ముంబై: ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు చేతులు కలిపారు. రోడ్డు భద్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఫీల్డ్‌లో కలిసి ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, విండీస్ దిగ్గజ ప్లేయర్ బ్రియాన్ లారా ఆ రోడ్డు భద్రత గురించి సందేశమిచ్చే వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ 49 సెకన్ల వీడియోలో హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో వివరించాడు సచిన్ టెండూల్కర్. క్రికెట్ ఫీల్డ్‌లో అయినా, బండి నడిపేటప్పుడు అయినా హెల్మెట్ కచ్చితంగా ధరించాలని సచిన్ పిలుపునిచ్చాడు. ఈ సందేశాన్ని చేరవేయడంలో సాయం చేసిన లారాకు మాస్టర్ థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీడియోను సచిన్ ట్విటర్లో షేర్ చేయగా.. ఆస్కార్ నామినేషన్ అని కామెంట్ చేస్తూ దీనిని రీట్వీట్ చేశాడు యువరాజ్‌సింగ్. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి రాయ్‌పూర్‌లో జరగబోయే ఫైనల్లో ఇండియా లెజెండ్స్.. శ్రీలంక లెజెండ్స్‌తో తలపడనుంది. హైఓల్టేజ్ సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌ను ఇండియన్ లెజెండ్స్ ఓడించారు. ఆ మ్యాచ్‌లో సచిన్, లారా ఆట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.