ఫిలడెల్ఫియా (యూఎస్ఏ): ఐదుసార్లు చాంపియన్‌గా, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగి ఫిఫా వరల్డ్ కప్‌ను డ్రాతో ఆరంభించిన బ్రెజిల్ రెండో పోరులో పంజా విసిరింది. తొలి అర్ధభాగంలోనే మూడు గోల్స్‌తో మెరిపించి.. హైతీ జట్టును ఇంటికి పంపించింది. శనివారం ఏకపక్షంగా సాగిన గ్రూప్-సి మ్యాచ్‌లో బ్రెజిల్ 3-0 గోల్స్ తేడాతో హైతీని చిత్తు చేసింది. బ్రెజిల్ స్టార్ ఫార్వర్డ్ మాథ్యూస్ కున్హా (23, 36వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన చేయగా, తొలి మ్యాచ్‌లో జట్టుకు ఓటమి తప్పించిన వినీసియస్ జూనియర్ (45+5వ ని) ఓ గోల్ తో మెరిశాడు. ఈ ఓటమితో టోర్నీ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా హైతీ నిలిచింది. 1974 తర్వాత మొదటిసారి వరల్డ్ కప్‌నకు అర్హత సాధించిన హైతీ వరుస ఓటములతో నిరాశ పరిచింది. బ్రెజిల్ బుధవారం స్కాట్లాండ్తో తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.
మొరాకోతో తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న బ్రెజిల్‌కు ఈ విజయం ఎంతో కీలకమైంది. దాంతో క్రోచ్ కార్లో అన్సెలొట్టి వ్యూహాత్మకంగా కున్హాను స్టార్టింగ్ లైనప్‌లోనే బరిలోకి దించాడు. కోచ్ నమ్మకాన్ని నిలబెట్టిన కున్హా రెండు గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆట 23వ నిమిషంలో వినీసియస్ కొట్టిన షాట్‌ను హైతీ కీపర్ అడ్డుకోగా, రీబౌండ్ అయిన బంతిని కున్హా గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వినీసియస్ అందించిన అద్భుత మైన పాస్‌ను కున్హా ఎడమకాలితో మరో గోల్‌గా మార్చి 2-0 ఆధిక్యం తెచ్చాడు.
తొలి అర్ధభాగం ముగిసేలోపే వినీసియస్ జూనియర్ మరో గోల్ సాధించడంతో బ్రెజిల్ 3-0తో తిరుగులేని స్థితికి చేరింది. అంతకుముందు బ్రెజిల్ ఆటగాడు రాఫిన్హా కొట్టిన గోల్‌ను రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు. మరో గ్రూప్-సి పోరులో మొరాకో 1-0 తేడాతో స్కాట్లాండ్పై నెగ్గింది.72వ సెకండ్లోనే మొరాకో ఫార్వర్డ్ సైబారీ విన్నింగ్ గోల్ కొట్టాడు.

ఆట మొదలైన 65 సెకండ్లోనే మిడ్‌ఫీల్డర్ మథియాస్ గలార్జా అద్భుతమైన గోల్ కొట్టడంతో గ్రూప్-డి మ్యాచ్‌లో పరాగ్వే 1-0తో తుర్కియే జట్టును ఓడించింది. గలార్జా ఈ ప్రపంచకప్‌లోనే ఫాస్టెస్ట్ గోల్ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. తొలి అర్ధభాగం చివర్లో తుర్కియే ఆటగాడు మెర్ట్ ముల్దూర్తో జరిగిన వాగ్వాదంలో పరాగ్వే స్టార్ ప్లేయర్ మిగ్యుల్ అల్మిరాన్ తన నోటిని చేత్తో మూసుకొని ఏదో అన్నాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో గొడవలు లేదా చర్చలు జరిగే సమయంలో ఆటగాళ్లు నోటిని కప్పి ఉంచడాన్ని నిషేధిస్తూ ఫిఫా కొత్త నిబంధనను తెచ్చింది. ఈ రూల్‌ను ఉల్లంఘించినందుకు వీడియో రివ్యూ (వార్) తర్వాత రెఫరీ.. అల్మిరాన్కు రెడ్ కార్డ్ ఇచ్చి మైదానం నుంచి పంపించి వేశాడు. ఫలితంగా నోరు మూసుకున్నందుకు రెడ్ కార్డ్‌కు గురైన తొలి ప్లేయర్‌గా అల్మిరాన్ నిలిచాడు.
ఈక్వెడార్ x క్యురసావ్
ఉ. 5.30 నుంచి
ట్యునీషియా x జపాన్
ఉ. 9.30 నుంచి
స్పెయిన్ x సౌదీ అరేబియా
రా. 9.30 నుంచి
బెల్జియంx ఇరాన్
రా. 12.30 నుంచి