హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పుస్తకాలతో కుస్తీ ప ట్టాల్సిన వయసు.. పెన్నులు, పెన్సిళ్లతో రాసే సమయం..ఇల్లే తప్ప మిగతా వారి సమస్యలేందో తెలియని ప్రాయంలో సెన్సర్లు, కోడింగ్‌తో సాంకేతికంగా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. కోడింగ్, పైథాన్ వంటివి బీటెక్ థర్డ్ఇయర్, ఎంసీఏ కోర్సుల్లో నేర్చుకోవాల్సి ఉండగా, మన గురుకులాల విద్యార్థులు 6వ తరగతి నుంచే ఔపోసన పడుతున్నారు. ఇలాంటి అద్భుత బోధనకు కేరాఫ్‌గా నిలుస్తున్నది తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థ ఆధ్వర్యంలోని కోడింగ్ స్కూల్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిరుడు ప్రారంభించిన ఈ స్కూల్లో ప్రస్తుతం 460కి పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచే పాఠ్యాంశాలతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రోగ్రామింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. సెక్యూర్డ్ స్పేస్ అనే కంపెనీ కరిక్యులం రూపొందించి, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నది. ఈ సంస్థకు చెందిన సాంకేతిక సిబ్బంది విద్యార్థులకు కోడింగ్ పాఠాలు నేర్పించి స్టార్టప్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. కోడింగ్ ద్వారా అప్లికేషన్లు, వెబ్సైట్లు, సాఫ్ట్వేర్లను రూపొందిస్తున్నారు.
తయారు చేసింది : త్రిపుర, లక్ష్మీప్రియ, మల్లిక
నేపథ్యం : త్రిపుర నాన్న రాత్రి సమయంలో పొలానికి వెళ్లగా పాము కాటేసింది.
పరిష్కారం : మార్కెట్లో సులువుగా దొరికే మినీసోలార్ ప్యానల్, ప్లాస్టిక్ బాటిల్, బల్బు, డయోడ్, బ్యాటరీ, ట్రాన్సిస్టర్‌ను వినియోగించి ట్రైనర్ల సహకారంతో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. సూర్యకాంతితో టార్చ్లైట్ల కన్నా మెరుగైన.. సోలార్ బాటిల్ ల్యాంప్‌ను వీరు తయారుచేశారు. చీకటి పడగానే ఆటోమెటిక్ వెలగడం, వెలుతురు రాగానే ఆఫ్ కావడం ఈ లైట్ ప్రత్యేకత. ప్రత్యేకంగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాటరీల అవసరం కూడా లేదు.
తయారు చేసింది : శివకుమార్, పరమేశ్
నేపథ్యం : వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక రోగులు లేచి ఫ్యాన్ స్విచ్‌లను వేసుకోలేరు. ఫ్యాన్ ఆన్, ఆఫ్ చేయడం వారి వల్ల కాదు.
పరిష్కారం : నోటి మాటలతో ఫ్యాన్ తిరగ డం, ఆగిపోయేలా వాయిస్ కమాండ్ హోం అప్లయన్సెస్ ప్రాజెక్ట్‌ను వీరు రూపొందించారు. మొబైల్ యాప్ ద్వారా బ్లూటూత్, కంట్రోల్ వంటి సామగ్రిని ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రోస్ చూసి అబ్బురపడి విద్యార్థులను ప్రశంసించారు.
తయారు చేసింది: రజిత, సాయిప్రియ, వైష్ణవి
ప్రాజెక్టు నేపథ్యం : సాయిప్రియ సోదరుడు, వైష్ణవి తండ్రి ఇద్దరు వికలాంగులే. సాయిప్రియ సోదరుడు కేవలం తల, చేయి తప్ప మరేం కదల్చలేడు. ఇలాంటి వారికి బయటదొరికే ఎలక్ట్రానిక్ వీల్చైర్ల ధరలు రూ.50- 90వేల పై మాటే.
పరిష్కారం : అతి తక్కువ ధరలో వీల్‌చైర్‌ను తయారు చేయాలని భావించి వీరు గెశ్చర్ కంట్రోల్ వీల్‌చైర్‌ను (సైగలు, కదల్చడం ద్వారా పనిచేసే) రూపొందించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సబ్జెక్టులో నేర్చుకొన్న సెన్సర్లు, మరికొన్ని సాంకేతిక పరికరాలు వినియోగించి వీల్‌చైర్ మాడల్‌ను తయారు చేశారు. చేయి ఎలా కదిపితే అలా ఈ వీల్‌చైర్ కదులుతుంది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కేవలం రూ.15 వేల లోపే వీల్‌చైర్‌ను తయారు చేయొచ్చు.
