కొత్త జిల్లాలు.. అభివృద్ధి కేంద్రాలు
ఒక దార్శనిక పాలకుడి ముందుచూపు ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన వెంటనే పది జిల్లాలను 33 జిల్లాలకు పెంచి, పాలనను వికేంద్రీకరించి, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరువ చేసిన కేసీఆర్ నిర్ణయమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు తమ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన ప్రాంతాలు కూడా ఉండేవి. కలెక్టర్, ఎస్పీ, జిల్లా స్థాయి ఉన్నతాధికారి తన ఉద్యోగ కాలంలో కనీసం ఆ జిల్లాలోని కొన్ని మండల కేంద్రాలకు కూడా వెళ్లడం వీలయ్యేదికాదు.
కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జిల్లాల ఏర్పాటుతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో 459 ఉన్న మండలాలకు గాను మరో 125 కొత్తగా ఏర్పాటు చేసి 584 చేశారు. 43 రెవెన్యూ డివిజన్లకు గాను 25 కొత్తగా ఏర్పాటు చేసి 74 చేశారు. పోలీస్ స్టేషన్లను 733 నుంచి 852కు పెంచారు. గ్రామ పంచాయతీలను 8,368 నుంచి 12,760కి పెంచారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి, దశాబ్దాల గిరిజనుల కలను సాకారం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుతో ఆగిపోలేదు. ప్రతి జిల్లాకూ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ (ఐడీవోసీ) అనే కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మించింది. వీటిలో కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌లు, అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా రూపొందించింది. 28 కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్సులను 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.50 నుంచి రూ.70 కోట్ల వ్యయంతో చేపట్టారు. కేసీఆర్ స్వయంగా సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, రాజన్న-సిరిసిల్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జనగామ, నిర్మల్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, గద్వాల, మహబూబాబాద్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభించారు. మెదక్, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, కామారెడ్డిలో అత్యాధునిక ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయం 31 ఎకరాల్లో, సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ 29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం విశేషం.
వైద్యరంగంలోనూ కేసీఆర్ ప్రభుత్వం విశేష కృషి చేసింది. 33 జిల్లాలకు 33 మెడికల్, నర్సింగ్ కాలేజీలు నెలకొల్పింది. వాటికి అనుబంధంగా కొత్తగా 300 పడకల దవాఖానలు
ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే వాటిని 33కు పెంచడం విశేషం. వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లే సామాన్యులకు తమ జిల్లా కేంద్రాల్లోనే మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. ఒకప్పుడు 2,850 మాత్రమే ఉన్న మెడికల్ సీట్లు కొత్త మెడికల్ కళాశాలల వల్ల ఎనిమిది వేల పైచిలుకు సీట్లకు పెరిగాయి.
జిల్లాల ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకో నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వాటితోపాటు కొత్తగా జాతీయ రహదారులు, రైలు మార్గాలు నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి రెండు వరుసల రహదారులను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు అభివృద్ధి చేశారు. దీంతో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ముఖ్యంగా పాలనను ప్రజలకు దగ్గరగా తీసుకురావడం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం కోసం తీసుకున్న ముఖ్య నిర్ణయం. కొత్తగా వ్యవసాయ, మార్కెటింగ్ కార్యాలయాలు, వందలాది విద్యుత్తు సబ్స్టేషన్లు, పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో గణనీయ అభివృద్ధి కనిపించింది. అనేక సవాళ్లను అధిగమించి కేసీఆర్ తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టారు.
కొత్త జిల్లాలు, మండలాలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల ఏర్పాటుతో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు పెరిగాయి. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి జరిగింది. కొత్త జిల్లాల ఆధారంగా 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్ అమలు చేశారు. ఇందుకోసం 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకువచ్చారు. ఇది స్థానిక యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించింది. జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందడంతో వాణిజ్య కార్యకలాపాలు, నిర్మాణం, సర్వీసులు, చిన్న వ్యాపారాలు పెరిగాయి. మెడికల్ కాలేజీలు, దవాఖానలు స్థానికంగా ఉద్యోగాలు సృష్టించాయి. కొన్ని జిల్లాల్లో పరిశ్రమలు వచ్చి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల షోరూమ్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థలు జిల్లా కేంద్రాలకు వచ్చాయి. జిల్లా కేంద్రాలు అభివృద్ధి కేంద్రాలుగా మారడంతో స్థానిక మార్కెట్ పెరిగింది.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం నూతన రూపం దాల్చింది. పది జిల్లాలు 33గా వృద్ధి చెంది, ప్రజలకు పాలన, సేవలు చేరువ చేసింది. ప్రతి గ్రామానికీ అభివృద్ధి వెలుగులు ప్రసరించాయి. జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలన కాదు. ప్రజా హృదయాలకు అందించిన నిజమైన సేవ. పాలన దగ్గర అయినప్పుడు ప్రజల కష్టాలు దూరమవుతాయి. కేసీఆర్ చూపిన దారి జిల్లాల రూపంలో వికసించింది. ప్రతి ప్రాంతమూ తన గుర్తింపు పొందింది. ప్రతి జిల్లా తన అభివృద్ధి మార్గం కనుగొన్నది. ఇది కేవలం భౌగోళిక విభజన కాదు. తెలంగాణ ఆత్మకు కొత్త శక్తి ఇచ్చిన నిర్ణయం. జిల్లాల ఏర్పాటుతో కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించారు. ప్రజలకు పాలనను చేరువ చేయడమే నిజమైన అభివృద్ధి అని చాటి చెప్పారు.
(వ్యాసకర్త: శాసనమండలి మాజీ సభ్యుడు)
శేరి సుభాష్‌రెడ్డి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

