మూడు అంశాలు ముఖ్యం
మనిషి జీవితంలో మూడు అంశాలు స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్.. ప్రత్యేకంగా ఉంటాయి. స్కిల్ అంటే ప్రస్తుతం మనలో ఉన్న స్కిల్.. అప్ స్కిల్.. అంటే ఎప్పటికప్పుడు నైపుణ్యతకు పదును పెడుతూ పోటీతత్వంతో నిలదిక్కుకోవడం. రీ స్కిల్ అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ప్రస్తుతమున్న సామర్థ్యానికి మరింత పదునుపెడుతూ.. నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవడం. కొత్త టెక్నాలజీని అందుకోవాలి. లేకపోతే వెనుకబడిపోతాం. -మంత్రి కేటీఆర్
మేడ్చల్, మార్చి 14 : ఒక ఉద్యోగానికి పదుల సంఖ్యలో పోటీ ఉంటుందని.. అదే పోటీతత్వంతో పట్టుదలగా చదువుకొని ఉద్యోగాలు పొందాలని పురపాలక, ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఉద్యోగార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ నుంచి ప్రతాప్‌సింగారం వరకు రూ.25.32 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనతోపాటు ఉచిత కోచింగ్ సెంటర్‌ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. 6 నెలలపాటు సినిమాలకు దూరంగా ఉండాలని, క్రికెట్ తక్కువగా చూడాలని, ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను బంద్ చేసి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. కష్టపడి కనిపెంచి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులను సంతోషపెట్టేలా మంచి భ విష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హితవు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కోచింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మూడు అంశాలు ముఖ్యం
మనిషి జీవితంలో మూడు అంశాలు స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్.. ప్రత్యేకంగా ఉంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్కిల్ అంటే ప్రస్తుతం మనలో ఉన్న స్కిల్.. అప్ స్కిల్.. అంటే ఎప్పటికప్పుడు నైపుణ్యతకు పదును పెడుతూ పోటీతత్వంతో నిలదిక్కుకోవడమని.. రీ స్కిల్ అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ప్రస్తుతమున్న సామర్థ్యానికి మరింత పదునుపెడుతూ.. నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని చెప్పారు. కొత్త టెక్నాలజీని అందుకోవాలని.. లేకపోతే వెనుకబడిపోతామన్నారు.
ప్రత్యామ్నాయాలు అనేకం
ఒకవేళ తీవ్రంగా ప్రయత్నం చేసినా ఉద్యోగం రాకపోతే ఎంతమాత్రం నిరాశ చెందవద్దని.. మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అవకాశాలు అనేకమున్నాయని మంత్రి కేటీఆర్ ఉద్యోగార్థులనుద్దేశించి అన్నా రు. మనలో నైపుణ్యం ఉంటే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదని.. ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు 4 నుంచి 4.5 లక్షల వరకు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రైవేట్ ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు చెప్పారు. టీఎస్ఐపాస్ ద్వారా అవినీతిరహితంగా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు 19 వేల పరిశ్రమలు వచ్చాయని.. 13 వేల పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, ఆరువేల పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. మన యువతకు అత్యధిక కొలువులిచ్చే పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీ పరిశ్రమను కూడా విస్తరిస్తున్నామని చెప్పారు.
జర్మనీ తరహాలో అప్రెంటిస్
జర్మనీ తరహాలో ఓ పక్క చదువుకొంటూనే పరిశ్రమల్లో విధులు నిర్వహించే ప్రణాళికను భవిష్యత్తులో రాష్ట్రంలో అమలుకు ఆలోచన చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చదువుకొంటూనే అప్రెంటిస్ చేసేలా అవకాశమిస్తే.. డిగ్రీ పూర్తయ్యేసరికి అనుభవంతో కూడిన కొలువు లభించే అవకాశం ఉంటుందన్నారు. ఔత్సాహిక యువత ముందుకు వచ్చి తామే పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటామంటే.. పరిశ్రమల పార్కులు, వీహబ్‌ల ద్వారా అవకాశం కల్పిస్తామని చెప్పారు. అంతేకాక స్వయం ఉపాధి కింద యువతకు రుణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచంలో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నైపుణ్యాన్ని తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల ఖాళీలు
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్లో ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటి ఖాళీల భర్తీ తప్పదని.. వాటిలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉంటాయని తెలిపారు. ఉద్యోగార్థులు ఇప్పుడు శిక్షణ పొందితే.. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు పొందడానికి కూడా ఉపయోగపడుతుందని సూచించారు. కోచింగ్ సెంటర్లతోపాటు, కొవిడ్ సమయంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీశాట్ కార్యక్రమాల ద్వారా 33 లక్షల మందికి చదువు చెప్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో తొలి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసిన మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ వెంకట్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్సీ నవీన్‌రావు, జిల్లా కలెక్టర్ హరీశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.