యాచారం, సెప్టెంబర్ 30 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మొండిగౌరెల్లిలో బుధవారం నిరసనసెగ తగిలింది. యాచారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మొండిగౌరెల్లిలో పర్యటించారు. మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ మండల నాయకుడు బండిమీది కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి భూసమస్యల పరిష్కారంపై ఆందోళనకు దిగారు.
గ్రామంలో ఇటీవల సేకరించిన భూముల్లో బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డుతగిలారు. మొండిగౌరెల్లిలో ఎమ్మెల్యే పర్యటనను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారనే పక్కా సమాచారంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు పర్యవేక్షణలో సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్సై ప్రియాంక, సతీశ్‌తో పాటు టీజీఎస్పీ పోలీసులను భారీగా మోహరించారు. ఎమ్మెల్యే కాన్వాయ్ వద్దకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకుని.. ఈడ్చుకెళ్లి డీసీఎంలోకి తోసేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.
భూములు కోల్పోతున్న బాధిత రైతులందరికీ న్యాయం చేస్తానని ఎమ్మె ల్యే హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ.. భూసేకరణకు ముందు ఇచ్చిన హామీలను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 19, 68, 127వ సర్వే నంబర్లలో గల రైతులకు విడుతల వారీగా కాకుండా ఒకేసారి అవార్డు పాస్ చేసి, నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతోపాటు 121 గజాల ప్లాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.