దివ్యాంగులకు చేయూత..ట్రస్ట్ ఫండ్..నేషనల్ ఫండ్
దివ్యాంగులకు చేయూత..ట్రస్ట్ ఫండ్..నేషనల్ ఫండ్
- దివ్యాంగులు – హక్కులు
- వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యం) చట్టం -1995
వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యం) చట్టం -1995 జనవరి 1, 1996 నుంచి అమల్లోకి వచ్చింది. వికలాంగులకు సమానావకాశాలు కల్పించేందుకు, జాతీయ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ఏర్పిరిచేందుకు ఉద్దేశించిన అతిముఖ్యమైన అడుగుగా ఈ చట్టాన్ని అభివర్ణిస్తారు. విద్య, ఉద్యోగాలు, వృత్తివిద్య, శిక్షణ, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, ప్రోత్సాహకర పరిస్థితులు, వికలాంగులకు పునరావాసం, నిరుద్యోగభృతి, ప్రత్యేక బీమా వంటి అంశాలతో కూడిన చట్టం వారి అభ్యున్నతికి దోహదపడుతుంది.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
- వికలాంగత్వం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం, మాతాశిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టడం.
- వికలాంగ బాలలకు 18 సంవత్సరాల వయసు నిండే వరకు ఉచిత విద్యను, పాఠ్యపుస్తకాలను వసతిని అందించేందుకు ప్రత్యేక పాఠశాలలు లేదా ఉన్న పాఠశాలలోనే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి.
- వారు పాఠశాలలకు చేరుకునేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించడం, పరీక్ష, శిక్షణా విధానాలను వారికి అనుకూలంగా తయారు చేయడం, ఆర్థిక ప్రోత్సాహకాలు స్కాలర్షిప్లను అందించాలి. బధిరులందరికీ ఒకే భాష అమల్లో ఉండే విధంగా చూడాలి.
- వికలాంగులకు విద్య, శిక్షణ ఇచ్చేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు.
- వికలాంగులకు కనీసం 3 శాతం సీట్లు రిజర్వ్ చేసే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం
- ప్రభుత్వ ఉద్యోగాల్లో తీవ్రమైన వికలాంగత్వం కలిగిన వారికి 3 శాతం రిజర్వేషన్లు, తక్కువ వికలాంగత్వం కలిగినవారికి 1 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం. వారికి ఆరోగ్య, రక్షణ సౌకర్యాలను కల్పించడం. ఉద్యోగ నిర్వహణలో వికలాంగులైన వారికి అదే సంస్థలో వారు చేయగలిగిన ఉద్యోగం కల్పించడం.
- పేదరిక నిర్మూలన పథకాల్లో కనీసం 3 శాతం వికలాంగులకు కేటాయించడం, సాంఘిక భద్రత కల్పించడం.
- వారికి గృహ, వ్యాపార, ఆరోగ్య సౌకర్యాలను, నివాస స్థలాలను ఏర్పాటు చేయడం. వారికి కావలసిన కృత్రిమ అవయవాలను తయారు చేసి అందజేయడం. మరింత అధునాతన కృత్రిమ అవయవాలకు ప్రోత్సహించడం.
- బహిరంగ స్థలాల్లో వారికి ఎదురయ్యే వివక్ష నుంచి రక్షణ కల్పించడం, బస్సులు రైళ్లు వాహనాల్లో ప్రయాణించేందుకు అనువుగా అనుకూలమైన సౌకర్యాలను, ప్రత్యేకంగా సీట్లను కేటాయించడం.
- వికలాంగ ఉద్యోగులకు ప్రత్యేక బీమా సౌకర్యాలు కల్పించడం, వికలాంగుల అభ్యున్నతికి కృషిచేసే ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించడం.
- ఈ చట్టం ద్వారా వారికి కల్పించిన ప్రత్యేక హక్కులు సరిగా అమలు చేయకపోయినా, ఉల్లంఘించిన వారికి సాంత్వన చేకూర్చేందుకు ప్రత్యేకంగా నియమించిన అధికారులకు వారు ఫిర్యాదు చేయవచ్చు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ల్లో, పంచవర్ష ప్రణాళికల్లో వారికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు.
- ప్రభుత్వంలోని అన్ని శాఖలు కంపెనీలు సంస్థలు ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీరికి కోటా మంజూరు చేసే క్రమంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సూత్రం వర్తించదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం 2013,అక్టోబర్ 8న స్పష్టం చేసింది.
