ఐదుసార్లు వరల్డ్‌కప్ విన్నర్, ఫుట్‌బాల్ ప్రపంచంలోనే మేటి జట్లలో ఒకటి.. కోట్లాది మంది అభిమానులున్న బ్రెజిల్‌కు మళ్లీ నిరాశే. ఆరో ట్రోఫీ వేటలో ఉన్న ‘సాంబా’ టీమ్ ఈసారి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టకుండానే ఇంటిదారి పట్టింది. అత్యంత చెత్త ఆటతో అభిమానులను నిరాశపరుస్తూ.. కన్నీటితో కప్పు నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి బాధతో బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్మార్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఇంకోవైపు 28 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగా టోర్నీలో రీఎంట్రీ ఇచ్చి.. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడుతున్న నార్వే నాకౌట్లో తమ దమ్ము చూపెట్టింది. స్టార్ స్ట్రైకర్ అర్లింగ్ హాలండ్ డబుల్ గోల్స్‌తో చెలరేగిన వేళ బ్రెజిల్ హార్ట్ బ్రేక్ చేసి తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరింది.
న్యూజెర్సీ: ఫిఫా ప్రపంచకప్‌లోనే అతి పెద్ద సంచలనం. అండర్డాగ్ నార్వే.. సాకర్‌లో మేటి జట్టు బ్రెజిల్ పని పట్టింది. న్యూజెర్సీ స్టేడియంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన హోరాహోరీ నాకౌట్ పోరులో 2-1 తేడాతో సాంబా టీమ్‌ను చిత్తు చేసింది. నార్వే స్టార్ స్ట్రైకర్ అర్లింగ్ హాలండ్ సెకండాఫ్‌లో (79, 90వ నిమిషాల్లో) రెండు అద్భుత గోల్స్‌తో విరుచుకుపడి మాజీ చాంపియన్లను ఇంటిదారి పట్టించాడు. బ్రెజిల్ దిగ్గజం నెయ్మార్ (90+10వ ని)కొట్టిన ఏకైక గోల్ ఆ జట్టుకు ఓటమి తప్పించలేకపోయింది. సాకర్ చరిత్రలో టాప్ టీమ్స్‌ను పడగొట్టి.. ఎన్నో అద్భుత విజయాలు సాధించిన బ్రెజిల్.. నార్వే కోటను మాత్రం బద్దలు కొట్టలేకపోతోంది. 1988 నుంచి రెండు వరల్డ్‌కప్స్ సహా ఆ జట్టుతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా నెగ్గలేకపోవడం గమనార్హం. ఇక, తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన నార్వే.. ఈ నెల 11న ఇంగ్లండ్‌తో తలపడనుంది.
సెకండాఫ్‌లో ధమాకా
ఈ మ్యాచ్ తొలి 45 నిమిషాలు గోల్ లేకుండా ముగిసినప్పటికీ డ్రామాకు ఏమాత్రం కొదవ లేదు. ఆట ఆరంభంలోనే నార్వే ఆటగాడు సాండర్ బెర్జ్ బంతిని నెట్లోకి పంపినా.. రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో ఆ టీమ్‌కు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత బ్రెజిల్‌కు సువర్ణావకాశం లభించింది. బాక్స్ లోపల మాథ్యూస్ కున్హాను నార్వే డిఫెండర్ క్రిస్టోఫర్ అజెర్ కిందపడేయడంతో బ్రెజిల్‌కు పెనాల్టీ లభించింది. తన అంతర్జాతీయ కెరీర్లో మొదటి పెనాల్టీ కిక్ తీసుకున్న బ్రూనో గిమారెస్ కొట్టిన పేలవ షాట్‌ను నార్వే గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ సులభంగా అడ్డుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న వినిషియస్ జూనియర్, మార్టిన్ ఒడెగార్డ్ కొట్టిన షాట్లను కూడా తిప్పికొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 35 శాతం మాత్రమే బంతిని తన ఆధీనంలో ఉంచుకోగలిగింది. అటు నార్వే బంతినిపై పైచేయి సాధించినా ఫస్టాఫ్‌లో గోల్ కొట్టలేకపోయింది.