తయారు చేసింది : సుశాంత్, ప్రవీణ్
నేపథ్యం : సుశాంత్ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో వారి కుటుంబం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నది. అర్ధరాత్రి 2 గంటల తర్వాతే డ్రైవర్లు నిద్రమత్తులోకి జారి ప్రమాదాల బారినపడుతున్నారు.
పరిష్కారం : డ్రైవర్ డ్రౌజీనెస్ ప్రాజెక్ట్‌ను వీరు రూపొందించారు. వాహనం పైభాగంలో కెమెరాను ఉంచి 2 సెకండ్ల కంటే ఎక్కువ సేపు కండ్లు మూస్తే సెన్సర్లు గ్రహించి అలారం మోగి అలర్ట్ చేస్తాయి.
తయారు చేసింది: మీనాక్షి, రిత్విక
నేపథ్యం : రిత్విక నానమ్మ గార్డెనింగ్ పనిచేస్తూ కిందపడగా కంటిచూపు కోల్పోయింది. ఫలితంగా తరచూ ఇంట్లో వస్తువులు తగిలి కిందపడటం, గాయాలు పాలవడం జరుగుతున్నది. దీనికి ఏదో పరిష్కారం కనుక్కోవాలని రిత్విక తీవ్రంగా శ్రమించింది.
పరిష్కారం : ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా సెన్సర్ కాన్సెప్ట్స్‌ను ఉపయోగించి స్మార్ట్ బ్లైండ్ స్టిక్‌ను (మూడోకన్ను) రూపొందించారు. 400 సెంటీమీటర్ల దూరంలో ఉన్న గోడ, వస్తువు అడ్డుగా వచ్చినప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ ఆయా శబ్దాలను ఈ స్టిక్కు పంపించి అప్రమత్తం చేస్తుంది.
కోడింగ్ అంటే..
కోడింగ్ ఇప్పుడు అన్ని రంగాల్లో ఆధిపత్యం వహిస్తున్న కోర్సు. ఈ కోర్సు మానవ జీవనశైలిని అన్నింటా ప్రభావితం చేస్తున్నది. చిన్నపాటి ప్రొగ్రాం రాసి ఇస్తే కంప్యూటర్ ఆధారంగా స్వయం సిద్ధంగా పనిచేయడమే కోడింగ్. ఉదాహరణకు రైల్వే టికెట్ బుక్కయ్యిందా లేదా అన్నది మనకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఈ ఎస్ఎంఎస్ను మనుషులు టైప్ చేయరు. ఆటోమెటిక్‌గా టికెట్ బుక్ కాగానే ఎస్ఎంఎస్ రూపంలో సందేశాన్ని పంపిస్తుంది. ఇలా టైప్‌చేసి ఉండే కంప్యూటర్ ప్రోగ్రామింగే కోడింగ్.
అన్ని జిల్లాల్లో కోడింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి
మా కూతురు విశాల కోడింగ్ స్కూల్లో 8 తరగతి చదువుతున్నది. ఇక్కడ వసతులు మెరుగ్గా ఉన్నాయి. గతంతో పొల్చితే చదువుల్లో చురుగ్గా ఉన్నది. పేరెంట్స్ కమిటీ సమావేశాలకు వచ్చిన తల్లిదండ్రులు సైతం తమ పిల్లల పురోగతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఒకటే కోడింగ్ స్కూల్ ఉండటంతో సీట్ల కోసం తీవ్ర పోటీ ఉంటున్నది. అన్ని జిల్లాల్లో కోడింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. – వెంకటయ్య, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు
పిల్లల ఆలోచనలు అద్భుతం
మా స్కూల్లో పిల్లలను, వారి ఆలోచనలు చూస్తే అద్భుతమనిస్తున్నది. సెలవులకు ఇండ్లకు వెళ్లి అక్కడ స్థానిక పరిస్థితులను గమనించి ఏదో ఒక సమస్యను తీసుకొని స్కూల్‌కు వస్తారు. మా సాంకేతిక బృందంతో చర్చించి, అన్వేషించి వాటికి పరిష్కారాలు కనుగొంటున్నారు.
– మణిమాల, స్కూల్ ప్రిన్సిపాల్
కొత్త కరిక్యులం..సరికొత్త బోధన
మిగతా విద్యార్థులకు భిన్నంగా కోడింగ్ స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా కరిక్యులాన్ని రూపొందించాం. చిన్నారుల ఆలోచనలను ఆవిష్కరణలుగా మలిచేందుకు మెంటారింగ్ చేస్తున్నాం. ప్రపంచమంతా ప్రముఖ అంత్రపెన్యూర్ ఎలన్‌మస్క్ స్కూల్ గురించి మాట్లాడుకొంటారు. ఇదే తరహాలో మన గురుకులాల గురించి మాట్లాడుకొనే రోజులు వస్తాయి.
– రోహిత్, సెక్యూర్డ్ స్పేస్ కంపెనీ డైరెక్టర్