ఆర్మూర్‌టౌన్/ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 19: కాంగ్రెస్ ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉంచిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్యాతనపల్లిలో అధికార మదంతో కాంగ్రెస్ నేతలు సాగించిన దౌర్జన్యాలను అడ్డు కున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు.
బాల్క సుమన్ అరెస్టు కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు ఆ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినా, దాడులకు పాల్పడుతూ బల్దియాను కైవసం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే కేసులతో బెదిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అరాచకాలను నిలదీస్తే అక్రమ కేసులు, బెదిరింపులా అని నిలదీశారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు, నైతిక విలువలను కాలరాస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద పెద్ద నియంతలే మట్టి కొట్టుకుపోయారని, రేవంత్‌రెడ్డి ఎంత అని మండిపడ్డారు. బాల్క సుమన్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా క్యాతనపల్లిలో ఎన్నిక నిర్వహించే బాధ్యతను ఎన్నికల కమిషన్ చేపట్టాలని కోరారు.