మల్లన్నసాగర్ పైనా మేడిగడ్డ కుట్ర.. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జలాశయం చుట్టూ భారీ పేలుళ్లు
ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని, హైదరాబాద్ దాహార్తిని తీర్చే మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూల్చాలన్న భారీ కుట్ర జరుగుతున్నదా? కాళేశ్వరం వద్ద గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి బాంబులు పేల్చినట్టుగా అదే తరహా పన్నాగానికి తెగబడుతున్నారా?
- కట్ట కదిలిపోయేలా బ్లాస్టింగ్
- మల్లన్నసాగర్లో నెల రోజులుగా బాంబుల మోత
- రిజర్వాయర్ కట్ట పగుళ్లుబారేలా పేలుళ్లకు కుట్ర?
- సిద్దిపేట జిల్లా తిప్పారంలో అనధికార బ్లాస్టింగ్స్
- గొర్రెలకాపరి ఇచ్చిన సమాచారంతో వెలుగులోకి!
- పేలుళ్ల ధాటికి కట్ట రాళ్లు తొలగి, లీకవుతున్న నీళ్లు
- పేలుళ్లతో అర కిలోమీటరు దూరంలోని ఇండ్లకు బీటలు
- స్థానికుల సమాచారంతో ప్రాజెక్ట్ వద్దకు బీఆర్ఎస్ నేతలు
- రేవంత్ సర్కార్ తీరు, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
- వ్యక్తంచేసిన హరీశ్‌రావు, వంటేరు తదితరులు
- మల్లన్నసాగర్‌ను కూల్చేందుకే ప్రభుత్వం కుట్ర: హరీశ్
పేలుళ్లతో కట్టకు పగుళ్లొచ్చినయ్
బ్లాస్టింగ్ అవుతున్నప్పటినుంచి మల్లన్నసాగర్ కట్ట ఇవతలవైపు నీళ్లు కనపడుతున్నయ్. అంతకుముందు గొర్రెలకు తాపుదామన్నా నీళ్లు లేకుంటుండె. ఇప్పుడు పేలుడుతో రాళ్లు కదులుతున్నట్టున్నయ్. ప్రాజెక్టు కట్టకు పగుళ్లు వచ్చి, అందులోనుంచి నీళ్లు బయటకు వస్తున్నయ్.
-బాలయ్య (గొర్రెల కాపరి)
సిద్దిపేట, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని, హైదరాబాద్ దాహార్తిని తీర్చే మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూల్చాలన్న భారీ కుట్ర జరుగుతున్నదా? కాళేశ్వరం వద్ద గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి బాంబులు పేల్చినట్టుగా అదే తరహా పన్నాగానికి తెగబడుతున్నారా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ పెద్దల కుయుక్తులతో మల్లన్నసాగర్‌ను దెబ్బతీయాలన్న కుతంత్రం నడుస్తున్నదా? రిజర్వాయర్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నదా? రిజర్వాయర్ కట్ట పక్కనే అర్ధరాత్రి జరుగుతున్న అనధికారిక పేలుళ్లు ఇలాంటి అనుమానాలకు తావిస్తున్నాయి. ఇది ఒకటి, రెండు రోజుల నుంచి కాదు.. గత రెండు, మూడు నెలలుగా సాగుతున్నట్టు స్థానికులే చెప్తున్నారు.
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద కొమరవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్ట సమీపంలో అనధికారికంగా భారీ బ్లాస్టింగ్స్ చేపడుతున్నారు. హెచ్‌డబ్ల్యూఎస్ పంప్‌హౌస్ నిర్మాణం కోసం జలమండలి చేస్తున్న ఈ భారీ పేలుళ్లతో రిజర్వాయర్ కట్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడిం ది. హైదరాబాద్‌కు తాగునీటికి, మూసీ సుందరీకరణ కోసం నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న ఇంటెక్వెల్ పనుల కోసం భారీ స్థాయిలో బ్లాస్టిం గ్ చేపడుతున్నారు. ఈ పేలుళ్ల కారణంగా కట్ట కంపిస్తున్నది. కొన్నిచోట్ల కట్ట నుంచి నీటి లీకేజీ జరుగుతున్నది. తిప్పారంలోని ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

నిబంధనలు బేఖాతరు
హైదరాబాద్ మూసీ సుందరీకరణ కోసం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తరలించడానికి ఇకడ సంపు, పంప్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఇరిగేషన్ నిబంధనల కు విరుద్ధం. మల్లన్నసాగర్ కట్ట 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే దీని ఎత్తుకు 10 రెట్ల దూరం అంటే.. కనీసం 400 మీటర్ల దూరం వరకు ఎలాంటి పేలుళ్లు గానీ, నిర్మాణాలు గానీ చేపట్టరాదు. ఇవేమీ పాటించకుండా జిలెటిన్ స్టిక్స్ పెట్టి గత రెండు, మూడు నెలలుగా బండలను పేల్చివేస్తున్నారు. 20 మీటర్ల లోతున తవ్వి టన్నుల కొద్దీ బండరాళ్లను గుట్టలు గుట్టలుగా కుప్పలు పోశారు. ఈ బ్లాస్టింగ్స్‌తో కట్ట పక నుంచి సీపేజీ పెరిగి నీళ్లు బయటకు లీక్ అవుతున్నాయి. నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు గతంలో ఎదురైన నిర్మాణపరమైన సమస్యలు, దెబ్బతిన్న బరాజ్ బ్లాకులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కూల్చే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదన్న అనుమానాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో భారీ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, నాణ్యత, భద్రతపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది.
50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. కేంద్ర జల సంఘం సూచనల మేరకు వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల శివారులో ఈ భారీ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీనిని 2022 ఫిబ్రవరి 23న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా మొత్తం 16,43,665 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుంది. 10 జిల్లాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.

హైదరాబాద్‌కు ఆశాజనకం
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు, మూసీ సుందరీకరణకు 20 టీఎంసీల నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బదనాం చేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం.. హైదరాబాద్‌కు అదే ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ పెద్ద దిక్కయింది. హైదరాబాద్ మహానగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు మూసీ నది పునరుజ్జీవానికి కాళేశ్వరం జలాలను వినియోగించాలనే లక్ష్యంతో చేపట్టిన మల్లన్నసాగర్ నీటి తరలింపు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో చేపడుతున్న పథకం ఫేస్ -2, ఫేస్-3లో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి అదనంగా 20 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ వద్ద ఇంటెక్ వెల్, ముడి నీటి పంప్‌హౌస్, విద్యుత్తు ఉపకేంద్రం, భారీ పైపులైన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మల్లన్న సాగర్ నుంచి తరలించిన నీటిని ఘన్పూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న నీటిశుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన అనంతరం హైదరాబాద్‌కు సరఫరా చేయనున్నారు. ఇంతటి మహత్తరమైన ప్రాజెక్టుపై జరిగే కుట్రలపై ఈ సర్కార్ ఏం సమాధానం చెప్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అర్ధరాత్రి భారీ పేలుళ్లు
మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్ట సమీపంలోనే అర్ధరాత్రి వేళల్లో భారీ బండరాళ్లను పేల్చుతున్నారు. వీటికి అనుమతులు తీసుకున్నారా? బ్లాస్టింగ్‌కు అనుమతి ఇచ్చిన అధికారులెవరు? పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలకు ఏ అధికారి వద్ద సరైన సమాధానం లేదు. ఏ అధికారిని అడిగినా ‘తమకు తెలియదు.. చూడాలి.. వారం క్రితమే ఇక్కడికి వచ్చాను’ అన్న సమాధానాలే వస్తున్నాయి. దీనిని బట్టే ఎలాంటి అనుమతులు లేకుండానే పేలుళ్లు చేపడుతున్నారనే విషయం తేటతెల్లమైంది. రిజర్వాయర్ కట్టకు కేవలం 100 నుంచి 200 మీటర్ల దూరంలోనే రాత్రిపూట చీకట్లో దొంగచాటుగా భారీ బ్లాస్టింగ్స్ చేపట్టడంతో సమీప పొలాల రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