విరామం తర్వాత బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలోటి వ్యూహాత్మకంగా గాబ్రియేల్ మార్టినెల్లి స్థానంలో సీనియర్ స్టార్ నెయ్‌మార్‌ను మైదానంలోకి దించాడు. తన రాకతో బ్రెజిల్ ఎటాకింగ్‌లో వేగం పెరిగినా నార్వే డిఫెన్స్ గట్టిగా నిలబడింది. ఇంకోవైపు నార్వే ఫార్వర్డ్స్ బ్రెజిల్ డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లి దాడుల తీవ్ర పెంచారు. ఈ క్రమంలో ఆండ్రియాస్ షెల్డెరప్ ఎడమ వైపు నుంచి అందించిన అద్భుతమైన క్రాస్‌ను అందుకున్న హాలండ్ బ్రెజిల్ డిఫెండర్ గాబ్రియేల్ కంటే ఎత్తుగా ఎగిరి బుల్లెట్ లాంటి హెడర్ గోల్ కొట్టాడు. అక్కడి నుంచి బ్రెజిల్ స్కోరు చేసేందుకు ఎంత ట్రై చేసినా .. నిర్ణీత 90 నిమిషాల్లో నార్వే డిఫెన్స్‌ను బ్రేక్ చేయలేకపోయింది. ఇంకోవైపు ఇంజూరీ టైమ్‌లో షెల్డెరప్ ఇచ్చిన పాస్‌ను హాలండ్ క్లాసిక్ టచ్‌తో గోల్ పోస్ట్ రైట్ కార్నర్‌లోకి పంపి నార్వే ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. అప్పటికే బ్రెజిల్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మ్యాచ్ ఆఖరి క్షణాల్లో బ్రెజిల్‌కు మరో పెనాల్టీ లభించింది. దాన్ని నెయ్మార్ గోల్‌గా మలిచినా అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిపోయింది.
కప్పు లేకుండానే కథ ముగిసె

మెగా టోర్నీలో అనూహ్య ఓటమి తర్వాత బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్మార్ జూనియర్ తన ఇంటర్నేషనల్ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించడం ఆ జట్టు అభిమానుల బాధను రెట్టింపు చేసింది. 2010లో అమెరికా గడ్డపైనే యూఎస్ఏ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన దిగ్గజం అదే దేశంలో తన ఆట ముగించాడు. ‘వరల్డ్‌కప్ నెగ్గాలన్నది నా కల. దాని కోసంచాలా ప్రయత్నించాను. ఇప్పుడు నా పోరాటం ముగిసింది. ఇక్కడే కెరీర్ ఆరంభించాను.. ఇక్కడే ముగిస్తున్నా’ అని నెయ్మార్ మ్యాచ్ తర్వాత భావోద్వేగంతో చెప్పాడు. తన 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో నెయ్మార్ ఈ తరం మేటి ఆటగాళ్లలో ఒకడిగా, బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. మైదానంలో మెరుపు వేగంతో కదులుతూ అనుకోని దిశల్లోకి టర్న్ అవుతూ ప్రత్యర్థులను ఆశ్చర్యపరచడం.. బంతిని తన కాలికి అతుక్కున్నట్లుగా డ్రిబ్లింగ్ చేయడం, డిఫెండర్లను ఏమార్చి ముందుకు వెళ్లడంలో అతను దిట్ట. బంతిని పైకి లేపి, డిఫెండర్ల తల మీదుగా పంపే రెయిన్బో ఫ్లిక్ వంటి నైపుణ్యాలతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.
జాతీయ జట్టు తరఫున 130 మ్యాచ్‌లు ఆడిన అతను 80 గోల్స్ కొట్టి మరో 59 అసిస్టులు చేశాడు. కెప్టెన్‌గా బ్రెజిల్‌కు 2013 ఫిఫా కన్ఫెడరేషన్స్ కప్ అందించిన అతను 2016 రియో ఒలింపిక్స్‌లో సొంతగడ్డపై జట్టుకు స్వర్ణం సాధించిపెట్టాడు. కానీ, వరల్డ్ కప్ కలను నెరవేర్చుకోలేకపోయాడు. అతని కెరీర్‌ను గాయాలు వెంటాడాయి. ఈ కారణంగానే తన ప్రతిభకు నెయ్మార్ సంపూర్ణ న్యాయం చేయలేకపోయాడు. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో అంత టాలెంట్ ఉన్నా.. ఈ ఇద్దరి మాదిరి సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. కొన్నిసార్లు బ్రెజిల్ అతనిపై అతిగా అంచనాలు, భారం మోపి దెబ్బతిన్నది. 2014 సొంతగడ్డపై వరల్డ్‌కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ కొట్టిన తర్వాత నెయ్మార్ క్వార్టర్ ఫైనల్లో గాయపడి స్ట్రెచర్‌పై బయటికి వెళ్లడం.. తను లేకుండా సెమీస్ ఆడిన బ్రెజిల్ 1-7తో జర్మనీ చేతిలో చిత్తవడం సాంబా అభిమానులకు ఇప్పటికీ చేదు జ్ఞాపకాలే. మొత్తంగా దశాబ్ద కాలంగా బ్రెజిల్ బలం.. బలహీనత అయిన నెయ్మార్ ఇప్పుడు పూర్తిగా దూరమైన తర్వాత ఆ జట్టు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.