స్విగ్గీలో బిర్యానీ, జొమాటోలో పుల్కాలు ఆర్డర్ చేస్తాం. బిగ్‌బాస్కెట్‌లో కాయగూరలు కొంటాం. పదంటే పది నిమిషాల్లో సరుకులు వచ్చేస్తాయి. నిమిషం ఆలస్యమైనా మనలో అసహనం మొదలవుతుంది. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తాం. చెమటలు తుడుచుకుంటూ వచ్చిన డెలివరీ బాయ్‌ని దబాయిస్తాం. నిజానికి తనకు ప్రతి నిమిషం విలువైందే. ప్రతి డెలివరీ కీలకమైందే. మనం ఇచ్చే రేటింగ్ తన సంపాదనను ప్రభావితం చేస్తుంది.
ఆ పూట ఇంటికి ఎంత తీసుకెళ్లాలన్నది నిర్ణయిస్తుంది. మొత్తంగా గిగ్ ఎకానమీ వెనుక ఉన్న.. అమానవీయ కోణాన్ని ఉద్వేగ భరితంగా తెరకెక్కించారు నటి-దర్శకురాలు నందితా దాస్. ఆ చిత్రం పేరు ‘జ్విగాటో’. ‘నేను సమాజంలోంచి వచ్చిన నటిని. సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేశాను. వివిధ ఎన్జీవోలతో పనిచేశాను. అట్టడుగు జీవితాలను అతిదగ్గరి నుంచి చూశాను. ఆ అనుభవాలే నా సినిమాలకు ముడిసరుకు’ అంటారు నందిత. తను ఇంకో ప్రయోగం కూడా చేశారు. ఆ చిత్రంలో ఓ ఐదారుగురు మినహా అంతా.. పక్కా లోకల్ మనుషులే. ఒడిషాలోని భువనేశ్వర్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.