గత ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది.
2019లో దూకుడు కొరవడి ఇంగ్లిష్ జట్టుకు అప్పనంగా వరల్డ్‌కప్ అందించిన కివీస్ ఈసారి ఆ దూకుడుతోనే డిఫెండింగ్ చాంపియన్‌ను దెబ్బకొట్టింది!
బంతిపై పగబట్టినట్లు.. బరిలోకి దిగింది బాదడానికి అన్నట్లు.. న్యూజిలాండ్ ప్లేయర్లు అహ్మదాబాద్‌లో వీరంగం ఆడారు!
కాన్వే, రచిన్ రఫ్ఫాటకు ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారిపోగా.. బౌలర్లు తెల్లమొఖం వేశారు!!
వోక్స్, వుడ్, కరన్ ఇలా ఏ ఒక్క బౌలర్‌ను వదలకుండా ఈ జంట వీర బాదుడు బాదింది. ముఖ్యంగా పట్టుమని పది మ్యాచ్‌ల అంతర్జాతీయ అనుభవం కూడా లేని స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర.. విధ్వంసకాండ రచించాడు. పేరులో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌ను నిక్షిప్తం చేసుకున్న ఈ భారత సంతతి ఆటగాడు.. అందుకు తగ్గట్లే ద్రవిడ్‌లోని కళాత్మకత.. సచిన్‌లోని మాస్టర్ క్లాస్‌ను కలగలిపి విశ్వరూపం చూపాడు. ఇంగ్లండ్ ప్లేయర్లంతా కానా కష్టంతో చేసిన పరుగులను ఈ ఇద్దరే ఊదేశారు.
NZ Vs ENG | అహ్మదాబాద్: పుష్కర కాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌నకు అదిరిపోయే ఆరంభం లభించింది. గత ఫైనలిస్ట్‌ల మధ్య గురువారం జరిగిన తొలి పోరులో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. బజ్‌బాల్ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించడమే పనిగా పెట్టుకున్న ఇంగ్లిష్ జట్టుకు.. కివీస్ ప్లేయర్లు గట్టి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ఛేదనకు మొగ్గు చూపాడు. ఫలితంగా మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (77; 4 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ జోస్ బట్లర్ (43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వలేదనిపించారు. ఇంగ్లండ్ ప్లేయర్లంతా డబుల్ డిజిట్ స్కోరు చేసి రికార్డు నెలకొల్పినా.. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, ఫిలిప్స్, శాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకాలతో చెలరేగిపోయారు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నచందంగా ఈ జంట పరుగుల సునామీ సృష్టించడంతో.. మరో 82 బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్ జయకేతనం ఎగరవేసింది. ఇంగ్లండ్ బౌలర్లో సామ్ కరన్ ఏకైక వికెట్ పడగొట్టగా.. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసిన మార్క్ వుడ్ 5 ఓవర్లలో 55 పరుగులు సమర్పించుకున్నాడు. రచిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రామచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసినట్లు..
రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ కలిసి టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ ఆడినట్లు..
అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ ఒకే సినిమాలో నటించినట్లు..
చూస్తున్నది లైవ్ మ్యాచా.. లేక హైలైట్సా అని అనుమానం వచ్చేట్లు..
రచిన్ రవీంద్ర, డ్వైన్ కాన్వే ఇంగ్లండ్‌పై శివతాండవమాడారు!
రెండో ఓవర్ తొలి బంతికే విలియమ్ యాంగ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. ఇక అక్కడి నుంచి రచిన్, కాన్వే విధ్వంస కాండ ప్రారంభమైంది. బంతి ఎంత వేగంగా వస్తే.. దాన్ని అంతే వేగంగా బౌండ్రీకి తరలించాలని కంకణం కట్టుకున్నట్లు కనిపించిన ఈ జోడీ.. ఇంగ్లండ్ ప్లేయర్లకు కనీసం ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా చెలరేగిపోయింది. వీరి దూకుడుకు ప్రేక్షకులుగా మారిపోయిన ఇంగ్లిష్ ఆటగాళ్ల వద్ద కౌంటర్ ప్లాన్ లేకుండా పోయింది. మూడో స్థానంలో బరిలోకి దిగడం కొత్తే అయినా.. ఏమాత్రం తడబడకుండా పక్కా క్రికెటింగ్ షాట్స్‌తో చెలరేగిపోయిన రచిన్ వన్డే క్రికెట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకోగా.. కాన్వే ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు.. ఇటుక మీద ఇటుక పేర్చి గోడ కడుతున్నట్లు.. ఎక్కడా అడ్డ దిట్ట షాట్ల జోలికి పోని ఈ ఇద్దరూ.. ఫీల్డర్ల మధ్య నుంచి కరెక్ట్‌గా కొలత వేసి కొట్టినట్లు బౌండ్రీలు రాబట్టారు. ఈ క్రమంలో అభేధ్యమైన రెండో వికెట్‌కు వీరిద్దరూ రికార్డు స్థాయిలో 211 బంతుల్లోనే 273 పరుగులు జోడించి జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ వరకు న్యూజిలాండ్ మేనేజ్మెంట్ సంబురపడిపోయినా.. రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ కోలుకొని తిరిగి జట్టులోకి వస్తే రచిన్ కోసం ఎవరి స్థానానికి ఎసరు పెట్టాలనే కొత్త తలనొప్పి మాత్రం తప్పనిదే!
2019 జూలై 24న జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత ఓవర్లలో ఇరుజట్లు 241 పరుగులే చేయగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండ్రీలు కొట్టిన ఇంగ్లిష్ జట్టును విజేతగా ప్రకటించారు. అది మనసులో బలంగా ముద్రించుకున్న కివీస్ ప్లేయర్లు ఈసారి దెబ్బకు దెబ్బ కొట్టారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగులు సాధించేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ చోట కాన్వే, రచిన్ ఇద్దరే 38 బౌండ్రీలతో విజృంభించారు.
వన్డే క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు చెందిన 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు చేయడం ఇదే తొలిసారి. కివీస్‌తో పోరులో ఇంగ్లండ్ బ్యాటర్లంతా డబుల్ డిజిట్ నమోదు చేశారు.
ప్రపంచకప్‌లో శతకం బాదిన మూడో అతి పిన్న ప్లేయర్‌గా రచిన్ రికార్డుల్లోకెక్కాడు. కోహ్లీ, ఆండీ ఫ్లవర్ ముందున్నారు.
ఇంగ్లండ్: 282/9 (రూట్ 77, బట్లర్ 43; హెన్రీ 3/48, ఫిలిప్స్ 2/17), న్యూజిలాండ్: 36.2 ఓవర్లలో 283/1 (కాన్వే 152 నాటౌట్, రచిన్ 123 నాటౌట్; సామ్ కరన్ 1/47).