గోదావరిఖని కోల్సిటీ, అక్టోబర్ 4: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 57వ డివిజన్ ఎన్టీఆర్నగర్లో ఇండ్ల కూల్చివేత ఘటన ఉద్రిక్తతకు దారి తీసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకా రం.. ఎన్టీఆర్నగర్లో శనివారం ఇండ్ల కూల్చివేతకు నంబర్ ప్లేటులేని జేసీబీ వాహనం రావడంతో స్థానికులు గుమిగూడి ప్రశ్నించారు.
ఇక్కడ 30 ఫీట్ల రోడ్డు వేస్తున్నారని, 15 ఫీట్లు వెనక్కి జరుపాలని సిబ్బంది చెప్పడంతో కోపోద్రిక్తులయ్యారు. ‘ముందు మా ప్రాణాలు తీయండి.. ఆ తర్వాతనే ఇండ్ల జోలికి వెళ్లండి.. బలవంతంగా ఒక్క ఇటుక పెల్ల పెకిలించినా మా శవాలను చూస్తారంటూ’ జేసీబీకి అడ్డుగా వెళ్లారు. ఇండ్లు కూల్చాలని మున్సిపల్ అధికారులు చెప్పినట్టు ఏమైనా పత్రాలు ఉంటే చూపించాలని పట్టుబట్టారు.
తమకేమీ తెలియదని.. లీడర్లు చెబితేనే వచ్చామని సిబ్బంది చెప్పడంతో స్థానికులు ఎదురుతిరిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారేసరికి జేసీబీ సిబ్బంది వాహనంతోపాటు అక్కడి నుంచి పరారయ్యారు. తమ కాలనీలో ఓ సింగరేణి కార్మికుడు నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నాడనీ, అతడంటే పడని స్థానిక ప్రజాప్రతినిధి ఇదే అదనుగా 30 ఫీట్ల రోడ్డు వెడల్పు పేరుతో బస్తీలో ఇండ్లను కూల్చివేసేందుకు పురమాయించాడని స్థానికులు ఆరోపించారు.