Virat Kohli | ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో దూసుకుపోతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి లక్నో సూపర్ జెయింట్స్ యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ భారీ షాక్ ఇచ్చాడు. ఈ సీజన్ మొత్తం నిలకడ ప్రదర్శనతో అభిమానులను అలరించిన కోహ్లి, తొలిసారి డకౌట్ అయ్యి నిరాశ పరిచాడు. లక్నో ఇకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండో బంతికే క్లీన్ బౌల్డ్ కావడం మ్యాచ్‌కే హైలైట్‌గా మారింది.214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. వేగంగా స్వింగ్ అవుతున్న బంతితో ప్రిన్స్ యాదవ్ కోహ్లిని పూర్తిగా మోసం చేశాడు. గంటకు 140.4 కిలోమీటర్ల వేగంతో వచ్చిన అవుట్ స్వింగ్ బంతిని అంచనా వేయడంలో కోహ్లి విఫలమయ్యాడు. బంతి బ్యాట్‌ను దాటుకుని నేరుగా ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టడంతో స్టేడియం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
కోహ్లి వికెట్ పడగానే లక్నో అభిమానులు భారీగా సంబరాలు చేసుకోగా, ఆర్సీబీ డగౌట్ మాత్రం నిశ్శబ్దంగా మారిపోయింది. కోహ్లిని అవుట్ చేసిన ఆనందంలో ప్రిన్స్ యాదవ్ గాల్లో ఎగిరి మరీ సెలబ్రేట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ సీజన్లో కోహ్లి ఆడిన అత్యంత పేలవమైన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆయన చేసిన కనిష్ట స్కోర్ 19 పరుగులు. అంతకంటే తక్కువ స్కోర్ ఏ మ్యాచ్‌లోనూ నమోదు కాలేదు. వరుసగా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ స్థానాల్లో కొనసాగిన కోహ్లి, ఈ మ్యాచ్‌లో విఫలమవడంతో పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.ఈ సీజన్లో ఇప్పటివరకు పది ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి మొత్తం 379 పరుగులు సాధించాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.గుజరాత్‌పై 44 బంతుల్లో 81 పరుగులు చేసి ఈ సీజన్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు.
అయితే లక్నోపై జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లి త్వరగా అవుటవ్వడంతో ఆర్సీబీ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయలేకపోయింది. చివరకు నిర్ణీత ఓవర్లలో 203/6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మరోవైపు లక్నో ఈ విజయంతో కీలక రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్రిన్స్.. గత మ్యాచ్ తర్వాత నేను విరాట్ భయ్యాను కలిసి సలహా అడిగాను. అప్పుడు తను బంతి ఒక లెంత్ వద్ద స్వింగ్ అవుతున్నప్పుడు, దానిని మార్చకు. అదే లెంత్‌ను కంటిన్యూ చేయి అని సలహా ఇచ్చారు. అదే సలహాని ఈ మ్యాచ్‌లో ఉపయోగించాను అని ప్రిన్స్ అన్నాడు. బంతి స్వింగ్ అవుతుండటంతో పదే పదే ఒకే లెంత్ బాల్స్ వేసి కోహ్లీని కన్ఫ్యూజ్ చేసి క్లీన్ బౌల్డ్ చేశాడు.