వనభోజనంబు

తీరొక్క కూరలతో పసందు
హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో 10 నుంచి 15 కేంద్రాలు
చెట్లకిందే భోజనం.. రూ. 25లకే ప్లేట్ మీల్స్
ఇంటి భోజనం ఒంటికి మంచిది.. కానీ విద్యా, ఉద్యోగ, వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటూ సొంతింటి రుచులు ఎరుగని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికే అన్నట్టు వెలిశాయి ఈ వనభోజన కేంద్రాలు. అచ్చం ఇంటి భోజనాన్ని తలపించేలా కండ్ల ముందే కట్టెల పొయ్యిపై వండి తీరొక్క కూరలతో వేడివేడిగా వడ్డిస్తున్నారు. కేవలం 25కే పచ్చని చెట్ల మధ్య కడుపునిండా భోజనం పెడుతున్నాయి కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో ఉన్న మీల్స్ సెంటర్లు. రోజూ వందలాది మంది ఇక్కడ భోజనాలు చేస్తుండటం చూస్తే వనభోజనాలను తలపిస్తున్నది.
చెట్ల కింద భోజనాన్ని నగరవాసులు లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. తక్కువ ధరకే తీరొక్క కూరలతో రుచికరమైన భోజనాన్ని కడుపునిండా పెడుతుండటంతో బారులుతీరుతున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం నుంచి మొదలుకొని ప్రధాన రహదారి వెంట హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా సుమారు 10 నుంచి 15 వరకు భోజన కేంద్రాలు ఏర్పడ్డాయి. వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వాహనదారులే కాకుండా సంపన్నులు సైతం ఈ భోజనాలను రుచి చూస్తుంటారు. రోజూ మధ్యాహ్నం అయ్యిందంటే చాలు నిర్జన ప్రదేశం మొత్తం జాతరను తలపిస్తున్నది. మండుతున్న ఎండలకు చల్లని చెట్ల గాలిని ఆస్వాదిస్తూ కడుపు నింపుకొంటున్నారు. ప్రతి రోజు సుమారు ఒక్కో కేంద్రంలో 150 నుంచి 200మంది వరకు భోజనం చేస్తుంటారు. మొత్తం కేంద్రాల్లో 2వేల వరకు భోజనం చేస్తుండగా, సుమారు 500 మంది వరకు భోజనాన్ని పార్సిల్ తీసుకువెళ్తారని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ధర తక్కువ.. టేస్ట్ ఎక్కువ..!
ఈ భోజన కేంద్రాలతో నగరవాసులు అనేక మంది ఉపాధి పొందుతున్నారు. చెట్ల కిందనే కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసి కండ్లముందే వండుతున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వండటం మొదలుపెట్టి 12 గంటల వరకు అన్ని రకాల వంటలు సిద్ధం చేస్తారు. కండ్ల ముందరే తీరొక్క కూరలు తెలంగాణ టేస్టులతో తయారు చేసి వేడివేడిగా వడ్డిస్తుండటంతో ఇక్కడ భుజించేందుకు నగరవాసులు అతిగా ఇష్టపడతారు. అన్ని వర్గాల ప్రజలకు ధరలు అందుబాటులో ఉండటంతో భోజనప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్లేట్ రైస్ ధర కేవలం 25కే లభిస్తుంది.
ఇక్కడ లభించే వంటలు..
వైట్ అన్నం, బగార అన్నం, బిర్యానీ, పప్పు, సాంబర్, పెరుగు, పచ్చిపులుసు, అన్ని రకాల కూరగాయలు, కోడిగుడ్డు, చికెన్, ఫిష్, తలకాయ, బోటి, రాగిసంగటి కోడికూర తదితర రకాల కూరలు లభిస్తాయి.
ఉపాధి పొందుతున్నాం
నాలుగేండ్లుగా ఇక్కడ భోజన కేంద్రం నిర్వహిస్తున్నాం. మొదట్లో అంతంత మాత్రమే నడిచేది. క్రమంగా కస్టమర్లు పెరుగుతున్నారు. ప్రతి రోజు 150 నుంచి 200 మంది మా వద్ద భోజనం చేస్తున్నారు. 80 నుంచి 100 వరకు పార్సిళ్లు తీసుకెళ్తారు. ఈ కేంద్రం ఏర్పాటుతో మా ఇంట్లో నలుగురం ఉపాధి పొందుతున్నాం. బయట హోటళ్లు, రెస్టారెంట్లలో కంటే తక్కువ ధరకే రుచికరమైన భోజనం పెడుతున్నాం. – సుజాత, చింతల్, నిర్వాహకురాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- vanabhojanam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

