– సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
కొండమల్లేపల్లి, అక్టోబర్ 08 : నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుండి నీటిని లిఫ్ట్ చేసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు 1.5 టీఎంసీలు, నల్లగొండ జిల్లాకు 0.5 టీఎంసీల నీటిని పంపిణీ చేయాలని కోరుతూ నల్లగొండ ఎమ్మెల్యే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి గతంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే 0.5 టీఎంసీల నీటిని నల్లగొండ జిల్లాలోని సంబంధిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం జి.ఓ. నం.10, తేదీ 22-01-2025 ద్వారా అనుమతులు మంజూరు చేసి, టెండర్లు పిలిచి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం పూర్తయితే సుమారు 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని అనేక ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు నీటి తరలింపును తీసుకెళ్లి ఆ జిల్లా ప్రజల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి పని చేస్తున్నడని, నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానం ముందుకు వస్తుందని, దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు తగిన ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని ఒప్పించి మన నికర జలాలను దేవరకొండ ప్రాంతానికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. డిండి ఎత్తిపోతలు ఏదులపాడు నుండి రావాల్సిన 30 టీఎంసీల నీళ్లను మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాకు ఇచ్చి కేవలం రెండు టీఎంసీలను మాత్రమే ఈ ప్రాంతానికి కేటాయించి చేతులు దులుపు కోవడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. కావున నల్లగొండ జిల్లాలో సాగునీటి అవసరాలు,రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి నల్లగొండ జిల్లాకు కేటాయించిన 0.5 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నల్లా వెంకటయ్య, కంభంపాటి శంకర్, బుడిగ వెంకటేష్, రామావత్ లక్ష్మణ్ నాయక్, అంజయ్య, రాములు, సుందర్ పాల్గొన్నారు