‘గం గం గణేశా’ అంటూ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, ‘ఆయ్’,‘క’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నది ముంబయి బ్యూటీ నయన్ సారిక. పేరుకు తగ్గట్టే నయనాలతోనే నటించేస్తుంది. చారడేసి కళ్లతో కనికట్టు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో హిట్లు కొడుతున్నది. తాజాగా సంగీత్ శోభన్ సరసన హారర్, కామెడీ సినిమా ‘రాకాస’లో నటించి మరోసారి తనేంటో నిరూపించుకున్నది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా ఫంక్ పల్లవి పంచుకున్న కార్వాన్ కబుర్లు.
నేను పుట్టింది మహారాష్ట్ర. నాకు చిన్నప్పటినుంచి నటి కావాలని ఉండేది. అయినా కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత యాక్టర్ అయ్యాను. ఒకవేళ నేను నటన వైపు రాకపోయి ఉంటే లాయర్ అయ్యేదాన్ని. సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చే వాటిలో న్యాయవాద వృత్తి గొప్పదని నా భావన.
మానస శర్మతో నాకు గతంలోనే పరిచయమున్నది. ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘బెంచ్ లైఫ్’ వెబ్‌సిరీస్‌లో నేను నటించాను. అందువల్ల డైరెక్టర్‌గా కాకుండా ఓ ఫ్రెండ్‌లా భావించాను. షూటింగ్ టైంలో సరదాగా ఉండే వ్యక్తిత్వం ఆమెది. గెటప్ శ్రీను, శోభన్ ఇద్దరూ ఇద్దరే. షూటింగ్ టైంలో గ్యాప్ దొరికితే చాలు నవ్విస్తూనే ఉంటారు. మా టీంలో యూత్ ఎక్కువ ఉండటం వల్ల సమయమన్నది తెలియలేదు. నిజంగా ఆ టీంతో వర్క్ చేయడం ఓ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
వరుసగా తెలుగు సినిమాలు చేస్తుండటం వల్ల తెలుగు భాషమీద మమకారం ఏర్పడింది. ప్రారంభంలో డైలాగ్స్ చెప్పడం కష్టంగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితిని అదిగమించాననే అనుకుంటున్నా. ‘ఆయ్’ సినిమా షూటింగ్ సమయంలో ఆత్రేయపురం పూతరేకులు, గోదావరి ప్రజల ఆప్యాయతకు ఫిదా అయ్యాను. ఇప్పుడు నన్ను నేను తెలుగు అమ్మాయిగానే పరిచయం చేసుకుంటున్నాను.
పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం నా హాబీలు. ఎప్పటికైనా అనుష్క నటించిన ‘అరుంధతి’ వంటి పవర్ఫుల్ పాత్రలు చేయాలన్నది నా కల.ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అవార్డులు అందుకునే వారు అరుదుగా ఉంటారు. అందులో నేను ఉన్నందుకు గర్వంగా ఉంది. ఇటీవలి కాలంలో ఫిలింఫేర్ అవార్స్లో బెస్ట్ డెబ్యూ హీరోయిన్గా పురస్కారం అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.
ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఒకానొక సమయంలో ఎన్టీయార్, అల్లు అర్జున్ కూడా నా నటన గురించి ప్రశంసించారు. ‘నయన్ ఉందంటే ఆ సినిమా బాగుంటుందని’ ప్రేక్షకులు అనుకోవాలన్నదే నా లక్ష్యం. దర్శకుడు రాజమౌళిగారి సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేయాలన్నది నా డ్రీమ్. భవిష్యత్తులో నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను.