అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు అందుకున్న ‘ఐ విల్ సర్వైవ్’ రచనతో ప్రపంచానికి పరిచయమైన సునీల్ రాబర్ట్ మళ్లీ వార్తలకెక్కాడు. ఈసారి కార్పొరేట్ విజయాలతో కాదు. రచనలతో అసలే కాదు. పరుగుల పోటీల్లో. ప్రమాదంలో గాయపడ్డా సరే.. పట్టుదలతో పరిగెత్తి మారథాన్ విజేతగా నిలిచాడు. ఒకటి కాదు, రెండు కాదు.. 24 మారథాన్లు పూర్తి చేశాడు. అంతేనా ఏడు ఖండాల్లోని భిన్న వాతావరణ పరిస్థితుల్లో మారథాన్లు పూర్తి చేసిన ఘనత సాధించాడు కన్సల్టింగ్ కంపెనీ ఇటాలిస్ట్స్ సీఈఓ సునీల్ రాబర్ట్ వుప్పల.
‘నువ్వు చనిపోతే.. అంతిమయాత్రలో శవాన్ని మోసే నలుగురిలో నా పేరు కూడా రాసుకో’ అంటూ రచయిత సిసిల్ మార్ఫే మా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికి ఆయనకు 76 ఏళ్లు. నాకు 41 ఏండ్లే. 30 ఏండ్ల క్రితం.. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో జరిగిన రైటర్స్ వర్క్‌షాప్‌లో మాట్లాడేందుకు మార్ఫే వచ్చారు. నేనూ అందులో పాల్గొన్నాను. ఆయన్ను పరిచయం చేసుకున్నాను. పన్నెండేండ్ల తర్వాత అమెరికాకి వచ్చాను. ఆయన్ని న్యూజెర్సీలోని మా ఇంటికి ఆహ్వానించాం. మా తిండి, జీవన శైలి చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటికి నా బరువు వంద కిలోలు. ఊబకాయమే కాదు బీపీ కూడా ఉంది. సిసిల్ మా ఇంట్లో ఉన్న మూడు రోజులూ తెల్లవారుజామునే లేచి, అయిదారు కిలోమీటర్లు పరిగెత్తి వచ్చేవాడు. నేను ఎంతసేపూ క్రికెట్ చూసేవాణ్ని. మూడ్ ఉంటే జిమ్‌కి వెళ్లేది. ఆ తర్వాత దిట్టంగా అన్నం, తృప్తిగా స్వీట్ తినేవాడిని. ఇక శరీరం ఎలా తగ్గుతుంది? ఆయన మాటల్లోని వ్యంగ్యం అర్థమైంది. నా వయసుకి ఈ సమస్యలు మంచిది కాదని అప్పటికే డాక్టర్ చెప్పారు.

సిసిల్ స్ఫూర్తితో అలవాట్లు మార్చుకున్నాను. తిండిని కొంచెం కొంచెం తగ్గించాను. రోజూ వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. నా కుడి మోకాలు శరీర బరువుని మోయలేదు. హైదరాబాద్‌లో మార్కెటింగ్‌తో నా కెరీర్ మొదలైంది. అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్నాను. ఓ రోజు ప్రమాదంలో మోకాలికి గాయమైంది. సర్జరీ చేశారు. డిశ్చార్జ్ అయ్యేముందు ‘బాబూ జీవితాంతం కుంటాల్సి రావొచ్చు. వాకర్ పట్టుకుని నడవాల్సి వస్తుంది’ అన్నారు డాక్టర్. అప్పటి నుంచి బాసింపట్టు వేసుకుని కూర్చోవడం కష్టమయ్యేది. మెట్లు ఎక్కడం, దిగడానికి ఇబ్బంది పడేవాణ్ని. ఆ కాలంలో విపరీతమైన డిప్రెషన్లోకి పోయాను. పట్టుదలతో నా కెరీర్‌ని కొనసాగించాను. ఒక్కోమెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరుకున్నాను. పన్నెండేళ్లు గడిచేసరికి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేరాను. నా నివాసం అమెరికాకు మారింది. ఊబకాయం, బీపీ నుంచి విముక్తి కోసం వ్యాయామం చేయాలంటే ఆ గాయం మోకాలడ్డింది. థ్రెడ్ మిల్ మీద పడిపోతానేమోనని నిమిషానికి మించి పరిగెత్తేవాణ్ని కాదు. నెమ్మదిగా వేగం, సమయం పెంచాను. మూడేళ్లు గడిచింది. వేగం పుంజుకుంది. పదిహేను కేజీల బరువు తగ్గాను. నా నడకలో కొంత మార్పు వచ్చింది. ‘ఫిలడెల్ఫియా మారథాన్ 2010’లో పాల్గొన్నాను. హాఫ్ మారథాన్ విజయవంతంగా పూర్తి చేశాను.
న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొనాలని అనుకున్నాను. దానికి సిద్ధం కావాలంటే నాలుగు నెలల ముందే ప్రణాళిక వేసుకోవాలి. రెండు నెలలపాటు 15 నుంచి 20 కిలోమీటర్లు పరిగెత్తాను. మూడు, నాలుగో నెలల్లో 30 నుంచి 35 కిలోమీటర్లు పరిగెత్తాను. ‘న్యూయార్క్ మారథాన్- 2011’లో 42 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేశాను. ఇది ప్రపంచంలోని టాప్-3 మారథాన్లలో ఒకటి. ఇక పరుగు ఆపొద్దనుకున్నాను. ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఆరు మారథాన్లలో ఒకటైన చికాగో మారథాన్లోనూ పాల్గొని విజయవంతంగా పూర్తి చేశాను. టాప్-6 మారథాన్లు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. లండన్, బోస్టన్, బెర్లిన్ మారథాన్లు పూర్తి చేశాను. టోక్యో మారథాన్కీ ఎంపికయ్యాను. తీరా సమయానికి కరోనా కలకలం మొదలైంది. నాలుగేండ్లకు టోక్యో మారథాన్లోనూ గమ్యం అందుకున్నాను. అలా ప్రపంచంలోని టాప్-6 మారథాన్లను పూర్తి చేసిన రన్నర్స్ క్లబ్లో చేరాను. ఈ ఘనతను సాధించిన 8 వేలమంది క్రీడాకారుల్లో నేనొకడిని. పరుగు నాకు ఆరోగ్యమే కాదు విజయాలూ ఇచ్చింది. ఇంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది?

‘అనుకున్నది సాధించాను’ అనుకుంటున్నప్పుడే ఇంకో ఆలోచన వచ్చింది. వేర్వేరు ఖండాల్లోని వేర్వేరు వాతావరణాల్లోనూ మారథాన్ పూర్తి చేయాలనిపించింది. అప్పటికే నాలుగు ఖండాల్లో పూర్తి చేశాను. మిగతా ఖండాల్లోనూ గెలవాలని మూడేండ్ల క్రితం ‘రియో మారథాన్-2023’ పూర్తి చేసి దక్షిణ అమెరికా ఖండాన్ని నా ఖాతాలో వేసుకున్నాను. మార్చి నెలలో అంటార్కిటికాలో మైనస్ పది డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణంలో మారథాన్ పూర్తి చేశాను. ఇటీవలే దక్షిణాఫ్రికాలోని ‘కేప్‌టౌన్ మారథాన్’ పూర్తి చేశాను. దీంతో ఏడు ఖండాల్లో మారథాన్ పరుగులు పూర్తి చేసిన రికార్డు వచ్చింది. ఈ ఘనత సాధించిన పదకొండు మంది భారతీయుల్లో నేనొకడిని.