అల్పమైన విషయాలకు గొడవపడే జనాలకు యజ్ఞాలు శాంతి కలిగిస్తాయా?
మనుషుల్ని ప్రేమించడం, క్షమించడం తెలియకుండా పార్కింగులాంటి అల్పమైన విషయాల దగ్గర కూడా గొడవపడే జనాలకు యజ్ఞాలు శాంతి కలిగిస్తాయా? ఏంటో, ఎటు పోతున్నామో అర్థం కావడంలేదు” అన్నాడు. ఇది ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన సైన్సారు - సంఘమిత్రయజ్ఞం కథలోనిది.
కథ
సాయంత్రం ఐదవుతోంది.
ప్రభాకర్ బాల్కనీలో కూర్చుని రోజులాగే గతాన్ని నెమరేసుకుంటున్నాడు. నాలుగు నెలలక్రితం వరకూ, ఈ సమయంలో తన చుట్టూ పిల్లలు గుమిగూడుతుండేవారు. తను మధ్యలో కూర్చుని వాళ్ల సందేహాలకు సమాధానాలిస్తూ, చిన్న చిన్న ప్రశ్నలతో వాళ్లలో ఆలోచనలు రేకెత్తిస్తూ, క్లిష్టమైన పాఠాలకు సులభమైన భాష్యాలు చెబుతూ, అల్లరి, అలకలు, నవ్వులు పూసిన పిల్లల తోటలో విహరిస్తుండేవాడు. స్కూల్లో తను సైన్స్ సారయినా, ఇంటి దగ్గర అన్ని సబ్జెక్టులూ చెప్పేవాడు. వాళ్లకి ప్రత్యేకించి పాఠాలు చెప్పేవాడు కాదు. చదువుకునే వాతావరణం ఏర్పరచేవాడు. పుస్తకాలలో చెప్పనివి, స్కూళ్లలో వదిలేసినవి మాత్రమే చెప్పేవాడు.
‘ఇంకోవారం గడిస్తే ఇక్కడికి వచ్చి నాలుగు నెలలవుతుంది’ స్వగతంలో అనుకున్నాడు
ప్రభాకర్.
అసంతృప్తిని దిగమింగుకుంటూ దిక్కులు చూస్తున్నాడు. చుట్టు పక్కల ఎక్కడ చూసినా ఆకాశ హర్మ్యాలు, ఖాళీ జాగాలు, ఇంకా నిర్మాణంలో ఉన్న అసంపూర్ణ భవనాలు, వాటిమీద జిరాఫీల్లాగా బహుళ అంతస్తుల క్రేన్లు, రాక్షస పందికొక్కుల్లా ప్రొక్లయినర్లు కనిపిస్తుంటాయి.
ప్రభాకర్ సంవత్సరం క్రితం సైన్స్ అసిస్టెంట్‌గా జెడ్పీ హైస్కూల్ నుండి రిటైరయ్యాడు. కర్నూల్లో ఇల్లు కట్టుకుని ఉదయం స్నేహితులతో వాకింగు, మధ్యాహ్నం చదువు, విశ్రాంతి, సాయంత్రం ట్యూషన్లు… చాలా సంతోషంగా గడుపుతున్న అతని జీవితంలో ఆరునెలల క్రితం ఒక పెద్ద కుదుపు వచ్చింది.
పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన కొడుకు హైదరాబాద్ నగర శివార్లలోని ఈ గేటెడ్ కమ్యూనిటీలో ముప్పై రెండో అంతస్తులో ఒక ఫ్లాట్ తమకోసమే కొన్నానని, వెంటనే కర్నూలు వదిలి ఇక్కడికే వచ్చి ఉండమని కోరాడు. అనేక తర్జన భర్జనల అనంతరం ప్రభాకర్ దంపతులు ఇక్కడికి మకాం మార్చారు. ఇక్కడ చేరిన మిగతా వారిని చూశాక.. కొడుకు ఆలోచన అర్థమయింది. ఇల్లు బాడుగకు ఇస్తే పాడైపోతుందని, అలా అని వదిలేస్తే పాడుబడి పోతుందని, అందుకే ప్రేమపాశంతో తమని సెక్యూరిటీ కింద మార్చారని, తమకిది బంగారు పంజరమని ఎరుకయింది. అయితే మిగతా తల్లిదండ్రులందరూ స్వచ్ఛందంగా పిల్లలకోసం ఈ బాధ్యత స్వీకరించడం ఆశ్చర్యం కలిగించింది. కొడుకు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడయితే రెట్టింపు అవుతుందో లెక్కలేసి, పెట్టుబడులు పెట్టే గుప్తా గారిని చూశాక, ఒక ఇల్లు అమ్మి, ఇంకో ఇల్లు కొనడం హాబీగా పెట్టుకున్న బంగార్రాజు గారిని కలిశాక.. తనెంత ఏకాకో అర్థమయింది.
“టీ తాగండి” టీపాయి మీద కప్పు పెట్టి, తనుకూడా ఎదురుగా ఇంకో కుర్చీలో కూర్చుంది సుగుణ.
అతణ్ని ఈ సమయంలో చూస్తే ఆమెకి చాలా విచారం కలుగుతుంది. తమకి పెళ్లయిన దగ్గరనుండీ.. అంటే దాదాపు నలభై ఏళ్ల నుండీ సాయంత్రాలు అతణ్ని ట్యూషన్ పిల్లలతోనే చూసింది. అతనికి టీచింగ్, పిల్లలతో గడపడం సంతోషం కలిగించే వ్యాపకాలని పెళ్లయిన కొత్తల్లోనే ఆమెకు అర్థమయ్యింది. ప్రయోగాల పేరుతో, వైజ్ఞానిక ప్రదర్శనల పేరుతో నిరంతరం బిజీగా ఉండే అతణ్ని.. ఆమె ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. సైన్స్ టీచర్ అంటే ప్రత్యేకమైనవాడని, పిల్లలకు శాస్త్రీయ దృక్పథం అలవరచడంలో సైన్స్ సారుది ప్రధాన పాత్ర అని అతని నమ్మకం. అలా పాతుకుపోయిన చాలా అభిప్రాయాల వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఇక్కడి వారితో ఎక్కువగా కలవలేక పోయాడు. ఆమెకు ఫరవాలేదు. తన ఈడు వాళ్లతో స్నేహాలు పెరిగాయి. గాయత్రి పారాయణాలు చేయడం, టీవీ సీరియళ్ల చర్చలు, దేవాలయాలు, భగవదారాధన.. ఇలా ఆమెకు ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం ఉండేలా చేశాయి.
అతనికి అలా కాదు. సీరియళ్లు నచ్చవు. పూజా పునస్కారాలు గిట్టవు. ఇరుగు పొరుగు విషయాలు పట్టవు. ఉదయం, సాయంత్రం తను పోరు పెడితే కిందకు వెళతాడు. అక్కడ తన ఈడు వాళ్లతో కూర్చుని వాళ్ల మాటలు వింటాడు. సినిమాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అపార్ట్మెంట్ సమస్యలు, కొంత గాసిప్ ఇవన్నీ ఏవీ అతణ్ని ఆకర్షించవు. వచ్చాక విన్నవన్నీ తన ముందు ఏకరువు పెట్టి.. తనొక ఏకాంత ద్వీపవాసినని వాపోతాడు.
“నలభై ఏళ్లపాటు సంతోషంగా గడిపిన మనకు ఈ చివరి రోజులలో ఇదేం శిక్ష?” అంటాడతను.
ఇవే మాటలు కొడుక్కి చెబితే..
