చిక్కడపల్లి, అక్టోబర్ 5 : బీజేపీయేతర ఓట్ల తొలగింపే లక్ష్యంగా ‘సర్’ కార్యక్రమం కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లి బూత్ నంబర్ 210లో 31 ఓట్లు తొలగించారని, దీనివెనుక బీజేపీ బీఎల్ఏ హస్తం ఉందని అన్నారు. బీజేపీ బీఎల్ఏ భానుచందర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఠా జయసింహ ఆధ్వర్యంలో బీఆఆర్ఎస్ నాయకులు సోమవారం సాయంత్రం చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఓట్లు తొలగించినవారిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ముఠా జైసింహ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా మైనారిటీ, బీజేపీ వ్యతిరేక ఓట్లును తొలగించేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ‘సర్’ ప్రక్రియకు ముందు సుమారు రూ.3.10 లక్షల ఓట్లు ఉండగా, ఇప్పుడు 1.75 లక్షలకు తగ్గాయని తెలిపారు. వివిధ కారణాలు చూపుతూ దాదాపు 1.35 లక్షల ఓట్లు తొలగించారని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు హక్కు కల్పించాలని, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.