మన దేవుడు.. మన గుర్తింపు..
ఎములాడ రాజన్న తోడుగా.. యాదాద్రి నర్సన్న అండగా.. భద్రాద్రి రామయ్య దీవించగా.. అలంపూర్ జోగుళాంబ శక్తి జతకలవగా.. తెలంగాణ సాధనకు ఉద్యమ పథాన్ని ఎంచుకున్నారు కేసీఆర్.
ఎములాడ రాజన్న తోడుగా.. యాదాద్రి నర్సన్న అండగా.. భద్రాద్రి రామయ్య దీవించగా.. అలంపూర్ జోగుళాంబ శక్తి జతకలవగా.. తెలంగాణ సాధనకు ఉద్యమ పథాన్ని ఎంచుకున్నారు కేసీఆర్. ఉద్యమ సమయంలో ఏ దిక్కుకు పోయినా.. అక్కడ పెద్ద దిక్కుగా చెప్పుకొనే దైవాన్ని దర్శించుకోవడం, ముడుపులు కట్టేవారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజున.. ముక్కోటి దేవతలకూ ప్రణమిల్లారు. ప్రాజెక్టుల్లోనే కాదు.. జిల్లాల పునర్విభజనలోనూ ఆ దైవాలను సదా స్మరించుకునేలా కృతజ్ఞత చాటుకున్నారు కేసీఆర్.
సాధారణంగా జిల్లాలో పుణ్య క్షేత్రాలు ఉంటాయి. కానీ, ఆ దేవుళ్ల పేరిటే జిల్లాలు అరుదుగా ఉంటాయి కదా! కేవలం భౌగోళిక సరిహద్దులను మాత్రమే మార్చకుండా, ఆయా ప్రాంతాల సంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా కొత్త జిల్లాలకు దేవుళ్ల పేర్లు కలిసివచ్చేలా నామకరణం చేశారు కేసీఆర్. భద్రాద్రిలో భక్తి , యాదాద్రిలో ఆధాత్మిక వారసత్వం, జోగుళాంబలో శక్తి, రాజన్నలో ప్రజల అనుబంధం, కుమ్రంభీంలో ఆదివాసీ పోరాటం, జయశంకర్లో ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఆలోచనా ఉద్యమం ఇలా మన చరిత్ర, వైభవం తరతరాలకూ చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవి కేవలం పేర్లు కావు, తెలంగాణ తనను తాను గుర్తించుకున్న ఆరు దర్పణాలు.
కొత్త జిల్లాలకు ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవతలు, మహనీయుల పేర్లు పెట్టడం వెనక అనేక అస్తిత్వ అంశాలు దాగున్నాయి. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయాణంలో ఈ ప్రాంతాల ప్రత్యేకతలు ప్రధాన పాత్ర పోషించాయి. ఆ ప్రాంత ప్రజల ఆధ్యాత్మికతకు చిరునామా, ఈ ప్రాంతపు పోరాట చరిత్రను తెలిపే యోధుడి యాదిలో, స్వరాష్ట్ర సాధనలో మేధావుల పాత్రను గుర్తు చేసే విధంగా ఆయా పేర్లను పెట్టి సరైన గుర్తింపునిచ్చారు కేసీఆర్. జిల్లా పేరు కేవలం ఒక పరిపాలనా గుర్తింపు మాత్రమే కాకుండా చారిత్రక ప్రకటనగా నిలిచిపోయేలా పునర్ వ్యవస్థీకరణ చేశారు.
రాజన్న సిరిసిల్ల
శ్రమకు, దైవత్వానికి వారధి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిది. సామాన్య, మధ్య తరగతి భక్తులకు రాజన్న దర్శనం ఓ ముఖ్యమైన ఘట్టం. కోరిన కోర్కెలు తీర్చే ఈ స్వామికి కోడెను కట్టి మొక్కులు చెల్లించడం ఇక్కడి ఆనవాయితీ. కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రాంత అస్తిత్వం సైతం రాజన్న క్షేత్రంతోనే ముడిపడి ఉంది. ఒకప్పుడు సంపదకు కేంద్రంగా ఉన్న సిరిశాల నేడు నేతన్నలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సమైక్య పాలనలో ఆత్మహత్యలతో కుదేలైన సిరిసిల్లకు బీఆర్ఎస్ చేయూతనందించి నేతన్న మగ్గానికి జీవం పోసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైన ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు ఊతమిచ్చారు కేసీఆర్. అదే సమయంలో ఆధ్యాత్మిక శోభకు ప్రాధాన్యమిచ్చారు. ఇక్కడి శ్రమజీవుల కష్టానికి, రాజన్న ఆశీస్సులకు ఉన్న ఆత్మీయ బంధానికి గుర్తుగా ‘రాజన్న సిరిసిల’్ల అని నామకరణం చేశారు.

