దేశోద్ధారకుడు పీవీ బయోపిక్’ఎప్పుడు?

ఇప్పుడు బయోపిక్‌ల జమానా నడుస్తున్నది. పతకాలు పండించిన క్రీడాకారుల జీవితాలు వెండితెరపై అందంగా పండాయి. ముఖ్యమంత్రుల జీవితాలూ సెల్యులాయిడ్‌పై సెల్యూట్స్ అందుకున్నాయి. మన పీవీ కథ కూడా సినిమాలకు సరిగ్గా సరిపోతుంది. ఆయన జీవితంలో కావలసినన్ని మలుపులున్నాయి. బోలెడన్ని ట్విస్టులున్నాయి. ఊహకందని విజయాలున్నాయి. ఓ బయోపిక్కు కావాల్సిన అన్ని దినుసులూ ఆయన జీవితంలో అడుగడుగునా ఉన్నాయి. తెరకెక్కించడమే తరువాయి..
కట్ చేస్తే..
అనగనగా ఓ కుగ్రామం. అక్కడ ఓ పసిబాలుడు. చదువుల్లో మహా చురుకు. బాల్యంలోనే దత్తతకు పోయి వెయ్యి ఎకరాలకు వారసుడయ్యాడు. చదువు కోసం ఊరు దాటాడు. జిల్లాలు దాటాడు. స్వరాజ్య ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. విద్యాభ్యాసం కొనసాగించడానికి రాష్ట్రం దాటాడు. న్యాయవాదిగా తిరిగొచ్చాడు. రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. భారీ సంస్కరణలకు నాంది పలికాడు. ఆ క్రమంలో తన వెయ్యి ఎకరాల జమీన్‌ను దానం చేసి సిసలైన ప్రజాప్రతినిధి అనిపించుకున్నాడు. రాజకీయ కుతంత్రాలు పదవిని దూరం చేశాయి. అయినా, ఆయన కించిత్ వెరవలేదు. రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తే అందులో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. రాజకీయాలు చాలనుకొని సొంతూరుకు వచ్చేద్దామనుకున్నాడు. ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఊహించని మలుపు. ఆయన మళ్లీ హస్తినకేగాడు. ఈసారి ఏకంగా దేశానికి ప్రధానమంత్రే అయ్యాడు.ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వేసుకోవచ్చు..
అ‘ద్వితీయార్ధం’
సాధారణంగా పొలిటికల్ బయోపిక్‌లు కథానాయకుడు ఉన్నత పదవిని అలంకరించడంతో సమాప్తం అవుతాయి. పీవీ కథ మాత్రం అత్యున్నత పదవి అధిరోహించిన తర్వాత మొదలైంది. ఆయన చాణక్య నీతి ద్వితీయార్ధాన్ని కన్నార్పకుండా సినిమా చూసేలా చేస్తుందంటే అతిశయం కాదు. మైనారిటీ సర్కార్‌ను నడిపించటంలో చూపిన చాణక్యనీతి కథను రసకందాయంలో పడేస్తుంది. ఇక్కడి నుంచే నాటకీయ మలుపులు మొదలవుతాయి. ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. పదవిలోకి వచ్చేసరికి దేశంలో ఉన్న పరిస్థితులు, వాటిని ఆయన చక్కదిద్దిన తీరు.. పీవీ శక్తియుక్తులను భావితరాలకు పరిచయం చేస్తుంది. నాటకీయంగా చూపించడానికి దర్శకుడు కష్టపడాల్సిన పనీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా, నిజాయతీగా చూపించగలిగితే చాలు.. ఆ సన్నివేశాలు ఊహించనంతగా పండుతాయి. పీవీ పదవీకాలం పూర్తవ్వడంతో సినిమా ముగించొచ్చు. ‘అదేంటి సినిమా అన్నాక హ్యాపీ ఎండింగ్ ఉండాలి కదా!’ అంటారా.. ప్రజలు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా ఎలా నిర్వర్తించాలో చెబుతుంది పీవీ జీవితం. పదవి వీడి ఆయన వస్తున్నప్పుడు ఆ కండ్లల్లో భావితరాలకు మేలు చేశాననే సంతృప్తిని క్లోజప్ షాట్లో క్యాప్చర్ చేయగలిగితే అంతకన్నా హ్యాపీ ఎండింగ్ ఏముంటుంది!!

పీవీ బయోపిక్ నిర్మించడానికి ఆయన శతజయంతి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది. కథ కోసం నెలలకు నెలలు పరిశోధన చేయాల్సిన పనిలేదు. ‘ది ఇన్సైడర్’ను పీవీ కోణంలో చదివి, ఆయనలా అర్థం చేసుకోగలిగితే కథ సిద్ధమవుతుంది. నేటి భారత ఆర్థిక స్థితిగతులకు కారణాలను విశ్లేషిస్తే ఆయన చేపట్టిన సంస్కరణల గురించి తెలుస్తుంది. ఢిల్లీ గద్దెకు నిండుదనం తెచ్చిన ఈ తెలంగాణ బిడ్డ బయోపిక్కు ‘దేశోద్ధారకుడు’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

