హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ఉద్యోగం అంటే సర్కారీ కొలువే. ప్రైవేట్ ఉద్యోగం వచ్చినా అది పరిమిత కాలం వరకేనన్న అభద్రతా భావం వెంటాడేది. కానీ, ఇప్పుడు టెక్నాలజీ విస్తరించేకొద్దీ ఉద్యోగాల సృష్టి కూడా అంతే వేగంగా పెరుగుతున్నది. ఆధునిక సమాజానికి విభిన్నమైన కొలువులు చేరువవుతున్నాయి. వాటిలో ‘గిగ్’ ఉద్యోగాలు పలువురిని ఆకట్టుకొంటున్నాయి. ఒప్పంద పద్ధతిలో పరిమిత కాలంపాటు స్వతంత్రంగా పనిచేసే వారినే గిగ్ ఉద్యోగులు అంటారు. ఈ తరహా ఉద్యోగాలు వ్యాపార సామ్రాజ్య కార్యకలాపాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్‌లో గిగ్ ఉద్యోగాలకు చాలా క్రేజ్ ఉన్నది. విభిన్న రకాల కంపెనీలు, హోటళ్లు, దవాఖానలు గిగ్ ఉద్యోగాలకు పెద్దపీట వేస్తున్నాయి. వీటి ద్వారా ఎంతో మంది ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. టెక్నాలజీ విస్తరణతో గిగ్ ఉద్యోగాలు శాశ్వతంగా కొనసాగే అవకాశం ఉన్నది.
‘గిగ్’ వర్కర్లు వీరే
స్విగ్గీ, జోమాటో లాంటి ఫుడ్ డెలివరి సంస్థల్లో పనిచేసేవారు, ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర కాంట్రాక్టర్లు, ప్రాజెక్టులవారీగా పనిచేసే నిపుణులు, ఉబర్, ఓలా లాంటి క్యాబ్ సంస్థల ద్వారా కార్లు, ఆటోలు తిప్పే డ్రైవర్లు, ఐటీ ప్రాజెక్టులు చేసే నిపుణులు, భవన నిర్మాణ కార్యకలాపాలు సాగించేవారు, ఇంటి పనులు చేసేవారు, ఆరోగ్య సేవలు అందించే వారంతా గిగ్ వర్కర్లే. తొలుత ఏదైనా వ్యాపారం ప్రారంభమై ఆ తర్వాత లాభాలను ఆర్జిస్తూ విస్తరించే అవకాశాలున్నప్పుడు గిగ్ వర్కర్ల నియామకాలు జోరందుకొంటుంటాయి. నైపుణ్యం ఉన్నవారికి గిగ్ వ్యవస్థలో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. పనివేళలల్లో స్వతంత్రత, పనిప్రదేశాల్లో వెసులుబాటు (ఎక్కడి నుంచైనా చేసే అవకాశం) తదితర కారణాలతో గిగ్ ఉద్యోగాలు పలువురిని విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. పరిమిత కాలంపాటు పనిచేయాలా? లేక పూర్తికాలం పనిచేయాలా? అన్నది నిర్ణయించుకొనే స్వేచ్ఛ గిగ్ వర్కర్లకు ఉంటుంది. గిరాకీ, అవకాశాలు ఉంటే ఒకేరోజు వేర్వేరు పనులు చేసుకోవచ్చు. 18-24 ఏండ్ల వయస్సువారు ఎక్కువగా గిగ్ ఉద్యోగాలను ఇష్టపడుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఐటీ, ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థల్లో మహిళలకు సైతం గిగ్ ఉద్యోగాలు భారీగా అందుబాటులో ఉన్నాయి.
వచ్చేవన్నీ గిగ్ ఉద్యోగాలే
దేశంలో 85% గిగ్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నాలజీ ప్రాజెక్టుల్లోనే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.7 లక్షల మంది, తెలంగాణలో 2లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య 2.38 కోట్లకు పెరుగుతుందని నీతి ఆయో గ్ అంచనా వేసింది. గిగ్ వర్కర్ల కోసం కేంద్రం చట్టాన్ని తేవాలి. – సలావుద్దీన్, అధ్యక్షుడు, గిగ్ వర్కర్స్ అసోసియేషన్
అనువైన సమయాల్లో ఉద్యోగం
ఓవైపు చదువుకొంటూనే మరోవైపు నాకు అనువైన సమయాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకొంటున్నా. హైదరాబాద్‌లో గంటలవారీగా గిగ్ ఉద్యోగాలు చేసుకొనేందుకు చాలా కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో ఎవరికి అనువైనవాటిని వారు ఎంచుకోవచ్చు. గిగ్ ఉద్యోగాలతో ఎంతో మంది విద్యార్థులతోపాటు ఉద్యోగులు సైతం లబ్ధి పొందుతున్నారు. – రఘు, హిమాయత్‌నగర్