e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home అంతర్జాతీయం సొంత వైద్యం మానుకో!

సొంత వైద్యం మానుకో!

  • ఇంటర్నెట్‌, యూట్యూబ్‌ చూసి ఇంట్లోనే చికిత్స
  • మోతాదుకు మించి మందుల వినియోగం
  • రోగం ముదిరాక దవాఖానల బాట

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌లో ఉంటున్న మౌనిక (పేరు మార్పు)కు జలుబు, దగ్గు మొదలయ్యాయి. అంతే.. కరోనా సోకిందని భయపడిపోయింది. యూట్యూబ్‌, గూగుల్‌లో వెదికి సొంతవైద్యం మొదలుపెట్టింది. నాలుగైదు రోజులు ఇష్టం వచ్చినట్టు మందులు వేసుకున్నది. కానీ, సమస్య తగ్గకపోగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం కరోనాతోపాటు గుండె సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నది. మౌనిక ఒక్కరే కాదు.. కొవిడ్‌ సోకినవారిలో 40 శాతం మంది మొదటి రెండుమూడ్రోజులు సొంతవైద్యం చేసుకుంటున్నారు. దీనిద్వారా వ్యాధి తగ్గకపోగా.. మరింత ముదురుతున్నది. క్వారంటైన్‌తో పోయేదానికి ఐసీయూదాకా తెచ్చుకుంటున్నారు. ఇలాంటి బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏండ్లలోపు వారే ఉన్నారని వైద్యులు చెప్తున్నారు.

గూగుల్‌ తల్లిని అడిగేస్తున్నారు
కరోనా చికిత్స అందరికీ ఒకేవిధంగా ఉండదు. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, శ్వాస సమస్యలు, రక్తం గడ్డకట్టడం.. ఇలా వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. రోగి పరిస్థితిని బట్టి వారికి ఏయే మందులు, ఎంత మోతాదులో, ఎప్పుడు ఇవ్వాలో వైద్యులు నిర్ణయిస్తారు. కానీ.. చాలామంది కరోనా లక్షణాలు కనిపించగానే వైద్యం కోసం గూగుల్‌లోనో, యూట్యూబ్‌లోనో వెతుకుతున్నారు. లేదా కొవిడ్‌ నుంచి కోలుకున్న వారినుంచి ఏయే మందులు వాడారో తెలుసుకుంటున్నారు. మెడికల్‌ షాప్‌కు వెళ్లి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, ఐవర్‌మెక్టిన్‌, డాక్సీసైక్లిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌, జ్వరానికి, జలుబుకు, దగ్గుకు.. ఇలా అన్ని మందులు తెచ్చుకొని, కలిపి వాడుతున్నారు. దీంతో అవనవసరమైన మందులు మోతాదుకు మించి శరీరంలోకి వెళ్తున్నాయి. మరికొందరు లవంగాలు, మిరియాలు, శొంఠి, జీలకర్ర, దాల్చిన చెక్క.. తదితర మసాలాలు కలిపి పొడిచేసి కషాయాలు తాగుతున్నారు. ఇవి కొంత వరకు మేలు చేసేవే అయినా.. అతిగా తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

తీవ్ర దుష్ప్రభావాలు

  • హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలంలో గుండె లయ తప్పుతుంది. గుండె కొట్టుకునే వేగం మారుతుంది.
  • ఐవర్‌మెక్టిన్‌ అధికంగా వినియోగించడం వల్ల తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. కాలేయ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి.
  • డెక్సామెంతజోన్‌ (స్టెరాయిడ్‌)ను మోతాదుకు మించి, దీర్ఘకాలంపాటు వినియోగిస్తే ఆస్టియోపోరోసిస్‌ వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా తొడ ఎముక, దానిచుట్టూ ఉన్న కండరాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
  • స్టెరాయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో కురుపులు రావడం, రంధ్రాలు పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. శరీర రక్షణ వ్యవస్థ దెబ్బతింటుందని, రక్తంలో చెక్కర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు.
  • విటమిన్‌ టాబ్లెట్లు అధికంగా వాడితే శరీరం సహజత్వం కోల్పోతుంది.
  • కషాయాలు ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయి.

రోగాన్ని ముదరబెడుతున్నారు
చాలామంది కొవిడ్‌ లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోకుండా సొంతవైద్యం చేసుకుంటున్నారు. అలాంటివారిలో నాలుగోరోజు నుంచి ఆయాసం మొదలవుతున్నది. శ్వాసకూడా సరిగా తీసుకోలేని స్థితిలో దవాఖానకు వస్తున్నారు. అప్పుడు ఆక్సిజన్‌ స్థాయిలు పరీక్షిస్తే 70-80 శాతం మధ్య చూపిస్తున్నది. వారి ప్రాణాలు కాపాడటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. 40 ఏండ్లలోపు వారిలోనే మాకేం కాదులే అన్న నిర్లక్ష్యం, సొంతవైద్యం కనిపిస్తున్నాయి.

  • డాక్టర్‌ పీ సతీశ్‌రెడ్డి, సీనియర్‌ సర్జన్‌, కాంటినెంటల్‌ హాస్పిటల్‌, గచ్చిబౌలి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana