హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : విద్యాసంస్థల వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరి అని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ పేరొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిట్నెస్ లేని, విద్యార్థులను లెక్కకుమించి ఎక్కించుకుని నడుపుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెహికల్స్‌కు పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ తప్పనిసరి అని తెలిపారు. డ్రైవర్లు లైసెన్స్ లేకుండా, ఓవర్ లోడ్‌తో వాహనాలు నడిపితే వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25,987 విద్యా సంస్థల బస్సులు ఉండగా 22,158 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 3,829 బస్సులు వెంటనే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని చంద్రశేఖర్ గౌడ్ సూచించారు.