“నలభై ఏళ్లపాటు ఇరుకిరుకు సందులలో, అరకొర వసతులతో అద్దె ఇళ్లలో అవస్థలు పడ్డారు కదా! ఇప్పుడు సుఖంగా ఉండండి. సంతోషంగా ఉండటానికి అన్ని రకాల వసతులూ ఉన్నాయి కదా” అంటాడు వాడు.
చివరికి చర్చ.. సుఖంగా ఉండటం వేరు, సంతోషంగా ఉండటం వేరు అన్న దగ్గర ఆగిపోతుంది. అందుకే చాలా రోజులుగా తను ఏవో పొడి మాటలు తప్ప, ఈ సమయంలో అతణ్ని కదిలించదు.
టీ తాగాక.. సుగుణ రెండు కప్పులు తీసుకునిపోతూ
“మన అపార్ట్మెంట్ వాళ్లు యజ్ఞమేదో చేయిస్తారట కదా! వాట్సప్‌లో మెసేజ్ వచ్చి ఉంటుంది చూడండి” అన్నది.
“చూశాను. అయినా అపార్ట్మెంట్లలో యజ్ఞాలేంటి సుగుణా!? మరీ చిత్రం కాకపోతే! అక్కడెక్కడో మేడ్చల్‌లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో చేశారట. ఇక్కడ చేస్తే మనందరికీ కూడా శాంతి జరుగుతుందని ఒకాయన చెప్పడం, అక్కడే ఉన్న మరో పెద్దాయన వాళ్ల బంధువుని కనుక్కుంటే అదేదో సంఘమిత్ర యజ్ఞం అని చెప్పడం, లేడికి లేచిందే పరుగని అందరూ దానిని గురించే చర్చించడం! శాంతి, దయ లాంటి గుణాలు స్వతహాగా రావాలి లేదా మనం ప్రయత్నపూర్వకంగా ఏర్పరుచుకోవాలి. మనుషుల్ని ప్రేమించడం, క్షమించడం తెలియకుండా పార్కింగులాంటి అల్పమైన విషయాల దగ్గర కూడా గొడవపడే జనాలకు యజ్ఞాలు శాంతి కలిగిస్తాయా? ఏంటో, ఎటు పోతున్నామో అర్థం కావడంలేదు” అన్నాడు.
ఆమె ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి పోయింది.
అతను కింద మీటింగ్ కోసం తయారవుదామని బయలుదేరుతుంటే ఫోన్ మోగింది. చిరకాల మిత్రుడు రాఘవ నుండి.
అతను కూడా సైన్స్ టీచరే. రాష్ట్రం కలిసున్నప్పుడు దాదాపు ప్రతిసంవత్సరం సైన్స్ ఫెయిర్లోనో, సైన్స్ దినోత్సవాల్లోనో కలిసేవాళ్లు. ఈ మధ్యనే ప్రమోషన్ మీద హెడ్మాస్టర్గా ఇక్కడే ఎక్కడికో బదిలీ అయినట్టు మెసేజ్ పెట్టాడు. ఫోన్ తీశాడు.
“సార్! రేపు ఒక పని మీద సిటీకి వస్తున్నాను. మీకు కుదిరితే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా లక్డీకాపూల్ వచ్చేయండి. కలుద్దాం” అంటూ ఫోన్ పెట్టేశాడు.
అపార్ట్మెంట్ గ్రూప్ నుండి మరోసారి వాట్సప్ హెచ్చరిక రావడంతో బట్టలు మార్చుకుని సుగుణతో చెప్పి కింద మీటింగ్ హాల్‌కి వెళ్లాడు ప్రభాకర్. అప్పటికే ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు.
“..కాబట్టి మిత్రులారా! మరో వారం రోజులలో ధనుర్మాసం మొదలవుతుంది. ఈసారి నగర సంకీర్తనతోపాటు చివరి రోజున సంఘమిత్ర యజ్ఞం కూడా ఉంటుంది” అని ముగించాడు.
