Rakul Preet Singh | పుష్కర కాలం కిందట వచ్చిన ‘కెరటం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. ఈ మధ్య కాస్త డల్ అయింది కానీ.. ఐదేళ్ల కిందట ఆమెకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కాగా తాజాగా రకుల్ తన సినీ ప్రయాణం ఎలా సాగిందో ఇన్‌స్టాలో చెప్పుకొచ్చింది. హిందీ భామ భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘థ్యాంక్యూ యూ ఫర్ కమింగ్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్లు యూత్‌ను టార్గెట్ చేసుకుని తెరకెక్కినట్లుగా స్పష్టమైంది.
కాగా సినిమా రిలీజ్‌కు దగ్గరతున్న నేపథ్యంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు చేస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్లో భాగంగా భూమి ఫడ్నేకర్ తన సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుపుతూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అనంతరం అనీల్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లను ట్యాగ్ చేస్తూ.. వారి సినీ ప్రయాణాన్ని తెలియజేయాలని కోరింది. దీంతో రకుల్ తన సినీ ప్రయాణం గురించి ఇన్‌స్టాలో నోట్ రాసుకొచ్చింది.
రకుల్ తాను చిన్నతనంలో ఉన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కన్నట్లు తెలిపింది. సినీరంగం గురించి అసలేమి తెలియని రోజుల్లో మోడలింగ్‌లోకి ప్రవేశించానని.. అక్కడి నుంచి మిస్ ఇండియా.. సినిమా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పింది. ఇక అందరిలానే ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, తిరస్కరణలకు గురైనట్లు చెప్పింది. సినిమాల ప్రయత్నాల కోసం ఫ్యామిలీని వదిలేసి ముంబైలో అడుగుపెట్టి ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించానని, తాను తీసుకున్న కీలక నిర్ణయం ఇదేనని వెల్లడించింది.
సినిమాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, క్యూ లైన్స్‌లో నిలవడం చేశానని, కొన్ని సినిమాలకు సైన్ చేసిన తర్వాత కూడా చివరి నిమిషంలో తన ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చింది. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత చివరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నానని, కఠోర శ్రమతో కలలు కన్న లక్ష్యాన్ని ఛేదించానని, ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు తనకు అందమైన పాఠాలను నేర్పించాయని, ఈ స్థాయికి రావడానికి కుటుంబం తనకు అండగా నిలిచిందని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఓ బాలీవుడ్ సినిమా, రెండు తమిళ సినిమాలున్నాయి. కాగా రెండు తమిళ సినిమాలు స్టార్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. ఇక తెలుగులో ఈ బ్యూటీకి ఒక్క సినిమా కూడా లేదు.