నిజామాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డిపై హైదరాబాద్‌లో హత్యాయత్నం ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. ఎమ్మెల్యే నివాసం వద్ద ఓ వ్యక్తి సోమవారం రాత్రి సమయంలో తచ్చాడడంతో జీవన్‌రెడ్డి సిబ్బంది అనుమానితుడిని ప్రశ్నించగా అసలు విషయం బయట పడింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా పిస్తోలు, కత్తి వెలుగు చూడడంతో ఆం దోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే, స్థానిక సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద వ్యక్తిని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్‌గా గుర్తించారు. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ఘటనపై లోతైన విశ్లేషణ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్దకు మారణాయుధాలతో రావడం వెనుకున్న దాగి ఉన్న వ్యవహారాన్ని ఆరా తీస్తున్నారు. కల్లెడ గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్న లావణ్య తన విధి నిర్వాహణలో వైఫల్యం చెందడంతో పంచాయతీ అధికారి విచారణ చేసి చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని మనసులో పెట్టుకున్న సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ కొంత కాలంగా ఎమ్మెల్యేపై బహిరంగంగా విమర్శలు చేశారు. వీడియోలు సైతం విడుదల చేసి అందులో ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి ఒడిగట్టడం కలకలం రేపుతున్నది.
ఎదుగుదలను ఓర్వలేకనే…
రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఉమ్మడి జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే కొన్ని శక్తులు కుట్రలకు పాల్పడుతున్నట్లు స్థానిక టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. నాటి ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడంలో జీవన్ రెడ్డి కీలక పాత్ర వహించారు. టీఆర్ఎస్ యువజన విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులను విజయవంతంగా నిర్వహించారు. అంతేకాకుండా 2014లో స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ తరపున తొలి ఎమ్మెల్యే టికెట్‌ను దక్కించుకున్న ఘనత సైతం జీవన్ రెడ్డికే సొంతమైంది. తొలి ఎన్నికల్లోనే అపూర్వమైన మెజార్టీతో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా 2సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు పీయూసీ చైర్మన్‌గానూ పదవి దక్కించుకున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ సారథిగాను పదవిని పొందారు. గులాబీ పార్టీ జిల్లా సారథిగా నియామకమైన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలకు ప్రయత్నాలు చేశారు. ఎంపీ అర్వింద్ తీరును అడుగడుగునా అడ్డుకోవడంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తీవ్ర స్థాయిలో జరిగిన రైతు ఉద్యమాలకు మద్దతు కూ డా తెలిపారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్థానాన్ని సహించలేకనే కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలకు పాల్పడ్డట్లు ఆర్మూర్ నియోజకవర్గంతోపాటు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
హత్యాయత్నంపై ఖండన
ఆర్మూర్ : ఆర్మూర్ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన కల్లెడి సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నాన్ని ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంట విప్లవ్ కిరణ్ ఖండించారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని పరామర్శించిన స్పీకర్
హత్య కుట్ర నుంచి క్షేమంగా బయట పడిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డిని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ఆయన నివాసానికి వెళ్లిన సభాపతి పోచారం సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సభాపతి పోచారం వెంట ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఉన్నారు.