MCA : ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు ముంబై క్రికెట్ సంఘం (MCA) తీపి కబురు చెప్పింది. ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే అద్భుతంగా రానిస్తున్న వారికి అండగా నిలిచేందుకు తొలిసారిగా కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. దేశవాళీలో ఆడుతున్న ఆటగాళ్లకు ఆర్ధికంగా ఆసరా కావడం, వారిని మరింత రాటుదేల్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఎంసీఏ పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్ వర్తింపజేస్తామని వెల్లడించింది.
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించే అన్క్యాప్డ్ ప్లేయర్లకు ముంబై క్రికెట్ సంఘం కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చింది. అర్హులైన క్రికెటర్లకు ప్రతి ఏటా కాంట్రాక్ ప్రతిపాదికన డబ్బులు చెల్లిస్తామని గురువారం ఎంసీఏ తెలిపింది. ప్రదర్శన, ఫిట్నెస్తో పాటు సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించిన వారికి కాంట్రాక్ట్ ఇస్తామని, గ్రేడ్‌ను బట్టి చెల్లించే మొత్తం మారుతుందని చెప్పింది. బీసీసీఐ మాదిరిగానే ఎంసీఏ పరిధిలోని క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజిస్తారు.
A HISTORIC MOMENT 🫡
Mumbai Cricket Association becomes the first state Association to introduce the Players contract system from the 2026-27 season. [Devendra Pandey] pic.twitter.com/zKypnGCwuf
— Johns. (@CricCrazyJohns) April 16, 2026
గ్రేడ్ ఏ – 20 లక్షలు
గ్రేడ్ ఏ లోని వారికి ఏడాదికి రూ.12 నుంచి 20 లక్షల వరకూ దక్కుతాయి. గ్రేడ్ బీలోని క్రికెటర్లకు రూ.8 లక్షల నుంచి రూ.12లక్షలు ముట్టుతాయి. గ్రేడ్ సీలోని ప్లేయర్ల ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం అందుకుంటారు. కాంట్రాక్ట్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు, అలవెన్స్‌లు, ప్రదర్శనను బట్టి ఇచ్చే నగదు ప్రోత్సాహకాలు కొనసాగిస్తామని ఎంసీఏ స్పష్టం చేసింది.
‘ముంబై క్రికెట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఆటగాళ్లకు కాంట్రాక్ట్ వ్యవస్థను వర్తింపజేస్తున్న మొదటి క్రికెట్ సంఘంగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ముంబై క్రికెటర్లకు భరోసా, అవకాశాలు కల్పించడంలో ఈ వ్యవస్థ కీలకం కానుంది. 2026-27 సీజన్ నుంచే ఈ వ్యవస్థను అమలు చేస్తాం’ అని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు.
The @MumbaiCricAssoc has decided to implement it decision of awarding
Player contracts to those players who are not playing in the @IPL . The following three categories of player contracts were approved in the MCA’s Apex Council meeting recently!..@ajinkyasnaik pic.twitter.com/Vin7kaDPlP— Gaurav Gupta (@toi_gauravG) April 16, 2026
రాష్ట్ర స్థాయిలో క్రికెటర్లలో నైపుణ్యాలు మెరుగుపరచడం, ప్రతిభావంతులకు మరింత ప్రోత్సాహం అందించడమే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉద్దేశమని ఎంసీఏ వెల్లడించింది. క్రికెటర్లు ఆటపై దృష్టి సారించేలా వారికి ఆర్ధిక భరోసా ఇవ్వడం, నిలకడగా రాణించేవాళ్లను ప్రోత్సహించడం, ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపరచడం, ఆటలో మరింత పోటీతత్వాన్ని పెంచడం.. ఈ లక్ష్యాలతోనే కాంట్రాక్ట్ సిస్టమ్‌ను ప్రవేశ పెడుతున్నామని అజింక్యా నాయక్ వివరించాడు.