సెక్రెటరీ లేచి అలాంటి దివ్యమైన కార్యక్రమానికి అందరూ సహకారం అందివ్వాలని, ధర్మం అడుగంటి పోతున్న ఈ రోజులలో పిల్లలకి మనం ఇలాంటి ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగించడం చాలా అవసరమని అన్నాడు.
ట్రెజరర్, యజ్ఞ నిర్వహణ, భోజన ఏర్పాట్ల నిమిత్తం.. ప్రతి ఫ్లాట్ నుండి ఐదు వేల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించామని, త్వరలోనే వివరాలతో సర్క్యులర్ పంపుతారని చెప్పాడు.
సమావేశం ముగిసింది. అందరితోపాటూ ప్రభాకర్ కూడా లేచి ఇంటిదారి పట్టాడు. ఇప్పుడే వెళితే లిఫ్టులన్నీ రద్దీగా ఉంటాయని వాకింగ్ ట్రాక్ మీద నడవడం మొదలుపెట్టాడు.
మళ్లీ అతన్ని ఆలోచనలు తూనీగల్లా ముప్పిరిగొన్నాయి.
అతనికి ఇక్కడ అతనిలా ఆలోచించే మనుషులు లేరు. ఇలా గుళ్లు, గోపురాలు, యజ్ఞాలు, పుష్కరాలు అంటూ వాటికి విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వడం తనకు చిరాకు కలిగిస్తోంది.
‘అయోధ్య వెళ్లొచ్చారా? మేం మొన్ననే వెళ్లాం. మానస సరోవరం ఎంత బాగుంటుందో.. చార్ధామ్ యాత్రకు సన్నాహాలు చేస్తున్నాం’.. అస్తమానం ఇవే ముచ్చట్లు.
ఇలాంటి వాతావరణం అతణ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చెప్పలేని అశాంతి.
నాలుగు బెడ్రూంల ఫ్లాట్. అంతా చేస్తే ఉండేది అరవైలు దాటిన ముసలివాళ్లిద్దరు. అన్నిరూముల్లో ఏసీలు, నాలుగు రూముల్లో టీవీలు అమర్చి ఉన్నాయి. ఈ కమ్యూనిటీకే పరిమతమైన సూపర్ మార్కెట్ ఉంది. ఒక్క కాల్ దూరంలో సరుకులు, తిండి దొరుకుతాయి. బయటికి వెళ్లడానికి ఒక క్లిక్‌తో వచ్చి వాలే టాక్సీలు, ఆటోలు ఉన్నాయి.
‘మరి సంతోషంగా ఎందుకుండరు?’ అంటుంది భార్య.
అతను విరక్తిగా నవ్వుతూ.. ‘సౌకర్యంగా ఉండటం వేరు, సంతోషంగా ఉండటం వేరు!’ అంటాడు.
‘సంతోషం ఎలా వస్తుంది?’ అని అడుగుతుంది.
తనేమీ సమాధానం చెప్పడు. కానీ, మనసులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతుంటాయి.
అవును.. సంతోషం ఎలా కలుగుతుంది? తను చాలాసార్లు సంతోష పడ్డాడు.
