గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మహిళా స్వయం సహాయక బృందాలు ఆర్థిక పురోగతి సాధించేలా చర్యలు తీసుకుంటున్నది. మహిళలకు జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న రంగాలపై అవగాహన కల్పిస్తున్నది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల సేకరణ లాంటి అవకాశాలను అందించి వార్షిక ఆదాయం పెంచేలా చూస్తున్నది. బ్యాంకుల నుంచి స్వయం సహాయక బృందాలకు రుణాల రూపంలో పెట్టుబడులు అందిస్తున్నది. దీంతో వివిధ రంగాల్లో ఆర్థికాభ్యున్నతి సాధిస్తూ గౌరవప్రదంగా జీవిస్తూ సుస్థిర అభివృద్ధి సాధిస్తున్నారు. అందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎత్తొండ, ఎత్తొండ క్యాంపు మహిళా సంఘాలు. వారు సాధిస్తున్న ఆర్థిక ప్రగతిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…
కోటగిరి, జూలై 8: వ్యవసాయ పనుల్లో కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూనే బర్రెల పెంపకంతో ఆర్థికాభ్యున్నతి సాధిస్తున్నారు. కోటగిరి మండలంలోని ఎత్తొండ, ఎత్తొండక్యాంప్ గ్రామానికి చెందిన మహిళలు పాడిపెంపకంలో పశువైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పాల దిగుబడిలో మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం మగువల జీవనోపాధి మెరుగుపరిచేందుకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరు చేస్తున్న రుణాలను గ్రామంలోని కొందరు మహిళలు పాడికి వెచ్చించారు. వాటితో వచ్చే ఆదాయంతో రుణ వాయిదాలు తీరుస్తూనే నెలకు కొంత ఆదాయం పొందుతున్నారు.
స్వయం సమృద్ధికి దోహదం
గేదెల పెంపకం లాభదాయకంగా ఉన్నది. నిపుణుల సలహాలతో మెలకువలు పాటించి పాల దిగుబడిని పెంచుతున్నాం. స్త్రీనిధి ద్వారా రూ.1.70 లక్షలు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 2.75లక్షలు ఇలా మొత్తం రూ.3.45లక్షల రుణంతో నాలుగు బర్రెలను కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని ప్రారంభించాను. రోజుకు 20లీటర్ల పాల దిగుబడితో రోజుకు రూ.1200 రాగా మొత్తం ఖర్చులు పోనూ రోజుకు రూ.700చొప్పున ఆదాయం వస్తున్నది. పాడి పరిశ్రమతో ఇంటి వద్దనే ఉంటూ డబ్బు సంపాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
– రజనీ, రాజరాజేశ్వరీ మహిళా పొదుపు సంఘం, ఎత్తొండక్యాంప్
కుటుంబానికి ఆసరాగా..
పాల దిగుబడి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబానికి ఆసరా లభిస్తున్నది. స్త్రీ నిధి ద్వారా రూ.1.70 లక్షలు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.2లక్షలు, మొత్తం రూ.3.70 లక్షలు రుణం తీసుకొని బర్రెలను పెంచుతున్నాను. రోజుకు15 లీటర్ల పాల దిగుబడి రావడంతో రోజుకు రూ.700 మిగులుతున్నాయి. కుటుంబ ఖర్చులకు ఉపయోగంగా ఉంటుంది.
– బేగరి కేరవ్వ, గంగాభవానీ మహిళా పొదుపు సంఘం ఎత్తొండ, కోటగిరి మండలం
ఇంటి వద్దే సంపాదన..
గ్రామాల్లో ఉండే మేము.. ఇంటి వద్దనే ఉంటూ స్వయంగా సంపాదించేందుకు పాల ఉత్పత్తి ఉపయోగపడుతున్నది. స్త్రీనిధిలో రూ.1.70లక్షలు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.3లక్షలు రుణం తీసుకున్నాను. మొత్తం రూ.4.70లక్షల రుణంతో రెండు బర్రెలు, నాలుగు ఆవులు కొనుగోలు చేశాం. రోజూ 45 లీటర్ల పాల దిగుబడితో రూ.800 చొప్పున ఆదాయం వస్తున్నది. పాల విక్రయంతో వచ్చే డబ్బులను ఇంట్లో ఖర్చులకు వినియోగించుకుంటున్నాం.
-నాగమణి, విద్యా మహిళా పొదుపు సంఘం, ఎత్తొండక్యాంప్, కోటగిరి మండలం
ఆర్థిక సమస్యలు అధిగమిస్తున్నాం..
స్త్రీ నిధి ద్వారా రూ. 50వేలు, గ్రామ సంఘం ద్వారా రూ. 50 వేలు, బ్యాంకు లింకేజీ రుణం రూ.2లక్షలు, మొత్తం రూ. 3 లక్షలు రుణం తీసుకున్నాను. ఆ డబ్బులతో నాలుగు బర్రెలు, ఒక ఆవు కొనుగోలు చేసి పెంపకం చేపట్టాను. రోజుకు 20లీటర్ల పాల దిగుబడి వస్తుండడంతో రూ.700 చొప్పున ఆదాయం వస్తున్నది. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలను అధిగమిస్తున్నాం. వచ్చే ఆదాయంతో రుణ వాయిదాలు చెల్లిస్తున్నాం.
-ప్రమీల, సహజ మహిళా పొదుపు సంఘం, ఎత్తొండక్యాంప్, కోటగిరి మండలం
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత..
మహిళా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు పాడి పశువులు కొనుగోలు చేసేందుకు రుణాలను అందిస్తున్నది. ఉమ్మడి కోటగిరి మండలంలో సుమారు రూ.45 కోట్ల రుణాలను ఇచ్చింది. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి రుణాలు ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయి. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ ద్వారా సంఘ సభ్యులకు రుణాలు ఇస్తున్నాం. రికవరీ కూడా బాగానే ఉంది.
– బస్వంత్, ఐకేపీ ఏపీఎం, కోటగిరి