11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు
మురసు తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 11మంది వరద ఉధృతికి కొట్టుకుపోయారు.
- మత్స్యకారులను కాపాడే ప్రయత్నంలో విషాద ఘటన
- ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు అలుగు వద్ద ప్రమాదం
- జాలర్ల రెస్క్యూ కోసం వెళ్లిన మూడు బోట్లలో 2 గల్లంతు
- సహాయ సిబ్బంది కోసం కొనసాగుతున్న గాలింపు
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/సత్తుపల్లి టౌన్, నవంబర్ 4: మురసు తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 11మంది వరద ఉధృతికి కొట్టుకుపోయారు. బుధవారం ఉదయం చేపల వేట కోసం వలలు కట్టేందుకు మత్స్యకారులు బేతుపల్లి చెరువు అలుగు వద్దకు వెళ్లారు. చెరువులోకి భారీగా వరద చేరడంతో ఐదుగురు మత్స్యకారులు చిక్కుకుపోయారు.
స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని 6వ బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది రెండు లైఫ్ బోట్లలో సహాయక చర్యలకు ఉపక్రమించారు. ఒక బోటులో ఐదుగురు, మరో బోటులో ఆరుగురు మొత్తం 11మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఐదుగురు మత్స్యకారులను సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు. వారి బోట్లు ఒడ్డుకు చేరుకునే సమయంలో వరద ప్రవాహానికి అదుపుతప్పి బోల్తాపడ్డాయి.
ఈ ప్రమాదంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ్మిలేరు వాగువైపు కొట్టుకుపోయారు. సిబ్బంది ఆచూకీ కోసం తమ్మిలేరు వాగు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో అజయ్‌కుమార్ సమన్వయం చేస్తున్నారు. లైఫ్ జాకెట్లు ఉండటంతో సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిరాటంకంగా కురిసిన భారీ వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. అశ్వారావుపేట మండలంలో 28 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలో చిక్కుకున్న ఓ మహిళా రైతును ఎస్డీఆర్ఎఫ్ అధికారులు కాపాడారు. పెద్దవాగు ప్రాజెక్టు రింగుబండ తాజా వర్షానికి మళ్లీ తెగింది.
దొంతికుంట చెరువు పూర్తిస్థాయిలో నిండింది. చెరువు కట్టకు గండికొట్టి వరదను దిగువకు విడుదల చేయగా ఆయకట్టు పంటలన్నీ నీటమునిగాయి. అశ్వారావుపేట – ఊట్లపల్లి మార్గంలోని రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలోని ద్వారకాతిరుమలకు చెందిన సుబ్బారావు బైకుపై వరదను దాటే ప్రయత్నం చేసి కొట్టుకుపోగా, పోలీసులు కాపాడారు. దమ్మపేట మండలం దురదపాడుకు చెందిన వీరప్రోలు నాగమణి పొలంలో పనులు చేస్తుండగా పక్కనే మల్లెపూలవాగు ఒక్కసారిగా పొంగింది. దీంతో వరదలో చిక్కుకుంది. సమీపంలో ఓ చెట్టును ఎక్కి ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించింది. ఎస్డీఆర్ఎఫ్ బృందం వచ్చి ఆ మహిళను కాపాడింది.

ఉమ్మడి ఖమ్మంలో విస్తారంగా వర్షాలు
- 7 వరకు కొనసాగనున్న ‘మురసు’ ప్రభావం
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తీరం దాటిన మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాలవ్యాప్తంగా ఎడతెరిపిలేని కుండపోత వర్షాలు కరుస్తున్నాయి. శనివారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్, ఖమ్మం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మురసు తుపాను వల్ల భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా ముల్కలపాలెంలో 23.50 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