నలభై ఏళ్ల క్రితం తొలిసారి పాఠం చెప్పినప్పుడు, క్లాస్ రూమును ప్రయోగశాలగా మార్చి పిల్లలతో కొన్ని రసాయనిక చర్యల ప్రయోగాలు చేయిస్తుంటే పిల్లల సంభ్రమాశ్చర్యాలు చూసినప్పుడు, తను పాఠం చెపుతున్నప్పుడు ఎవరయినా పిల్లలు ఆలోచించే ప్రశ్నలు సంధించినప్పుడు, ప్రతియేటా సైన్స్ ఫెయిర్‌లో తను పనిచేస్తున్న స్కూలుకి కనీసం మూడు బహుమతులు వస్తున్నప్పుడు, తన సబ్జెక్టులో పేపరెంత కఠినంగా ఉన్నా కనీసం తొంభై శాతం పిల్లలు పాసయినప్పుడు తను చాలా సంతోషపడ్డాడు. నలభై ఏళ్ల నుండీ ప్రతిరోజూ సాయంత్రం పిల్లలు ట్యూషన్‌కి రావడం నిత్యజీవితంలో భాగమైంది. ఇల్లు ఎప్పుడూ సందడిగా, చిన్న పిల్లలతో కిటకిటలాడి పోయేది. ఇక తొమ్మిది, పది పిల్లలనైతే రోజూ రాత్రి భోజనాల తర్వాత స్కూలుకు రమ్మని స్టడీ అవర్ పెట్టి, అక్కడే పడుకోమని చెప్పి, మళ్లీ ఉదయాన్నే లేపి గంట, గంటన్నర చదివించే వాళ్లు. హెడ్ మాస్టర్ అదే ఊర్లో ఉన్నా, లేకున్నా, తనే బాధ్యత తీసుకుని ఎప్పుడూ పిల్లలతో గడిపేవాడు. అందులో ఎంతో సంతోషం అనుభవించేవాడు.
తను రిటైర్ అయిన తర్వాత కూడా పిల్లలు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఎక్కడో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలు తనని గుర్తు చేసుకుంటామని చెప్పినప్పుడు తను ఎంత సంతోష పడ్డాడు?!
ఆలోచనలలోనే ఇల్లు చేరుకున్నాడు.
రాత్రి భోజనాలు ముగిశాక సాయంత్రం మాట్లాడిన రాఘవ గుర్తొచ్చాడు.
రాఘవ రెడ్డికి తనకి చాలా ఆసక్తికరమైన సంభాషణలు జరిగేవి. ఇద్దరికీ చాలా అభిప్రాయాలు కలిసేవి. ఒకసారి సైన్స్ టీచింగ్ గురించి అతను..

Sciensar 1
“సైన్స్ టీచ్ చేయడమంటే కేవలం పాఠం చెప్పి ప్రశ్న – జవాబులు రాయించడం కాదుకదా సార్” అన్న మాటలు గుర్తొచ్చి, తనలాగే ఆలోచించే మరొక వ్యక్తి ఉన్నాడని తను సంబరపడ్డాడు.
అవును, సైన్స్ పాఠం చెప్పటానికి కేవలం టెక్ట్స్ బుక్ మాత్రమే సరిపోదు. శాస్త్రజ్ఞుల జీవిత విశేషాలు చెప్పాలి. వాళ్ల కష్టం, కృషి.. కళ్లకు కట్టినట్టు వివరించాలి. వాళ్లు కనుక్కున్న విషయాల వల్ల కలిగిన ప్రయోజనాలు ప్రపంచమంతా అనుభవిస్తుంటే వాళ్లకి కలిగిన ఆనందం తాలూకు అనుభవాలు చెప్పాలి. అలాంటి జీవితాల వైపు వారిని నడిపించే సంఘటనలు చెప్పాలి. తన క్లాసులో మైఖేల్ ఫారడే, హంప్రీ డేవీల కథ చెబితే పిల్లలకి కళ్లమ్మట నీళ్లొచ్చేవి. లాంగ్వేజ్ టీచర్లు అసూయ పడేవారు, ఒక సైన్స్ సార్ కూడా పిల్లలను ఏడిపించగలడా!? అని. ఒక యువ శాస్త్రవేత్త కనిపెట్టిన బ్రోమైడ్.. కేవలం రివ్యూ వల్ల ఆలస్యమై అతనికి క్రెడిట్ రాకుండా పోయిన వైనం, హైసెన్బర్గ్కి, ఐన్‌స్టీన్‌కి మధ్య జరిగిన వివాదం ఇవన్నీ చెబుతుంటే క్లాస్ మొత్తం గుడ్లప్పచెప్పి వినేవాళ్లు. తను కేవలం తొమ్మిది, పది తరగతులకు మాత్రమే చెప్పేవాడు.
