మా బస్తీకే గెస్ట్ గా వెళ్లా!
బస్తీలో పుట్టిపెరిగినా భయపడకుండా అడుగేసింది. తెలంగాణ ఉద్యమంలో గళం విప్పి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. అందరూ ఎగతాళి చేసినా పట్టువదలకుండా అనుకున్నది సాధించింది. చదువుకునేందుకు కూడా స్తోమత లేని దశ నుంచి సంపాదించే స్థాయికి ఎదిగింది.
బస్తీలో పుట్టిపెరిగినా భయపడకుండా అడుగేసింది. తెలంగాణ ఉద్యమంలో గళం విప్పి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. అందరూ ఎగతాళి చేసినా పట్టువదలకుండా అనుకున్నది సాధించింది. చదువుకునేందుకు కూడా స్తోమత లేని దశ నుంచి సంపాదించే స్థాయికి ఎదిగింది. ఇతరుల సాయంతో చదువుకుని తన కెరీర్‌ని తానే మలుచుకుంది. తండ్రి వద్దన్నా ఎదిరించి నిలిచింది. తాను పుట్టిపెరిగిన బస్తీకే అతిథిగా హాజరై అందరికీ తన గాథ వినిపించింది. చుట్టూ ఉన్న చుట్టాలే మాటలతో బాధించినా తానేంటో నిరూపించుకుని నటిగా గుర్తింపు సాధించింది తెలంగాణ బిడ్డ శ్వేతా రెడ్డి. నలుగురు ఆడపిల్లల్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు కొడుకుగా మారి వారి రుణం తీర్చుకుంటున్నానంటూ జిందగీతో శ్వేత పంచుకున్న ముచ్చట్లు..
నాన్నది కరీంనగర్, అమ్మది వరంగల్. మా కుటుంబం హైదరాబాద్‌లో సెటిలైంది. నా బాల్యమంతా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఉన్న అరుంధతినగర్ బస్తీలో సాగింది. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. నేనే చిన్నదాన్ని. నాన్న ఆటో నడిపేవాడు. అమ్మ ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. నాన్న ఒక్కడి రెక్కల కష్టం మీదే ఇల్లంతా నడిచేది. అందుకే అక్కలకు చిన్నవయసులోనే పెండ్లిళ్లు చేసేశారు. నన్ను చదివించాలని నాన్న చాలా కష్టపడేవాడు. నేను ఏడో తరగతిలో ఉండగా తెలంగాణ ఉద్యమ గీతాలు పాడేందుకు వెళ్లేదాన్ని. అక్కడ జలజ పరిచయమైంది. ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా నన్ను తీసుకెళ్లేది. ఈ క్రమంలోనే ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ గీతాలు ఆలపిస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అలా ఎనిమిదో తరగతిలోనే ఉద్యమంలో భాగంగా ఒకరోజు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాను. ఆ సమయంలోనే ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఎండీ వేదసాగర్ సార్ పరిచయమయ్యారు. ఆయన నన్ను చూసి వాళ్ల స్కూల్లో 9, 10 తరగతులకు ఉచితంగా చేర్చుకున్నారు. అలా హైస్కూల్ చదువు పూర్తిచేశా.
సింగర్ కావాలనుకున్నా..
పదో తరగతి పూర్తయిన తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డిగారు వారి కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చారు. దాంతో డిప్లొమాలో చేరాను. చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో ఓ కోచింగ్‌లో జాయినయ్యి పార్ట్‌టైమ్ జాబ్‌చేస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలోనే సీరియల్స్‌లో చేసే అవకాశం వచ్చింది. నిజానికి నాకు చిన్నప్పటి నుంచీ పాటలు పాడటం అంటే ఇష్టం. సింగర్ అవ్వాలని ఉండేది. కానీ, కుటుంబ పరిస్థితుల వల్ల ఆ ఆలోచనలు పక్కనపెట్టా. లోకల్ చానెల్లో యాంకర్‌గా చాన్స్ వచ్చింది. రెండు నెలల తర్వాత లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి వచ్చిన ఓ కాస్టింగ్ మేనేజర్ ‘జంతర్‌మంతర్’ సీరియల్లో వారం రోజులకుగానూ ఓ పాత్రలో అవకాశం ఇచ్చారు. అలా మొదటిసారి తెరమీద కనిపించా.
