Shapoor Zadran : ఒకప్పటి అఫ్గనిస్థాన్ క్రికెటర్ షపూర్ జద్రాన్ (Shapoor Zadran) మృత్యువుతో పోరాడుతున్నాడు. కొన్నాళ్లుగా ప్రాణాంతకమైన జబ్బుతో బాధ పడుతున్న ఈ మాజీ పేసర్ ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గతేడాది నుంచి షపూర్ను హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసిస్టోసిస్ (HLH) అనే సమస్య వేధిస్తోంది. దీని కారణంగా అతడి రోగనిరోధక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. సాధారణంగా చిన్న పిల్లల్లో కనిపించే ఈ జబ్బు 38 ఏళ్లున్న షపూర్ను వేధిస్తుండడంతో వైద్యులు అవాక్కవుతున్నారు.
పదిహేడేళ్ల క్రితం అఫ్గనిస్థాన్ క్రికెట్లో అరంగేట్రం చేసిన షపూర్ జద్రాన్ నిరుడు అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడికి హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసిస్టోసిస్ (HLH) అనే ప్రాణాంతకమైన జబ్బు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ సమస్య కారణంగా షపూర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మామూలుగా చిన్న పిల్లల్లో కనిపించే ఈ జబ్బుతో షపూర్ బాధ పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Former Afghanistan left-arm fast bowler Shapoor Zadran, who is suffering from a rare, life-threatening disease, is currently in the intensive care unit of a hospital in New Delhi https://t.co/o1Xgp109ZI pic.twitter.com/twUwURA3uN
— ESPNcricinfo (@ESPNcricinfo) April 20, 2026
హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసిస్టోసిస్ సమస్య కారణంగా వాపు ఎక్కువవ్వడం.. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం మూలంగా.. ఎముకల మజ్జ, కాలేయం, ప్లీహం, లింఫ్ గ్రంథులు వంటి వాటి పనితీరు దెబ్బ తిన్నాయి. దాంతో.. మెరుగైన వైద్యం కోసం షపూర్ను భారత్‌కు తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. మాజీ కెప్టెన్, స్పిన్నర్ రషీద్ ఖాన్, అఫ్గన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మిర్వైసీ అష్రఫ్‌లు అతడికి భారత వీసా రావడంలో కీలకమయ్యారు. జనవరి 18న ఢిల్లీ చేరుకున్న షపూర్ ఆస్పత్రిలో చేరాడు.

‘షపూర్ ఆరోగ్యం క్షీణిస్తోంది. అతడి శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. పైగా ట్యూబర్క్యులోసిస్ జబ్బుతో బాధ పడుతున్నాడు. ఈ సమస్య అతడి మెదడుకు కూడా సోకింది. ఈ విషయం ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షల్లో బయటపడింది. నిరంతరం చెకప్‌లు చేయాలని వైద్యులు సూచించారు. ఈమధ్యే అతడికి డెంగ్యూ వచ్చింది. మార్చి 26న బోన్ మ్యారో టెస్టులో షపూర్ నాలుగో దశ హెచ్ఎల్హెచ్తో బాధ పడుతున్నట్టు తేలింది’ అని షపూర్ సోదరుడు వెల్లడించాడు. ఆరడుగుల 2 ఇంచుల పొడవుంటే షపూర్ జులపాల జుత్తుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో 80 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడీ పేసర్. 2009 నుంచి 2020 మధ్య కాలంలో .. ఈ పొడగరి స్పీడ్‌స్టర్ 44 వన్డేలు, 36 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.