చదువుతో పనిలేదు. అనేక రౌండ్ల ఇంటర్వ్యూలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేయాలనే తపన, కాలం విలువ తెలిస్తే చాలు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేయొచ్చు.
హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన మొయినొద్దిన్ రోజుకు వెయ్యికిపైగా ఆదాయం సంపాదిస్తుండు. నిర్ణీత సమయాల్లో ఆర్డర్స్ చేరవేస్తూ ఇన్సెంటివ్స్ పొందుతుండు. కారణం అతడికి నగరంపై అవగాహన ఉండటమే. గల్లీగల్లీ పరిచయం ఉండటంతో ఫుడ్ ఆర్డర్‌ను గూగుల్ వ్యవధి కంటే తక్కువ సమయంలో కస్టమర్స్‌కు అందించి ఔరా అనిపిస్తుండు.
ఎంత చదివామన్నది కాదు.. ఎంత సంపాదించామన్నదే ముఖ్యం… ఇది నగరానికి చెందిన రాజీవ్ ఫిలాసఫీ. పీజీ చదివినా ఉద్యోగం రాలేదని కుంగిపోలేదు. అందివచ్చిన అవకాశాన్ని ఎలా ఉపాధిగా మార్చుకోవాలనే దానిపై దృష్టి సారించాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేరి నెలకు రూ.30వేలపైన సంపాదిస్తున్నాడు.
సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ): గల్లీ బాయ్స్ ఫుడ్ డెలివరీ రంగంలో దూసుకుపోతున్నారు. ఇతరులతో పోలిస్తే అధికంగా ఇన్సెంటివ్స్ పొందుతున్నారు. నగరంలో అణువణువు తెలిసి ఉండటం, షార్ట్ రూట్స్‌పై అవగాహన ఉండటంతో.. ఎక్కువ ఆర్డర్స్ అచీవ్ చేయగలుగుతున్నారు. ఇతర నగరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ కంటే చాలా వరకు సిటీ బాయ్స్దే అధిక సంపాదన. గ్రేటర్లో సుమారు 40 వేల మంది ఫుడ్ డెలివరీ రంగంలో ఉన్నారు. స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్‌పాండా తదితర ఆహార సరఫరా సంస్థలు ఆన్లైన్లో తమ మార్కెట్‌ను విస్తరించుకోవడంలో భాగంగా డెలివరీ బాయ్స్ రిక్రూట్మెంట్ ఊపందుకుంటుంది.
ఆ సమయం చాలా కీలకం
లంచ్, డిన్నర్ సమయాలు చాలా కీలకం. మ.12 గంటల నుంచి 3గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 12గంటల వరకు సమయాల్లో ఆర్డర్స్ అధిక సంఖ్యలో వస్తాయి. డెలివరీ బాయ్స్‌కి నిమిషం కూడా నిల్చొని మాట్లాడే తీరిక ఉండదు. నిజానికి ఆ సమయాలే డెలివరీ బాయ్స్‌కు డబ్బులు సంపాదించిపెడుతాయి. ఈ సమయాలలో డెలివరీ బాయ్స్ విధుల్లో ఉండి.. ఆర్డర్స్‌కు అందుబాటులో ఉంటే ప్రతి కంపెనీ ఇన్సెంటివ్స్ పేరు మీద అదనంగా డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తోంది. దీంతో డెలివరీ బాయ్స్ పోటాపోటీగా ఆర్డర్స్ ఇన్‌టైమ్‌లో కస్టమర్స్‌కు అందిస్తున్నారు. ఇందులో లోకల్ బాయ్స్ ఎక్కువ ఆర్డర్స్ పూర్తి చేస్తుండటం విశేషం.
ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా చెల్లింపులు
ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు కంపెనీ జీతం ఇవ్వదు. ఫుడ్ ఆర్డర్స్ పైనే వారికి ఉపాధి. జొమాటోలో ఒక ఆర్డర్ మీద రూ. 40 వస్తాయని అంటున్నారు. అందులో కిలోమీటర్‌కు రూ.5పైనే ఉంటుందని చెబుతున్నారు. కస్టమర్ డెలివరీకి రూ. 20, రెస్టారెంట్లో వెయిటింగ్‌కు రూ. 20. రోజుకు కనీసం 14 ఆర్డర్స్ చేసుకుంటారు. టార్గెట్ పూర్తి చేస్తే అదనంగా రూ. 300పైనే ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. ఒకవేళ 20 ఆర్డర్లు చేసుకుంటే రూ. 450, 25కిపైగా ఆర్డర్లు చేస్తే రూ. 700.. ఇలా ఇన్సెంటివ్స్ వస్తాయని అంటున్నారు. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ తొందరగా ఆర్డర్ పూర్తి చేసి, మరో ఆర్డర్ స్వీకరించడానికి రెడీగా ఉండాలి. అంతేకాదు ఆర్డర్ నిర్ణీత కిలోమీటర్ దూరం దాటితే కంపెనీ అదనంగా కిలోమీటర్‌కు రూ.10 చెల్లిస్తుందని పేర్కొన్నారు. స్విగ్గీలో ఒక ఆర్డర్‌పై రూ.35, రూ.900ల వరకు ఆర్డర్స్ పూర్తి చేస్తే అదనంగా రూ. 200 గడించొచ్చని డెలివరీ బాయ్స్ తెలిపారు. ఉబర్ ఈట్స్‌లో ఒక్క ఆర్డర్ మీద రూ. 35, 24 ఆర్డర్లు చేసుకుంటే అదనంగా రూ. 600 గడించొచ్చని డెలివరీబాయ్స్ తెలిపారు. నెలకు సుమారు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు సంపాదించుకోవచ్చని డెలివరీ బాయ్స్ తెలిపారు.
ఆ ప్రాంతాల్లో ఆర్డర్స్ అదుర్స్..
బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, మణికొండ పరిధి ప్రాంతాల్లో ఆన్లైన్ ఫుడ్ సైప్లెకి గిరాకీ పెరిగింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే డెలివరీ బాయ్ రోజుకు రూ. 2 వేల వరకు సంపాదించే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కువగా కార్యాలయాలు ఉండటంతో విధులకు హాజరయ్యేవారు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్కే మొగ్గు చూపుతున్నారు.
ట్రాఫిక్ కష్టాలు…
మహానగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పనవసరం లేదు. సమయానికి గమ్యాన్ని చేరాలంటే గంట ముందు బయలుదేరాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి స్థితిలో ఫుడ్.. సమయానికి అందివ్వాలంటే కత్తిమీద సామే. సమయానికి ఆర్డర్ అందించకపోతే కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంతేకాదు ఆలస్యం అయితే ఇన్సెంటివ్స్ పొందడం కూడా కుదరదు. అందుకే ఫుడ్ సైప్లె బాయ్స్ ఎక్కువగా షార్ట్‌కట్ దారులను ఎంచుకుంటున్నారు. వారు పనిచేస్తున్న ఏరియాల్లో ల్యాండ్మార్క్స్ను ముందే తెలుసుకుంటామని బాయ్స్ చెబుతున్నారు.
జాబ్ పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి
చదువుతో పనిలేదు. అనేక రౌండ్ల ఇంటర్వ్యూలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేయాలనే తపన, కాలం విలువ తెలిస్తే చాలు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేయొచ్చు. విధుల్లో చేరడానికి లైసెన్స్, ద్విచక్రవాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్ వివరాలు ఒరిజినల్స్‌తో కంపెనీలో సంపద్రిస్తే సరిపోతుంది. కస్టమర్‌కు ఆర్డర్ సమయానికి ఎలా అందించాలి? వారితో ఎలా నడుచుకోవాలి? ఇన్సెంటివ్స్ ఎక్కువగా చేసుకోవాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? నగరంలో డ్రైవింగ్ ఎలా చేయాలి? తదితర వాటిపై సదరు కంపెనీలు శిక్షణ ఇస్తాయి. అనంతరం వారికి లాగిన్ ఐడీ క్రియేట్ చేసి విధుల్లోకి తీసుకుంటారు.
మనకు మనమే బాస్
ఫుడ్ డెలివరీ బాయ్‌గా స్వేచ్ఛగా పని చేయొచ్చు. కాకపోతే కాలంతో పరుగెత్తాలి. సమయానికి కస్టమర్‌కు ఫుడ్ అందించాలి. ఎవరి కింద పని చేయాల్సినవసరం లేదు. మనకు మనమే బాస్. ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతాయి. ఎన్ని ఆర్డర్స్ పూర్తి చేసుకుంటే అంత కమీషన్ దొరుకుతుంది.
రిస్క్ ఉన్నా.. ఇష్క్‌తో చేస్తాను
మాది తార్నాక. ఏ ఉద్యోగంలోనైనా రిస్క్ తప్పదు. డెలివరీ బాయ్ పనిలో కూడా రిస్క్ ఉంది. అయితే నేను ఈ ఉద్యోగాన్ని ఇష్క్‌తో చేస్తున్నాను. ఆర్డర్ వస్తే కస్టమర్‌కు ఎంత తొందరగా చేరవేసామనేదే ముఖ్యం. కొన్నిసార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతుంటాయి. దెబ్బలు తగిలినా.. కస్టమర్‌కు ఫుడ్ అందించకుండా వెనుతిరగం.