ఇన్ని జ్ఞాపకాలకు కారణమైన రాఘవను రాష్ట్రం విడిపోయాక మళ్లీ కలిసే అవకాశమే రాలేదు. ప్రభాకర్‌కి ఏదైనా రాష్ట్రస్థాయి పోటీలున్నా, సమావేశాలున్నా విజయవాడే వేదికయింది. హైదరాబాద్ రావలసిన అవసరం లేకపోయింది. మిత్రుల మధ్య మాటలూ తగ్గిపోయాయి. మళ్లీ ఈమధ్య ఫేస్ బుక్ పుణ్యమా అని తిరిగి స్నేహం చిగురించింది.
ఆ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నాడు ప్రభాకర్.
* * *
మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా హోటల్లో రాఘవరెడ్డి కోసం వెయిట్ చేస్తున్నడు ప్రభాకర్. పదినిమిషాల తర్వాత రాఘవరెడ్డి మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఒకరి మొహాల్లొకి ఒకరు చూసుకుంటూ, నవ్వుకుంటూ పరమానందంలో మునిగిపోయారు.
పక్కనే ఉన్న వ్యక్తి..
“సార్! మీ మిత్రుణ్ని కలిసిన సంతోషంలో ఇక్కడ నేనున్నానని కూడా మర్చిపోయినట్టున్నారు. నేనే పరిచయం చేసుకుంటానిక” అంటూ ప్రభాకర్ వైపు తిరిగి..
“సార్! నా పేరు రాజయ్య. నేను రాఘవరెడ్డి సార్ పనిచేసే స్కూల్లోనే సోషల్ అసిస్టెంట్. మీ గురించి సార్ దారెమ్మట చెబుతనే ఉన్నడు. మీ పిల్లల ముచ్చట, మీ సైన్స్ ఫెయిర్ ముచ్చట అన్నీ చెప్పిండు సార్. మంచి దోస్తీ సార్ మీది” అన్నాడు.
ప్రభాకర్ నవ్వుతూ..
“సారీ రాజయ్య గారూ! రాఘవని కలిసి పుష్కరం దాటింది. ఆ సంతోషంలో..” అని నొచ్చుకుంటూ వివరణ ఇవ్వబోతుంటే..
“అరే! ఊర్కె మజాక్ చేసిన సార్..”
భోజనం ఆర్డర్ చేసి, రాఘవరెడ్డి అడిగాడు
“ఏం సార్.. ఎట్లా నడుస్తుంది మీ రిటైర్డ్ జీవితం. మీ అపార్ట్మెంట్లో కొత్తగా మిత్రులయ్యారా?”
“ఏం చెప్పమంటారు రాఘవా” అంటూ పదినిమిషాల పాటు తన ఆవేదనంతా వెళ్లగక్కాడు ప్రభాకర్. సంతోషంగా ఉన్న తన ఊరి జీవితానికి సౌకర్యంగా ఉన్న ఇక్కడి జీవన విధానానికి మధ్య తను ఎలా సతమతం అవుతున్నాడో ఎన్నో ఉదాహరణల ద్వారా చెప్పాడు. మాటల మధ్యలో మనుషుల మధ్య మాయమవుతున్న మానవసంబంధాల గురించి, అపార్ట్మెంట్లలో జరిగే చిన్నచిన్న తగాదాల గురించి, వీటన్నిటి మధ్య తన సైన్స్ టీచింగ్ ఎలా మరుగున పడిపోయిందో వివరించాడు. ప్రస్తుత సమాజంలో పెట్రేగి పోతున్న చాదస్తాలకు మంచి సైన్స్ టీచింగ్ లేకపోవడమే కారణమని చెప్పాడు.
రాజయ్య కలుగజేసుకుని..
