దుకాణంలోని నిత్యావసర వస్తువులు చూసేందుకు బాగానే కనిపిస్తాయి. అయితే, మన కండ్లు కప్పి కల్తీ చేసే అవకాశం ఎక్కువే. అసలు, కల్తీ జరిగిందీ లేనిదీ నిర్ధారణ చేసుకోవడానికి భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ కొన్ని చిట్కాలను సూచించింది.
పసుపు
పసుపు నాణ్యతను తెలుసుకునేందుకు.. రెండు గ్లాసులలో మంచినీళ్లు తీసుకోవాలి. వాటిలో కొద్ది మొత్తంలో పసుపు వేయాలి. కల్తీ కాని పసుపు వేసిన గ్లాసులోని నీళ్లు లేత పసుపు రంగులోకి మారి, పసుపు అడుగు భాగానికి చేరుతుంది. అదే కల్తీ పసుపైతే నీరంతా గాఢమైన పసుపు రంగులోకి మారిపోతుంది.
వంట నూనెలు
చిన్న పాత్రలో రెండు మిల్లీ లీటర్ల నూనె తీసుకోవాలి. దానికి సహజమైన వెన్న కలపాలి. నూనె కల్తీ కాకపోతే వెన్న రంగు మారదు. కల్తీ జరిగి ఉంటే, వెన్న ఎరుపు రంగులోకి మారిపోతుంది.
మిరియాలు
కొన్ని మిరియాలను తీసుకొని టేబుల్‌పై ఉంచాలి. వాటిని చేతితో మెదపాలి. కల్తీ లేకపోతే అవి నలిగిపోవు. కల్తీ ఉంటే నలిగిపోతాయి. నల్లనివన్నీ మిరియాలు కావు. బ్లాక్‌బెర్రీ అయినా కావచ్చు.
కారం
ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి. అందులో ఒక చెంచా కారం కలపండి. తర్వాత, గ్లాసు అడుగున చేరిన అవశేషాన్ని పరీక్షించండి. ఆ అవశేషాన్ని అరచేతిలోకి తీసుకొని బాగా రుద్దండి. గరుకుగా అనిపిస్తే మిరపపొడిని ఏ ఇటుకల పొడితోనో కల్తీ చేశారని అర్థం. అలాకాకుండా సబ్బులా, బాగా నునుపుగా అనిపిస్తే ఏ సోప్ స్టోన్ (టాల్కం పౌడర్)తోనో కల్తీ చేశారని గ్రహించాలి.