BCCI : వేసవిలో క్రీడా వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ప్రతి సీజన్‌ను మార్చి నెలాఖరులో ప్రారంభించే బీసీసీఐ.. 2027 ఎడిషన్ విషయంలో ముందు చూపుతో వ్యవహరించాలనుకుంటోంది. సీజన్ మధ్యలో మండు టెండలు, అకాల వర్షాలతో తలెత్తుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఐపీఎల్ 2027ను కాస్త ముందుగానే జరపాలని భావిస్తోంది. ఈ విషయమై ఐపీఎల్ వచ్చే సీజన్ షెడ్యూల్‌పై గురువారం బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా హింట్ ఇచ్చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027ను ముందుగానే మొదలెట్టాని బీసీసీఐ భావిస్తోంది. సెక్రటరీ దేవజిత్ సైకియా ఇదే అంశంపై మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 29(28) వ తేదీన ప్రారంభమైంది. అయితే.. మే రెండో వారం టోర్నీ సమయంలో వర్షాలు పడుతున్నాయి. ముందుస్తు వానల కారణంగా టోర్నీకి అంతరాయం కలుగుతోంది.
VIDEO | BCCI secretary Devajit Saikia says IPL could start as early as March 10 and finish by May 15 from next season to avoid adverse weather during the business end of the tournament. No plans, however, to expand the IPL beyond its current 74 matches due to international… pic.twitter.com/zxjHJoGWE4
— Press Trust of India (@PTI_News) June 18, 2026
అలానే ఎండ తీవ్రతకు ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ, ఐపీఎల్ కార్యనిర్వాహణ మండలి కీలక ఆలోచన చేస్తోంది. ఐపీఎల్ 2027ను మార్చి నెలాఖరున కాకుండా ముందుగానే జరపాలని భావిస్తున్నాం. మార్చి 10 నుంచి మార్చి 15 మధ్య సీజన్‌ను ఆరంభించే అవకాశముంది’ అని దేవజిత్ సైకియా వెల్లడించాడు.
అంతేకాదు షెడ్యూల్ ముందుకు జరిపాలని అభిమానుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. దాంతో, మే 15 కల్లా టోర్నీని ముగించాలని భావిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి పేర్కొన్నాడు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 19వ సీజన్ కాస్త ఆలస్యమైన విషయం తెలిసిందే.