“మీ సైన్స్ అభిమానం మా సార్ చెప్పిన దానికంటే ఎక్కువే ఉంది సార్” అని
“బిర్యానీ చల్లగయితే బాగుండదు సార్.. ముందు తినండి” పురమాయించాడు.
భోజనాలు నడుస్తున్నాయి.
“మీ స్కూల్ ఎలా ఉంది? మీరు హెడ్మాస్టర్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలను” ప్రశంసా పూర్వకంగా అన్నాడు ప్రభాకర్.
దానికి రాఘవరెడ్డి దిగులుగా ముఖం పెట్టి..
“ఇక్కడ మా పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది సార్. మా స్కూల్లో పిల్లలకు సైన్స్ సార్ లేక ఆరేళ్లు అవుతోంది. ఇప్పుడు పదోతరగతిలో ఉన్న పిల్లలకు ఫిజిక్స్ బేసిక్స్ కూడా తెలియదు. సార్లు పరీక్షల్లో హెల్ప్ చేసో, బిట్ పేపర్ చెప్పించో ఎలాగోలా పాస్ చేయిస్తారు. అయితే పెద్దయిన తర్వాత వాళ్ల పరిస్థితి తలచుకుంటే భయమేస్తుంది. ఇంటర్లో కూడా అంతే! కొన్నిప్రశ్నలు చెప్పి అవే బట్టీ కొట్టించి అక్కడ పాస్ చేయిస్తారు. ఇక వీళ్లకు మనం పదేపదే చెప్పుకొనే శాస్త్రీయ దృష్టి ఎక్కడనుండి అలవడుతుంది సార్? ‘ఎందుకు’ అని వివేచన చేసే బుద్ది ఎక్కడ నుండి పుట్టుకొస్తుంది సార్?” అంటూ వాపోయాడు.
“కొత్త రిక్రూట్మెంట్ లేదుకదా?” అని మళ్లీ అతనే..
“మీరూ సైన్స్ టీచరే కదా..” అడిగాడు ప్రభాకర్.
“అవును సార్! రిక్రూట్మెంట్ లేదు. అన్ని క్లాసులకు అన్ని సెక్షన్లకు నేనే చెప్పలేను కదా సార్! అందుకే ఇప్పటి నుండయినా చిన్న తరగతి వాళ్లని సిద్ధం చేద్దామని ఆరు, ఏడు తరగతులు తీసుకుంటున్నాను. ఎనిమిది వాళ్లని స్కూలు టైము కంటే ముందే రమ్మని చెప్పి కవర్ చేస్తున్నాను. తొమ్మిది, పది మాత్రం ఏం చేయలేక పోతున్నా సార్” అన్నాడు ఆవేదనగా.
ప్రభాకర్ నింపాదిగా ఆలోచిస్తూ..
“వేరే టీచర్లు చెప్పరా?” అనడిగాడు.
“ఎవరికైనా అది అదనపు పనే కదా సార్! మన దగ్గర అంత ఉదారంగా ముందుకొచ్చే టీచర్లు ఇప్పుడు లేరు సార్. అప్పటికీ వాళ్లకి టీచింగ్తోపాటూ వేరే పనులు కూడా ఉంటున్నాయి. అయినా సైన్స్ టీచ్ చేయడమంటే కేవలం పాఠం చెప్పి ప్రశ్న-జవాబులు రాయించడం కాదుకదా సార్!” అన్నాడు.
“అవును.. నిజమే!” అంటూ వంత పాడిన ప్రభాకర్.. రాఘవపట్ల చాలా సానుభూతి
ప్రకటించాడు.