Vemulavada
యాదాద్రి భువనగిరి
తెలంగాణ స్వయం ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. శతాబ్దాలుగా తెలంగాణ గుండెల్లో కొలువై పురాణ వైభవం కలిగిన యాదగిరిగుట్ట నర్సన్న కేవలం ఒక దైవం కాదు.. తెలంగాణ రక్షణ కవచం. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఈ జిల్లాను ఏర్పాటు చేసే క్రమంలో రెండు ప్రాంతాలకు సంబంధించిన విశిష్ఠమైన చరిత్రను మేళవించారు. సమైక్య రాష్ట్రంలో అరకొర వసతులతో ఉన్న పంచ నారసింహ క్షేత్రమైన యాదగిరిగుట్టను స్వరాష్ట్రంలో వేల కోట్లతో, కృష్ణ శిలలతో అద్భుతమైన ఆధ్యాత్మిక నగరిగా పునర్నిర్మించారు కేసీఆర్. తెలంగాణ సాయుధ పోరాటంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన భువనగిరికి ఆధ్యాత్మికమైన యాదాద్రి పేరును జోడించారు. ఆంధ్రా ప్రాంతంలోని తిరుమలకు ఉన్న ఆధ్యాత్మిక అస్తిత్వం తెలంగాణకు ఉందని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘యాదాద్రి భువనగిరి’గా నామకరణం చేసి అస్తిత్వ ఉనికికి పట్టం కట్టారు.
జోగుళాంబ గద్వాల
అష్టాదశ శక్తి పీఠాలలో ఐదోదైన ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారి పేరిట జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పడింది. తుంగభద్ర, కృష్ణానదుల సంగమ క్షేత్రమైన గద్వాల ప్రాంతం కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రూపొందించిన ఈ జిల్లాకు జోగుళాంబ అని పేరు జోడించడం ద్వారా తెలంగాణ సరిహద్దుల్లోని సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడంతో పాటు ఇక్కడి ప్రాచీన మాతృస్వామ్య శక్తి ఆరాధన గుర్తింపును చాటిచెప్పారు. తెలంగాణ సంస్కృతిలో బోనాల తరహాలో అమ్మవారి ఆరాధనకు ఉన్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ శక్తిపీఠం పేరును ఈ జిల్లాకు పెట్టడం ద్వారా ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, మాతృస్వామ్య ఆరాధన గుర్తింపును చాటిచెప్పారు.

Alampur Jogulamba
భద్రాద్రి కొత్తగూడెం
తెలుగు నేలపై శ్రీరాముడంటే భద్రాచల పుణ్యక్షేత్రమే కండ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఒకవైపు యుగయుగాల ఇతిహాస స్మృతితో ముడిపడిన భద్రాచలం, మరోవైపు ఆధునిక తెలంగాణ పారిశ్రామిక చరిత్రకు ప్రతీకగా నిలిచిన కొత్తగూడెం… ఈ రెండు పేర్లను కలుపుతూ ఖమ్మం జిల్లాలో భాగమైన కొన్ని మండలాలతో ‘భద్రాద్రి కొత్తగూడెం’ జిల్లా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీరామక్షేత్రం భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం. భద్రాచలం అంటే కేవలం ఆలయం మాత్రమే కాదు. రామదాసు జ్ఞాపకం, పావన గోదావరి తీరం, రామభక్తి కీర్తనల సంప్రదాయం అన్నీ కలిసిన సంగమ స్థానమిది. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఈ ప్రాంతమంతా గిరిజన సంస్కృతితో పెనవేసుకుని కనిపిస్తుంది. కంచెర్ల గోపన్న రామదాసుగా మారిన ఈ ప్రాంతం ఆయనకు స్ఫూర్తిగా నిలిచిన దమ్మక్క వంటి గిరిజన మహిళ సంకల్పం, భద్రరుషి తపస్సు, తానీషా చక్రవర్తి ఔన్నత్యం.. ఇలా కులమతాలకు అతీతంగా గోదావరి తీరాన ఉన్న చారిత్రక, పురాణ ప్రాధాన్యం ఉన్న ఈ క్షేత్ర నామాన్ని కొత్తగూడెంతో కలిపి జిల్లాగా ప్రకటించడం ఆ రామయ్య అనుగ్రహమే!

Bhadradri Ramalayam
ఆధ్యాత్మిక అస్తిత్వం
తెలంగాణలో భక్తి, స్థానిక దైవాల ఆరాధన ప్రజల జీవన విధానంలో అంతర్భాగం. సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంత పండుగలైన బోనాలు, బతుకమ్మ, ప్రాంతీయ దైవాలైన రాజన్న, జోగుళాంబ గుర్తింపునకు నోచుకోలేదు. జిల్లాలకు ఈ పేర్లు పెట్టిన కేసీఆర్ సర్కార్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది వేసింది. ఇది కేవలం ఆధ్యాత్మిక అస్తిత్వమే కాకుండా, పర్యాటక రంగాన్ని వృద్ధి చేసి, ప్రాంతీయ ఆర్థిక అస్తిత్వాన్ని కూడా పెంచుతుంది. తెలంగాణ కొత్తపటంలో సరిహద్దులు మాత్రమే మారలేదు. తనను తాను గుర్తించుకునే భాష కూడా మారింది. దేవతల పేర్లలో సంస్కృతిని, యోధుల పేర్లలో తన పోరాటాన్ని, జయశంకర్‌సార్ లాంటి ఉద్యమ మేధావుల పేర్లలో తన ఆలోచనను కలగలిపి తెలంగాణ రాష్ట్రం తన కొత్త జిల్లాల చిరునామాల్లో రాసుకున్నది. చిరునామా మారితే ఒక ప్రాంతం గుర్తు మారుతుంది. పేరు మారితే ఒక తరానికి జ్ఞాపకంగా మిగులుతుంది. కానీ, ఆ జ్ఞాపకాన్ని పాలనలోకి తీసుకొని వస్తే.. ఆ ప్రాంత అస్తిత్వం సజీవంగా ఉంటుంది. తెలంగాణ నేల కోసం పోరాడిన వారి అడుగుజాడలు, ఇదే నేలను నిలబెట్టిన సంస్కృతి, ఈ నేల తనదేనని చాటిన అస్తిత్వం అన్నీ ఇప్పుడు గోచరం అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణతో తెలంగాణ తన చరిత్రను భవిష్యత్తు
చిరునామాగా మార్చుకుంది.
జయశంకర్ భూపాలపల్లి
దైవాల పేర్లకే కాకుండా ఈ ప్రాంతపు ప్రజల గుండెల్లో చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిపోయిన ప్రముఖుల పేర్లనూ జిల్లాలకు పెట్టారు కేసీఆర్. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్‌ను యాదిజేస్తూ.. ‘జయశంకర్ భూపాలపల్లి’ జిల్లా ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త, మేధోనాయకుడిగా పేరుపొందారు. ఇది వ్యక్తికి ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ నినాదాలతో సాగలేదని, దాని వెనుక గణాంకాలు, చరిత్ర, ప్రాంతీయ అసమానతల విశ్లేషణ, ఆర్థిక సామాజిక వాదనలు ఉన్నాయని గుర్తు చేసేలా జయశంకర్ సార్ పేరును శాశ్వతం చేశారు కేసీఆర్.
కుమ్రం భీం ఆసిఫాబాద్
నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన యోధుడు కుమ్రం భీం. ఆయన జన్మించిన సంకేపల్లి, మరణించిన జోడేఘాట్ ప్రాంతం ఆసిఫాబాద్‌లోనే ఉండటంతో ఆయనకు నివాళిగా కేసీఆర్ ప్రభుత్వం ‘కుమ్రం భీం ఆసిఫాబాద్’ జిల్లా ఏర్పాటు చేసింది. నిజాం నవాబుల జంగ్లాత్ చట్టాలు, గిరిజనులపై జరిగిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కుమ్రం భీం గెరిల్లా పోరాటం చేశారు. గిరిజన ఉద్యమాల్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నినాదమైన జల్-జంగల్-జమీన్ అంటూ పోరాడి అమరుడైన గిరిజన వీరుడు ఆయన. ఆదివాసి సమాజం భీముడిని తమ ఆరాధ్యదైవంగా, భీమ్ పెన్ (భీమ్ దేవుడు) రూపంలో పూజిస్తుంది. ఈ జిల్లా పేరు వెనక గిరిజన అస్తిత్వం, వారి దైవభావన దాగి ఉన్నాయి.
– రంగనాథ్ మిద్దెల
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

