హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 11 (నమస్తే తెలంగాణ): ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీలతోపాటు చీరలు పంచడం మీరు చూశారా? ఎన్నడైనా పార్టీ జెండా ఉన్న టీ-షర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలిస్తారని అనుకున్నారా? ఎప్పుడైనా దొంగ ఓట్లు వేసేందుకు 1500 మందిని తెచ్చి.. ఒకే ఫంక్షన్ హాల్లో బస చేయిస్తారని ఊహించారా? ఎక్కడైనా పోలీసులే ఒక అభ్యర్థికి అనుకూలంగా దగ్గరుండి ఓట్లేయించడం గమనించారా?ఎప్పుడైనా పోలింగ్ కేంద్రంలోకి ఒకరు మూడేసి కార్డులు తెచ్చి, ఒకేసారి మూడు ఓట్లు వేయడం విన్నారా? ఎన్నడైనా బైండోవర్ అయిన రౌడీషీటరే పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ దాడులు చేయడం కన్నారా? నిత్యం రాహుల్‌గాంధీ పట్టుకు తిరిగే ఎర్రబుక్కు రాజ్యాంగం సాక్షిగా.. జూబ్లీహిల్స్‌లో ఇవన్నీ జరిగినయ్! నెగ్గలేమని తెలిసీ అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే ఎన్నికల అధికారులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు!
ఇది ప్రజాస్వామ్యమా? రౌడీరాజ్యమా?
ఒక్క ఎన్నిక.. ఒక్క ఎన్నికలో గెలుపు కోసం ఇంత దిగజారుడా? ఇంత చిల్లరతనమా? ఇది ఎన్నికా? దొంగ ఓట్ల జాతరా? వందల కోట్ల బేరమా? ఇది రాష్ట్రమా? రౌడీల రాజ్యమా? ఎన్నికల వేళ విపక్ష ఓటర్లకు బెదిరింపులా? అపార్ట్మెంట్ల వద్ద అటకాయింపులా? ఈసీ ఎక్కడ పోయింది? పోలింగ్ కేంద్రాల వద్దే డబ్బు, చీరల పంపిణీలా? దానికి పోలీసుల కాపలానా? సిగ్గనిపించలేదా?! లక్షల చీరలు, కుక్కర్లు, కోట్లాది నగదు కుమ్మరిస్తున్నా, వంద ఫిర్యాదులిచ్చినా ఎన్నికల అధికారులు కిమ్మనరా? ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు మీద కూడా స్పందించరా? ఇదంతా ఎందుకోసం? ఆఖరుకు ఫేక్ ఓటర్లను పట్టించినా పట్టించుకోరా? కిక్కురుమనరా? ఈసీ కండ్లకు గంతలు కట్టుకొని, చెవుల్లో సీసం పోసుకుని కూర్చున్నదా? ఇదేం సంస్కృతి? ఇదేం రాజకీయం? ఈ మాత్రం దానికి ఎన్నికలెందుకు? ఓట్లెందుకు? ఎన్ని అక్రమాలు? ఎన్ని దౌర్జన్యాలు? ఎన్ని ఉల్లంఘనలు? ఎన్ని బూత్‌ల ఆక్రమణలు? ఇది ఏం సంస్కతి? ఎక్కడినుంచి దిగుమతి అయ్యింది? తెలంగాణలో ఏనాడన్నా ఇలాంటి ఎన్నిక జరిగిందా?
ప్రశాంతంగా వెళ్లి స్వేచ్ఛగా ఓట్లేసే తెలంగాణలో ఇలా గూండాల తండాల స్వైరవిహారం చూశామా? వేలకొద్దీ దొంగ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేసి పంపిణీ చేయడం చూశామా? బస్తీ లీడర్లను ఇండ్లు కూలుస్తామని బెదిరించి ప్రచారం చేయించుకోవడం చూశామా? ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 20వేల మంది దొంగ ఓటర్లను ఇతర ప్రాంతాలనుంచి తరలించి ఫంక్షన్ హాళ్లలో ఉంచడం చూశామా? అధికార పార్టీ గూండాలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే బాధితులనే అరెస్టు చేయడం చూశామా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇందులో పదోవంతు అమలు చేసినా బీఆర్ఎస్ ఓటమి పొందేదా? ఒకటి మాత్రం నిజం! జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక లిట్మస్ టెస్ట్ మాత్రమే. ముందు ముందు వచ్చే ఎన్నికలన్నీ ఇలాగే జరుగుతాయి. ఓట్లు కొనడానికి వెళ్లి వీడియో సాక్షిగా ప్రపంచం ముందు పట్టుబడ్డ నాయకుడి నేతత్వంలోని సర్కారు ఇది. విపక్షాలన్నీ ఈ సంస్కతిని ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకోవాలి. ఈసీలు, గీసీలు ఉత్సవ విగ్రహాలు. ఉత్తరకుమారులు. వాళ్లను నమ్ముకోవడం వధా. ఇదే ఈ ఎన్నిక చెప్పిన గుణపాఠం!! దొంగ ఓట్లు …దొంగ ఓట్లు అంటూ దేశమంతా చెవికోసిన మేకలా అరుస్తూ తిరుగుతున్న రాజ్యాంగ పుస్తక వాహకుడు, తమ పార్టీ ప్రభుత్వపు బుల్డోజర్స్వామ్యానికి ఏ సర్టిఫికెట్ ఇస్తారో?!.