కేసీఆర్ హయాంలోనే కాపాడినం
మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిని కాపాడింది కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
- 2015లోనే సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను నియమించినం: హరీశ్
- మియాపూర్ భూములు అమ్ముతామని సీఎం రేవంత్ ప్రకటించడం సిగ్గుచేటు
- ఆధారాలు సహా ‘ఎక్స్’లో పోస్టు చేసిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు
- ప్రైవేట్ పార్టీల తరుఫున వాదించింది కాంగ్రెస్ నేత కాదా?
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్న
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిని కాపాడింది కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆధారాలు చూపుతూ కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. నాటి ప్రభుత్వం భూములను కాపాడితే నేటి కాంగ్రెస్ సర్కార్ వాటిని అమ్ముకొనేందుకు సిద్ధమైందని మండిపడ్డారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని.. ఈ రోజు అమ్ముకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటు’ అని నిప్పులు చెరిగారు. మియాపూర్ 550 ఎకరాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సుప్రీంకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. మియాపూర్ భూ వివాదం 2003లోనే ఎస్ఎల్పీగా సుప్రీంకోర్టుకు చేరిందని గుర్తు చేశారు.
2013లో అది సివిల్ అప్పీల్‌గా మారినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో వ్యవహరించారని గుర్తుచేశారు. 2015లోనే దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను ప్రత్యేకంగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా నమోదయ్యాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ 2015 ఏప్రిల్ 7 నుంచి తెలంగాణ ప్రభుత్వం తరఫున మియాపూర్ భూముల రక్షణ కోసం సుప్రీంకోర్టులో వాదిస్తూ వచ్చారని వివరించారు. 2015 నుంచి 2023 వరకు దాదాపు 8 ఏండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణ కోసం అలుపెరుగని న్యాయపోరాటం చేసినట్టు వివరించారు. మియాపూర్ భూమికి సంబంధించిన ప్రతి పిటిషన్, ప్రతి అఫిడవిట్, సమగ్ర ఆధారాలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.
2023నాటి విజయమే కీలకం
‘ఆంధ్రప్రదేశ్ జాగీర్ల రద్దు నిబంధనలు, అతియత్ విచారణ చట్టం కింద ఉన్న సంబంధిత టెర్మినాలజీ, రూల్స్ చర్చించడం సముచితం. ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ వర్సెస్ ఎంఎస్ మూర్తి 2023 ఎస్సీసీ ఆన్లైన్ ఎస్సీ 738 కేసులో ఈ కోర్టు ఇచ్చిన తీర్పులోని 93వ పేరా నుంచి కొన్ని సంబంధిత పదజాలాలు ఉదహరించింది’ అని సుప్రీంకోర్టు మియాపూర్ భూముల తీర్పులో పేర్కొన్నట్టు హరీశ్ రావు తెలిపారు.
(It is apposite to discuss the relevant expressions and regulations under the A.P. Abolition of Jagirs Regulations and the Atiyat Inquiries Act. Certain relevant terminologies are being extracted from paragraph 93 of the judgment of this Court in Trinity Infraventures Ltd. v. M.S. Murthy, 2023 SCC OnLine SC 738, for the said purpose.) మియాపూర్ తీర్పునకు అసలు పునాది ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ కేసు తీర్పేనని గుర్తుచేశారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసులో 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సేనని, ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించింది అదే వైద్యనాథన్ అని పునరుద్ఘాటించారు. నాడు తాము సాధించిన ఆ విజయమే, ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పునకు బలమైన ఆధారాలయ్యాయని వివరించారు.
ఈ రికార్డులన్నీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో బహిరంగంగా ఉన్నా, తామేదో సాధించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ ప్రెస్మీట్లు పెట్టి గొప్పలకు పోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రెస్‌మీట్ పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన నిజాలైయిపోవని చురకలంటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర పోరాటం వల్లే నేడు మియాపూర్ భూములు పరిరక్షించబడ్డాయని పేర్కొన్నారు.
రేవంత్ ప్రెస్‌మీట్ వెనుక అసలు కుట్ర వేరే
రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ వెనుక అసలు కుట్ర వేరే ఉన్నదని హరీశ్ అనుమానం వ్యక్తంచేశారు. మియాపూర్‌లో ఉన్న ఈ 550 ఎకరాల భూమి విలువ రూ.50 వేల కోట్ల పైమాటేనని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని తెలిపారు. ఈ విలువైన భూములను అమ్ముకోవడానికే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు నాడు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు, ప్రభుత్వం తరఫున నియమించిన లాయర్ వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను హరీశ్ తన ట్వీట్‌కు జత చేశారు.
నాడు ప్రైవేట్ పార్టీల లాయర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
మియాపూర్ 550 ఎకరాల భూమి విషయంలో ప్రైవేట్ పార్టీల తరఫున లాయర్‌గా కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ వెల్లడించారు. హరీశ్ ట్వీట్‌కు స్పందించిన ఆయన రేవంత్‌రెడ్డిని ఈ అంశంలో సైతం ప్రశ్నించాలని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం నాడు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమించిందని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

