Rain Threat : పంతొమ్మిదో సీజన్‌ను వరుణుడు వరసగా పలకరిస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సాగనీయని వర్షం.. ఈసారి గువాహటిలోనూ దాపురించింది. టాస్కు ముందు నుంచే చినుకులు మొదలవ్వడంతో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టాస్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు వేయాల్సిన టాస్ వాన కారణంగా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ముందంజ వేయాలనుకున్న ముంబై శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది.
ఐపీఎల్లో వరసగా రెండు విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ తమ సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయంతో టేబుల్ టాపర్‌గా కొనసాగాలనుకున్న ఆ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు. అవును.. ఈ సీజన్లో వరసగా రెండో మ్యాచ్‌కు వర్షం ముప్పు తప్పేలా లేదు. సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ 3.4 ఓవర్లోనే అందుకున్న వాన కారణంగా మ్యాచ్ రద్దయ్యింది.
🚨 Update 🚨
Toss is delayed in Guwahati.
Next update to follow once the rain stops.#TATAIPL | #KhelBindaas | #RRvMI pic.twitter.com/cheEGdXSEz
— IndianPremierLeague (@IPL) April 7, 2026
మంగళవారం గువాహటిలో కాసేపట్లో టాస్ అనగా వర్షం ధాటికి మైదానమంతా కవర్లతో కప్పేశారు. చినుకులు తగ్గాక అంపైర్లు టాస్ సమయాన్ని, ఓవర్ల కోత అంశాన్ని నిర్ణయించనున్నారు.
ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయాలతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో గెలుపు.. ఆపై ఓటమితో నిరాశపరిచిన ముంబై గువాహటిలో గర్జించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ మీదే ఉండనున్నాయి. ఎందుకంటే విధ్వంసక ఆటతో బౌలర్లను భయపెడుతున్న ఈ బుడ్డోడు తొలిసారి జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోబోతున్నాడు.