హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర సర్కారు.. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)ల కేటాయింపులో ధోకా ఇచ్చింది. 22 రాష్ర్టాలకు ఈ పార్కులను కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది. బుధవారం ఐటీ రంగానికి సంబంధించి లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. చిన్న నగరాల్లో ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకున్నదని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62 ఎస్టీపీఐలను కేంద్రం ఏర్పాటుచేసినట్టు, ఇందులో 54 ఎస్టీపీఐలు టైర్-2, టైర్-3 నగరాలు ఉన్నట్టు చెప్పారు.
చిన్న నగరాల్లో ఉద్యోగాల కల్పనకు కేంద్రం ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్ (ఐబీపీఎస్), నార్త్ ఈస్ట్ బీపీవో ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఈబీపీఎస్) పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ (ఎన్జీఐఎస్)ను కేంద్రం ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టైర్-2, టైర్-3 నగరాల్లో 12 ఎస్టీపీఐ సెంటర్లలో సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఇంక్యుబేషన్ సౌకర్యం అభివృద్ధికి రూ.95.03 కోట్లు కేటాయించినట్టు మంత్రి వివరించారు. మంత్రి చెప్పిన ఇన్ని పథకాల్లో తెలంగాణకు ఏ ఒక్కటీ దక్కకపోవడం రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు నిదర్శనం. రాష్ట్రం ఐటీ రంగంలో కీలకంగా ఎదిగినా ఎస్టీపీఐ కేటాయింపులో కేంద్రం మరోసారి తన నైజాన్ని చాటుకొన్నది.