తెలుగువారి జేమ్స్‌బాండ్ సెలవు తీసుకున్నాడు. మన కౌబాయ్ గుర్రాన్ని అదిలిస్తూ దిగంతాల్లోకి దూసుకుపోయాడు. దిగ్గజాల మధ్య దూసుకొచ్చి తెలుగుతెరపై తనదైన ముద్రవేసిన స్వాప్నికుడు కన్నుమూశాడు. హీరో అతడి ఇంటిపేరు. తెలుగు తెరకు రంగులు, స్కోపు, 70 ఎంఎం వంటి కొత్త హంగులు అద్దిన తెగువరి. సాహసమే తన ఊపిరి. పాత్ర ఏదైనా వెనుకంజ వేయని తెంపరి. రొమాన్స్, సస్పెన్స్, సెంటిమెంట్ సమపాళ్లలో పండించిన నటశేఖరుడు. లేతమనసులను మాయచేసినా, అల్లూరి సీతారామరాజుగా తెలుగు శౌర్యాన్ని తట్టిలేపినా ఆయనకే చెల్లింది. కురుక్షేత్రంలో దానవీరశూరకర్ణను ఎదుర్కొన్నదీ అతడే. దేవదాసుకు దేవదాసునే పోటీగా నిలిపిందీ అతడే. తెలుగు సినిమా నాలుగో స్తంభమూ అంతర్ధానమైంది. హీరో కృష్ణ మృతితో ఓ సముజ్వల సినీశకం ముగిసింది.
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలుగు తెరపై మరో ధ్రువతార నేలరాలింది. సాహసమే ఊపిరిగా సాగిన దిగ్గజ నటుడి అద్వితీయ ప్రయాణం ముగిసింది. ఐదు దశాబ్దాలుగా తెలుగు సినిమా సూపర్‌స్టార్‌గా వెలుగొందిన కథానాయకుడు కృష్ణ(79) కన్నుమూశారు. గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ఆయ న మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచింది. కృష్ణ పార్థివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, ఇతర ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
మంగళవారం సూపర్‌స్టార్ కృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం మహేశ్‌బాబును ఓదారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలుగు సినీరంగానికి తీరని లోటు: సీఎం కేసీఆర్
ప్రముఖ సినీనటుడు కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కృష్ణ నివాసంలో మంగళవారం కృష్ణ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కృష్ణ తనయుడు, సినీనటుడు మహేశ్ బాబుతోపాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. వ్యక్తిగతంగా తాను గొప్ప మిత్రుడిని కోల్పోయానని, ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలాసార్లు వచ్చానని చెప్పారు. విజయనిర్మల పరమపదించిన సందర్భంలో కూడా తాను వచ్చానని గుర్తుచేసుకొన్నారు. ముకుసూటిగా, అరమరికలు లేకుండా మాట్లాడే మనిషి కృష్ణ అని.. విలక్షణ నటుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. తాను ఓసారి అల్లూరి సీతారామరాజు సినిమా చాలా బావుంది అని కృష్ణతో అన్నప్పుడు ఆయన నవ్వుతూ.. మీరు సినిమాలు కూడా చూస్తారా? అన్నారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు సినిమాను చాలాసార్లు చూశానని కృష్ణకు చెప్పానని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకొన్నారు.
మహేశ్‌బాబును పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్, సినీ నటుడు చిరంజీవి
నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తిని ప్రబోధించే, స్వతంత్ర పోరాటాన్ని తెలియజెప్పే గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించిన సీనియర్ నటుడిగా, దేశభక్తిని పెంపొందింపజేసిన ప్రయత్నాన్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తాను ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని, కృష్ణ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కృష్ణ కుటుంబానికి ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. 350 సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు. నాటి కార్మిక, కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆయన సేవలు అజరామరం: కేటీఆర్
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సంతాపం తెలిపారు. 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహా పాత్రలను పోషించడంతోపాటు అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సంపాదించుకున్నారని గుర్తుచేశారు. సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కృష్ణ సేవలు చిరస్మరణీయం: హరీశ్
నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా సినీనటుడు కృష్ణ చలన చిత్ర రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. వందల చిత్రాల్లో నటించి, సినీప్రియుల హృదయాల్లో సూపర్‌స్టార్‌గా నిలిచిపోయారని కొనియాడారు. కుటుంబ, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రాత్మక పాత్రలను, కౌబాయ్, జేమ్స్‌బాండ్ తరహా విభిన్న పాత్రలు పోషించి సినీ ప్రియులను కృష్ణ రంజింపజేశారని గుర్తుచేశారు. కృష్ణ మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.