IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో మళ్లీ గెలుపు తోవ తొక్కిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కొత్త బౌలర్‌ను తీసుకుంది. ఐపీఎల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషనక (Dilshan Madushanka)తో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. గాయంతో బాధ పడుతున్న బ్రాండన్ కార్సే(Brydon Carse) స్థానంలో లంక స్పీడ్‌స్టర్ ఆరెంజ్ ఆర్మీ స్క్వాడ్‌లో చేరనున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం ఎస్ఆర్హెచ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ప్యాట్ కమిన్స్ సేవల్ని కోల్పోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఆరంభ పోరుకు సిద్ధమవుతూ గాయపడిన బ్రాండన్ కార్సే స్థానంలో దిల్షాన్ మధుషనకను తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB )తో మ్యాచ్ కోసమని నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా కార్సే చేతికి గాయమైంది. దాంతో, అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
Dilshan Madushanka joins the squad as a replacement for Brydon Carse, who is ruled out due to injury.
Welcome, Dilshan 🧡 pic.twitter.com/zJQWtbXVZt
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026
కార్సే గాయం నుంచి కోలుకుని, ఫిట్నెస్ సాధించేందుకు సమయం పట్టేలా ఉన్నందున అతడి స్థానాన్ని మధుషనతో భర్తీ చేసింది ఫ్రాంచైజీ. ఫిట్నెస్ పరీక్షలో గట్టెక్కి.. లంక బోర్డు ఎన్వోసీ ఇచ్చాక మధుషనక సన్‌రైజర్స్ స్క్వాడ్‌లో చేరనున్నాడు. ఈ సీజన్‌కుగానూ లంక పేసర్‌కు రూ.75 లక్షలు ముట్టజెప్పనుంది.
రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయంతో జోరు మీదున్న ఇషాన్ కిషన్ బృందం ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. ఉప్పల్ మైదానంలో అరంగేట్రం పేసర్లు ప్రఫుల్ హింగే(4-34), షకీబ్ హుస్సేన్(4-26)ల సంచలన బౌలింగ్ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ అదే ఊపులో సీఎస్కేకు చెక్ పెట్టాలని భావిస్తోంది. బహుశా ఈ మ్యాచ్‌కు కమిన్స్ అందుబాటులో లేకుంటే మధుషనకను ఆడించే అవకాశముందని సమచారం.
Wish you a speedy recovery, Carsey 🧡 pic.twitter.com/xQ2A7BeWcO
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026