నాన్న ఒప్పుకోలేదు..
సీరియల్స్‌లో అవకాశం వచ్చినప్పుడు మొదట నాన్న ఒప్పుకోలేదు. దాదాపు ఎనిమిది నెలలు నాతో మాట్లాడలేదు. బంధువులు కూడా ఆడపిల్ల బయటికి వెళ్లి సంపాదించాలా? అని చాలా మాటలన్నారు. కానీ, నేను పట్టు విడవలేదు. ఎట్టకేలకు నాన్న ఓకే అన్నారు. సీరియల్స్‌లో రాణించి నా సక్సెస్‌తో అందరికీ సమాధానం చెప్పా. ఇప్పుడు అందరూ నాన్నకు ఫోన్ చేసి నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఆయన చాలా ఆనందపడతారు. మా కోసం జీవితమంతా కష్టపడ్డ నాన్నకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నాన్న, అక్కవాళ్లందరూ చాలా హ్యాపీ. మొదట్లో నాకు వచ్చే డబ్బులు నా అవసరాలకు కూడా సరిపోయేవి కాదు. నాన్న దగ్గరే తీసుకునేదాన్ని. ఏదో ఒకరోజు నేను సాధించి చూపిస్తాను అని చెప్పేదాన్ని. అనుకున్నట్లుగానే మూడేండ్లలో మంచి పేరు వచ్చింది. నేను పుట్టిపెరిగిన బస్తీలో జరిగిన బతుకమ్మ సంబురాలకు నన్ను గెస్ట్‌గా పిలిచారు. నా ముందున్న వారికి నేనేంటో తెలుసు. నేను అక్కడే పెరిగాను. అలాంటి వారిముందు నేను అతిథిగా స్పీచ్ ఇవ్వడం చాలా సంతోషం కలిగించింది. ఎక్కడికి వెళ్లినా అభిమానులు గుర్తించి ఆదరించడం చాలా బాగుంటుంది.
నా సంపాదనతో..
2016లో నా మొదటి సంపాదన తీసుకున్నా. అప్పటినుంచీ అమ్మానాన్నలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా. ఏటా అమ్మానాన్నల పెండ్లి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాను. మా కోసం వాళ్లెంతో కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్లను హ్యాపీగా ఉంచడమే కూతురిగా నా బాధ్యత. ఇప్పటికైతే కెరీర్ మీదే దృష్టి సారించాను. పెండ్లి ఆలోచనైతే ప్రస్తుతానికి లేదు. ఆడపిల్ల బయటికి వెళ్లి సంపాదించడం ఏంటని ప్రశ్నించిన వారితోనే ‘బాగా చేస్తున్నావమ్మా’ అనిపించుకున్నా. నా మీద గాసిప్స్ చెప్పినవాళ్లతోనే పొగిడించుకున్నా. బస్తీ నుంచి ఈ స్థాయికి రావడం గర్వంగా ఫీలవుతున్నా.
సినిమాల్లోనూ..
ప్రస్తుతం జీ తెలుగులో ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’, ‘మా అన్నయ్య’ సీరియల్స్ చేస్తున్నాను. గౌతమి, రఘు చాలా సపోర్ట్ చేస్తారు. గౌతమి తన సొంత చెల్లిలా చూసుకుంటుంది. నా మొదటి సీరియల్లో సొహైల్ చెల్లెలిగా నటించా. దాంతో చెల్లెలి పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి. అయితే, ఆ పాత్రలకు ప్రాధాన్యం ఉండటంతో ఒప్పుకొంటున్నా. నేను నటించిన ఓ సీరియల్ కన్నడలో కూడా డబ్ అవుతున్నది. దాంతో అక్కడ కూడా నన్ను అభిమానించేవారు ఉన్నారు. ఇటీవల బెంగళూరు వెళ్తే చాలామంది వచ్చి పలకరించారు. తమిళంలోనూ అవకాశాలు వచ్చాయి. కానీ, తెలుగులో చేయడం కంఫర్ట్‌గా ఉంది. ఆచార్య, భగవంత్ కేసరి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, శాకినీ డాకినీ తదితర చిత్రాల్లో నటించాను. ఇంకొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. సీరియల్స్ బిజీతో డేట్స్ కుదరడం లేదు.
– హరిణి
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

