించకపోగా, లబ్ధిదారుల ఎంపిక కూడా సంక్లిష్టంగా ఉంది. గడిచిన ఐదేండ్లలో స్వయం ఉపాధి పథకం కింద కానీ, మరే ఇతర పథకం నుంచి కానీ లబ్ధిదారులు రుణం తీసుకుని ఉండకూడదు. కుటుంబంలో ఒక్క ప్రభుత్వోద్యోగి ఉన్నా పథకానికి అనర్హులవుతారు.గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హుల పేర్లను జిలా ఇంప్లిమెంటేషన్ కమిటీకి పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ఎంఎస్ఎంఈ అధికారులు, బ్యాంకర్లు సమావేశమై లబ్దిదారులకు రుణం మంజూరుచేస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే రూ. లక్ష రుణం ఇస్తారు. దానిని మళ్లీ 18 నెలల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాలన్న నిబంధన విధించారు.
ఉదారంగా ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ప్రధానమంత్రి ప్రకటించిన పీఎం విశ్వకర్మ పథకంలో సవాలక్ష నిబంధనలు ఉండగా, సీఎం కేసీఆర్ మాత్రం బీసీ బంధు పేరుతో చేతివృత్తుల వారికి రూ. లక్ష చొప్పున గ్రాంటు రూపంలో అందిస్తున్నారు. ఆదాయ ధ్రువీకరణ ఆధారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు, అన్ని చేతివృత్తులను ఇందులో చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీబంధుతో పోలిస్తే విశ్వకర్మ పథకం ఎందుకూ కొరగాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలోనూ స్పష్టత లేదని పేర్కొంటున్నారు. కేంద్రం విడుదల చేసిన జాబితాలో లేని కళలకు రుణాలు మంజూరు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి పీఎం విశ్వకర్మ పథకం పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

