గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్ బిగ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ గురించి తెలుసు కదా. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. అలాంటి బ్యాట్స్‌మన్ క్రీజులో ఉన్నాడు. విండీస్‌కు విజయం కోసం 6 బంతుల్లో 11 పరుగులు కావాలి. ఇంకేం.. కరీబియన్ టీమ్ ఈజీగా గెలుస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమే చేశాడు. చివరి ఓవర్‌ను చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. ఆస్ట్రేలియాకు 4 పరుగుల విజయాన్ని సాధించిపెట్టాడు.
స్టార్క్ వేసిన తొలి ఐదు బంతుల్లో రసెల్ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. అవతలివైపు ఓ టెయిలెండర్ క్రీజులో ఉండటంతో రసెల్ సింగిల్స్ తీసే అవకాశం వచ్చినా ఆ పని చేయలేదు. ఇలాగే తొలి ఐదు బంతులూ అయిపోయాయి. చివరి బంతికి మాత్రం ఎలాగోలా సిక్స్ కొట్టినా ఫలితం లేకపోయింది. 4 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే మూడు గెలిచిన విండీస్ ఆధిక్యం 3-1కి తగ్గిపోయింది.
ఈ చివరి ఓవర్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రసెల్‌లాంటి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేసిన స్టార్క్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సిరీస్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసిన స్టార్క్‌కు కెప్టెన్ ఫించ్ చివరి ఓవర్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించినా.. అతడు తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు స్టార్క్.