1995 వికలాంగుల చట్టం ప్రకారం వైకల్యంలోని రకాలు
1) పాక్షికంగా చూపు కోల్పోవడం
2) పూర్తిగా చూపు కోల్పోవడం
3) కుష్టువ్యాధి
4) మాట/ వినికిడి లోపం గలవారు
5) మానసిక రుగ్మతలు
6) శారీరక లోపం గలవారు
7) బుద్ధిమాంధ్యం
భారతదేశ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగుల వివరాలు
- ఆగస్టు 2016న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 22.66 లక్షల మంది దివ్యాంగులున్నట్లు జాతీయ జనాభా లెక్కల విభాగం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మొత్తం దివ్యాంగుల సంఖ్య 2.68 కోట్లు ఉండగా అందులో దాదాపు 8.5 శాతం మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు తేలింది. వీరిలో 12, 24,456 మంది పురుషులు కాగా 10,42,148 మంది మహిళలు. వీరిలో అత్యధిక మంది కదలికకు సంబంధించిన వైకల్యాన్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
- దివ్యాంగుల్లో 8.5 శాతం మాత్రమే పట్టభద్రులు: దేశంలోని దివ్యాంగుల్లో కేవలం 8.5 శాతం మాత్రమే పట్టభద్రులని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2.68 కోట్ల మంది దివ్యాంగుల్లో 1.46 కోట్ల (54.5 శాతం) మంది అక్షరాస్యులు డిగ్రీ, ఆపై విద్య అభ్యసించిన పురుషులు 9 శాతం కాగా మహిళలు 7.7 శాతం. దశాబ్దం క్రితం దివ్యాంగుల్లో అక్షరాస్యుల శాతం 49.3 శాతంగా ఉంది.
వికలాంగులు- పథకాలు
- రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితాలో అంగవైకల్యం అనే అంశం ఉంది.
దీనదయాళ్ వికలాంగుల పునరావాస పథకం
- ఈ పథకం కింద వికలాంగుల సంక్షేమ నిర్దేశిత పాఠశాలలు, వృత్తి విద్యా కేంద్రాలు, పోప్ హోమ్, కమ్యూనిటీ పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయి.
- మానసిక, శారీరక వికలాంగులకు అవసరమైన సహాయ పరికరాలను అందిస్తున్నారు.
- కేంద్ర ప్రభుత్వం వికలాంగ పరిశోధకులకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ప్రతినెలా రూ.20,000 పారితోషికంగా ఇస్తున్నది.
- 1985లో జీవో -1995 ద్వారా వికలాంగులకు మిగులు భూముల్లో 5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. కానీ అది ఇంకా అమలు కాలేదు.
- 20 శాతం నుంచి 39 శాతం వరకు వైకల్యం ఉన్న వికలాంగులకు నెలకు రూ.200 పింఛను ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం 2013, డిసెంబర్ 2న నిర్ణయించింది. అప్పటివరకు 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికే పింఛన్లు ఇచ్చేవారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ రూ.500 నుంచి రూ.1500లకు పెంచారు. రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత 3016 చేశారు. 2023 జూలై నుంచి మరో రూ.1000 పెంచి రూ.4016 చేశారు.
- వికలాంగులకు ఇళ్ల నిర్మాణానికి రూ.లక్ష వరకు రుణం ఇస్తామని, పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రొఫెషనల్స్‌కు ఉపయుక్తంగా ఉండే విధంగా 3జీ ఫోన్లు, AAY కార్డు లేని వికలాంగులందరికీ కార్డులు అందజేస్తామని, వడ్డీలేని రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని, డిగ్రీ ఫస్ట్ క్లాస్ వచ్చిన విద్యార్థులు పీజీలో చేరితే వారికి మోటారు సైకిళ్లు అందించనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
- దివ్యాంగులు వాడే ప్రత్యేక వాహనాలకు మాత్రమే టోల్ రుసుమును మినహాయిస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ పేర్కొంది.
వికలాంగుల కోసం కృషి చేస్తున్న జాతీయ సంస్థలు
- వికలాంగులకు పునరావాస సేవలను అందించాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం సాధికారత శాఖ అనేక స్వచ్ఛంద సంస్థలకు నిధులను అందిస్తున్నది.
1) మానసిక వైకల్యం, వైకల్యాల జాతీయ ట్రస్టు వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నది.
2) దేశంలో 216 జిల్లా పునరావాస కేంద్రాలు వికలాంగులకు సేవలందిస్తున్నాయి.
3) డిజేబిలిటీ అఫైర్స్ శాఖ నేషనల్ హ్యాండీకాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ) ద్వారా అర్హులైన వికలాంగ విద్యార్థులకు రూ.2500 స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది. ఈ స్కాలర్షిప్ రెండు రకాలు
ఎ) స్కాలర్షిప్ స్కీం (ట్రస్ట్ఫండ్)
బి) స్కాలర్షిప్ స్కీం (నేషనల్ ఫండ్)
స్కాలర్షిప్ స్కీం (ట్రస్ట్ఫండ్)
- ఈ స్కీం పరిధిలో రూ.2000 స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్ టెక్నికల్ కోర్సులు చదువుతున్నవారు వీటికి అర్హులు.
- వీటిలో 30 శాతం స్కాలర్‌షిప్స్‌ను బాలికలకు కేటాయించారు. ఒకవేళ బాలికలు లేని పక్షంలో వీటిని బాలురకు ఇస్తారు.
- దరఖాస్తుదారులు అకడమిక్ ఇయర్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో చదివేవారికి మెయింటెనెన్స్, అలవెన్స్ కింద ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.2,500/-, పీజీ విద్యార్థులకు రూ.3000 చెల్లిస్తారు. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు పుస్తకాలు/ స్టేషనరీ అలవెన్స్ కింద ఏడాదికి రూ.6,000/-, పీజీ విద్యార్థులకు అయితే రూ.10,000 చెల్లిస్తారు.
- వికలాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలు (హియరింగ్/ కళ్లు/ ట్రై సైకిల్స్/ ఆర్టిఫిషియల్ లెగ్స్/హ్యాండ్స్) తదితరాలు కొనుగోలు చేయడానికి ధన సహాయం చేస్తారు. జీవితంలో ఒకసారి మాత్రమే దీన్ని ఇస్తారు.
- ఈ పథకం కింద స్కాలర్షిప్స్ పొందాలనుకునేవారి తల్లిదండ్రుల నెల ఆదాయం రూ.25,000 లేదా వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించరాదు.
- ఈ స్కీం కింద స్కాలర్షిప్స్ పొందేవారు ఇతర స్కాలర్షిప్స్ ఏవీ తీసుకోకూడదు.
స్కాలర్షిప్ స్కీం (నేషనల్ ఫండ్)
- ఈ స్కీం కింద రూ.500 స్కాలర్షిప్స్ ఇస్తారు.
- ఉన్నత / ప్రొఫెషనల్/టెక్నికల్ విద్యార్హతలు ఉన్నవారికి వీటిని ఇస్తారు.
- ఏటా జూలై 1 నుంచి ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
- డిగ్రీస్థాయిలో ప్రొఫెషనల్ కోర్సులు చేస్తూ హాస్టల్లో ఉన్నవారికి నెలకు రూ.1,000, డే స్కాలర్స్‌కు రూ.700 ఇస్తారు. అదే విధంగా డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసేవారికి నెలకు రూ.700(హాస్టల్లో ఉండేవారికి), డే స్కాలర్స్‌కు రూ.400 ఇస్తారు.
- ప్రొఫెషనల్ కోర్సులు చదివే అంధ/బధిర విద్యార్థులకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ తీసుకోవడానికి నిధులను సమకూరుస్తారు.
- ఈ పథకం కింద స్కాలర్షిప్ తీసుకోవాలనుకునేవారి తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.15000/- కు మించరాదు. లేదా వార్షికాదాయం రూ.1.80 లక్షలు దాటరాదు.
- ఈ స్కాలర్షిప్ పొందే సమయంలో వేరే ఇతర స్కాలర్‌షిప్స్‌ను పొందరాదు.
వైకల్యం- కొన్ని ముఖ్యాంశాలు
- ప్రపంచ జనాభాలో 15 శాతం మంది లేదా కనీసం వందకోట్ల మంది ఏదో ఒక రకమైన వైకల్యంతో ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల వైకల్యంపై విడుదల చేసిన ప్రపంచ నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన భారతీయుల్లో 15 కోట్ల మంది ఏదో ఒక వైకల్యంతోనే ఉన్నట్లు తెలియజేసింది.
క్రాస్ డిజేబిలిటీ మూవ్మెంట్ ఇన్ ఇండియా
- 1993లో డిజేబుల్డ్ రైట్స్ గ్రూప్ అనే పేరుతో భారతదేశంలోనే మొదటి క్రాస్ డిజేబిలిటీ అనే సంస్థ వైకల్యం ఉన్నవారందరితో కలసి పోరాటం మొదలు పెట్టింది.
కన్వెన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (సీఆర్పీడీ)
- వికలాంగులకు సంబంధించిన మొదటి మానవ హక్కుల ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి 61వ సమావేశం సందర్భంగా సీఆర్పీడీని 2006 డిసెంబర్ 13న ప్రకటించింది. వికలాంగులు సమాజంలో అత్యంత నిరుపేదలుగా, దుర్బరులుగా ఉన్నారని అందువల్ల వారి మానవ హక్కులను పరిరక్షించాలని సీఆర్పీడీ సూచించింది. వైకల్యం ఒక మానవ హక్కుల సమస్య అని ఇది నిరూపించింది. 2006 ఎన్సీపీఈడీపీ, డీఆర్‌జీలు 2007 అక్టోబర్ 2 నుంచి నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభమైనట్లు ప్రకటించాయి. దానితో భారత ప్రభుత్వం దిగివచ్చి 2007 అక్టోబర్ 1న సీఆర్పీడీకి ఆమోదం తెలిపింది. ప్రపంచంలో సీఆర్పీడీని గుర్తించిన 7వ దేశంగా భారతదేశం ఖ్యాతి గడించింది.
- సీఆర్పీడీని ఆమోదించిన తర్వాత దాని స్ఫూర్తికి అనుగుణంగా (1995 నాటి చట్టాన్ని సవరించే బదులు) ఒక వికలాంగుల హక్కుల చట్టాన్ని కొత్తగా తీసుకురావాలని డీఆర్జీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ప్రభుత్వం ఏప్రిల్ 2010లో ఒక కమిటీని నియమించింది. 14 నెలల తర్వాత 2011 జూన్ 30న కమిటీ తన ప్రతిపాదనలను సమర్పించింది. మరో 14 నెలల తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖ కేంద్ర సాంఘిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2012 నాటికి ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది.
– శ్రీతేజ పబ్లికేషన్స సౌజన్యంతో…
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

