Telangana | ‘పదవికి ముందు.. ఎన్నికల్లో వెనుక’ ఉండే రెడ్డి గారికి ఢిల్లీ పెద్దలు ‘అధికారం మనదే పో’ అన్నరు. ‘సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నమన్నట్టు’ ఎన్నికల్లో గెలువకున్నా ఎన్నికల లీడరు అయినందుకు రెడ్డి చానా హుషారు మీద హైదరాబాద్ బయలెల్లిండు.
ఆ ఢిల్లీ లీడరు ఇచ్చిన చిట్టీ జేబుల పెట్టుకొని గల్లీ పోరుకు బయలెల్లిండు రెడ్డి. ఆఫీసు బయటికొచ్చి కారెక్కిండో లేదో.. ‘నీకిచ్చిన చిట్టీల ఉన్న పేర్లలో మూడు తీసెయ్ ఆల్లు పార్టీ మారిండ్రు’ అని ఢిల్లీ సార్ ఫోన్ల చెప్పిండు.
‘గట్లనే సార్’ అనుకుంట రెడ్డి ఫోన్ పెట్టేసిండు.
బేగంపేటల ఫ్లైట్ దిగి, జోర్దారుగా నడుసుకుంట బయటికొచ్చిండు రెడ్డి. ఫోన్ తీసిండు. ‘పార్టీకి బైబై’ అంటూ ఓ పాతిక మంది దాంక ‘గుడ్ బై మెసేజ్‌లు’ పెట్టిన్రు. రెడ్డికి నీరసమొచ్చింది. కార్ల కూకోని లిస్టుల పేర్లు కొట్టేసుకుంట పోయిండు.
ఆఫీసు ముందు కారు దిగంగనే ‘ఏరయ్యా మనవాళ్లు?’ అని ఆఫీస్ సెక్రట్రీని ఆవేశంగా అరిచిండు రెడ్డి సారు. ‘ఆశావహులంతా వచ్చిండ్రు సారు. అగో ఆడున్నరు’ అంటూ పక్కకు సూపిచ్చిండు. అటో శవయాత్ర.. ఆశావహులంతా దింపుడుకల్లం చూస్తున్నరు. ‘ఛీఛీ’ అంటూ భవిష్యత్‌ని అసహ్యించుకుంటూ ఆఫీసులోకి పోయిండు రెడ్డి.
కాన్ఫరెన్స్ హాల్ అందమైన ఇంటీరియర్‌తో కళకళలాడుతున్నది. కానీ, కిటకిటలాడే క్యాడరే లేదు! ‘ముఖ్యులే రానట్టున్నరే’ అని వచ్చి నోల్లని లెక్కవెడుతూ అడిగిండు రెడ్డి.
‘రాకపోతే లేనట్టే’ అని పార్టీల కొత్తగ జేరిన జంప్ జిలానీ చెప్పిండు.
‘నువ్వు చెప్పినవంటే నమ్మొచ్చు’ అంటూ రెడ్డి కుర్చీల కూలవడ్డడు. వచ్చిన నలుగురు ఆయనకు ఇరుపక్కలా కూకున్నరు. రెడ్డి ప్రెస్ మీట్ మొదలువెట్టిండు.
ఆగమేఘాల మీద వచ్చిన ప్రెస్సోళ్లు ‘మీ పార్టీ టాప్ లీడర్లు అధికారపార్టీతో టచ్‌లో ఉన్నరంట’ అనడిగిండ్రు.
‘పోటీ పార్టీ ఏజెంట్లలెక్క పనిజేస్తున్నరా? నా పక్కనే ఉన్నోడు పక్క పార్టీలా జేరతాండనబట్టిరి… ఆఁ’ అని రెడ్డి గద్దించి మాట్లాడిండు.
‘ఏడి సారూ’ అని ప్రెస్సోళ్లు అనంగనే.. ‘ఇగో’ అనుకుంట పక్కకుతిరిగిండు రెడ్డి. సీట్ల ఆ మనిషి లేడు. రెడ్డికి అనుమానం గొట్టింది.
‘వాష్ రూమ్‌కి పోయిండు’ అని ఎమ్మటే కలరింగిచ్చిండు. గాయబ్ అయిన లీడర్ అంతల్నే కలర్ టీవీల కనపడ్డడు. రెడ్డికి సినిమా కనవడింది. చిట్టీల ఇంకో పేరు కొట్టేశిండు.
‘పట్టుమని పది మంది లేర’ని పక్కనే ఉన్న గడల రాజేందర్ కెల్లి జూసిండు రెడ్డి.
‘ఏం గాదు. క్యాండేట్లు లేకపోతే. ఏమైంది? అసలే మనది కమర్షియల్ పార్టీ. మార్వాడీ మాల్ ఎట్లమ్ముతరో ఎర్కేగా! ఒకటి కొంటె ఒకటి ఫ్రీ లెక్క ఒక టికెట్ అడిగితే రెండు టికెట్లిద్దం, నువ్వో నాలుగు చోట్ల, నేనో రెండు చోట్ల పోటీ జేద్దం’ అని గడల రాజేందర్ చెప్పిండు.
బుర్ర గోక్కుంటున్న రెడ్డి ‘అబ్బ భలే ఐడియా’ అన్నడు. కానీ, రెడ్డికి భయం పట్టుకున్నది. ‘అసలే పెద్ద పదవిల ఉంటి, ఓడిపోతే పరువు పోదా’ అనుకుని, ‘నాలుగు గాదు ఒక్క చోటా పోటీ చేయ’ అన్నడు.
‘నేను పోటీకి దిగుతా.. పోరాడితే పోయేదేమీ లేదు! నా సిట్టింగ్ సీటు తప్ప. ఇట్లయినా గెలువ. అట్లయినా గెలువ. సీఎం నియోజక వర్గంల గూడ పోటీకి దిగుత రాసుకో పేరు!’ అన్నడు రాజేందర్. తగ్గుతా తగ్గుతా కురసైపోయిన లిస్టు ఒక్క లైను పెరిగే సరికి రెడ్డి ఊపిరి పీల్చుకున్నడు.
‘సీఎంపై పోటీ’ అని రెడ్డి ప్రెస్మీట్లో ప్రకటించంగనే ముఖ్యమంత్రి కుర్చీల కూసున్నంత గర్వంతో రొమ్ము విరుచుకున్నడు రాజేందర్.
కెమెరా, మైక్‌లకు కనెక్షన్ సరిగా లేక ఇబ్బంది పడుతున్న ఓ జర్నలిస్టు అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్ర్తాలు పోయినయని గొనుక్కుంట ఏదో దేవులాడుతున్నడు. ఆ మాటకు రాజేందర్ ప్యాంటు గట్టిగ పట్టుకున్నడు. అదేమిటో అదే టైంల రెడ్డి గూడ గట్లనే రియాక్ట్ అయిండు! పాపం!
– వర్ధన్