మెల్బోర్న్: వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ .. ఆస్ట్రేలియాలో ఎన్నాళ్లు ఉంటాడో తెలియదు. కానీ సోమవారం నుంచి ప్రారంభం అయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ డ్రాలో మాత్రం చోటు దక్కింది. టాప్ సీడ్ జోకో.. మరో సెర్బియా ప్లేయర్ మియోమిర్ కెక్మనోవిక్తో తొలి రౌండ్లో తలపడనున్నాడు. వాస్తవానికి డ్రా రిలీజ్‌ను గంటన్నర ఆలస్యం చేశారు. మరో వైపు జోకోవిచ్ వీసా రద్దు కేసు ఇంకా ఆసక్తికరంగానే ఉన్నది. వీసా రద్దు కేసులో జోకో న్యాయపోరాటంలో విజయం సాధించినా.. ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ మాత్రం అతని వీసా రద్దు చేయాలన్న ప్రతిపాదనలో ఉన్నది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి అలెక్స్ హాక్ త్వరలో దీనిపై నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. జోకో వీసా రద్దుపై ఇమ్మిగ్రేషన్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని స్కాట్ మారిసన్ కూడా వెల్లడించారు.