విశ్వకార్తికేయ, హ్రితిక శ్రీనివాస్ (సీనియర్ నటి ఆమని మేనకోడలు) జంటగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వుల దర్శకుడు. ఆర్.ఆర్.క్రియేటివ్ పతాకంపై ఎన్.చంద్రమోహన్ రెడ్డి నిర్మించారు. త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో నటి ఆమని, కథానాయిక హ్రితిక శ్రీనివాస్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆమని మాట్లాడుతూ ‘హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. నా మేనకోడలు హ్రితిక పదేళ్ల వయసులోనే ఓ తమిళ సినిమాలో పూర్తిస్థాయి పాత్రలో మెప్పించింది. ‘అల్లంత దూరాన’ సినిమాలో ఇద్దరం కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించాం. హ్రితిక భవిష్యత్తులో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పింది. హ్రితిక మాట్లాడుతూ ‘నటనలో అత్తమ్మే నాకు స్ఫూర్తి. నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కోసం తమిళం, తెలుగులో డైలాగ్స్ అన్నీ సింగిల్టేక్లో చెప్పాను. కథతో పాటు నా పాత్ర చిత్రణ బాగుండే సినిమాల్ని ఎంచుకోవాలనుకుంటున్నా. తెలుగులో కెరీర్ ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తున్నా’ అని చెప్పింది.