ఆ తర్వాత తమ పాత జ్ఞాపకాల ముచ్చట్లు కొనసాగాయి. తమ యవ్వనపు తొలిరోజులలో మ్యాజిక్ షోలు చేసి నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు అని చెప్పడం, దొంగస్వాముల ట్రిక్స్ తామూ చేసి చూపించి అవన్నీ గిమ్మిక్స్ అని, వాళ్ల చేతుల్లో మోసపోవద్దని చెప్పడం, ఈసీఐఎల్ వాళ్లతో కలిసి సీఎస్సార్ కింద విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటుచేయడం, పట్టుబట్టి శాస్త్రవేత్తల చిత్రాలు తరగతి గదులలో ఏర్పాటు చేయించడం అన్నీ చెప్పుకొన్నారు. అన్నిటినీ చిరునవ్వుతో ఆస్వాదిస్తున్నాడు రాజయ్య సార్.
ఇద్దరివైపు సరదాగా చూస్తూ..
“భలే గమ్మత్తయిన విషయాలు విన్న సార్ ఈ రోజు. మీ ఇద్దరి సమస్యలు విన్నాక నాకొకటి అన్పిస్తాంది సార్! అయితే నేను నేరుగ చెప్పను.. పొడుపు కథ మాదిరి చెప్తా. మీరే ఇప్పుకోవాలె” అన్నాడు.
ఇద్దరూ అతని వంక ఆసక్తిగా చూస్తున్నారు. రాజయ్య నవ్వుతూ..
“మీ ఇంట్ల ఫంక్షనయింది సార్. అందరూ తినంగ ఫుడ్డు మిగిలిపోయింది. మీ సుట్టుపక్కల బస్తీలున్నయ్. మీరు ఆ ఆహారం తీస్కబోయి ఆళ్లకు పెడతరా, లేదా!?” అన్నాడు ప్రభాకర్ కేసి చూస్తూ.
ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు.
‘పెడతాం’ అన్నట్టు చూశారు.
“సరే.. ఇంకోటి చెబుతా! నది పారతా ఉంది సార్. ఒక పిల్లగానికి బాగ దూపయితాంది. పిల్లోడేం చేస్తాడు సార్? నదిలో నీళ్లు తాగుతడా, నది ఏమైన అనుకుంటుందేమో అని ఆగుతడా? నదిగుడ పిల్లగాని దప్పిక తీర్చినందుకు సంతోషపడతదా.. లేదా?”
ఇద్దరికీ ఏదో అర్థమవుతోంది. సంశయాల మధ్య ఇంకా స్పష్టంగా అర్థం కావడంలేదు.
“సార్.. ఇంక కుండ బద్దలు కొడుతున్న! మా హెడ్మాస్టర్ సార్ సమస్యకు మీ సమస్యే పరిష్కారం. అట్లే మీ సమస్యకు మా సార్ సమస్యే పరిష్కారం” అన్నాడు రాజయ్య.
అప్పుడు వెలిగింది ఇద్దరికీ. రాఘవరెడ్డి, ప్రభాకర్ ఇద్దరూ ఒకరివైపు మరొకరు చూసుకున్నారు. ఒక్క క్షణం ఇద్దరి ముఖాలూ సంతోషంతో వెలిగిపోయాయి. ఇద్దరూ ఒకరి విజ్ఞప్తిని ఒకరు అంగీకరిస్తున్నట్టు తలలు ఊపుకొన్నారు.
ఇంతటి చక్కటి పరిష్కారం చూపించిన రాజయ్యకి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.
రాజయ్య నవ్వుతూ..
“గంటల కొద్దీ మీరు సైన్స్ గొప్పదనం గురించి మాట్లాడిండ్రు గదా. సైన్స్ ఒక్కటే సరిపోదు సార్.. మా సోషల్ గూడా ఇంపార్టెంటే! ఇప్పుడే మీకు సోదాహరణంగా ప్రూవ్ అయ్యింది గదా” అన్నాడు. రాఘవరెడ్డి నవ్వుతూ..
“రెండూ పరిసరాల విజ్ఞానాలే కదా” అని ముక్తాయించాడు.
తేలిక పడ్డ మనసుతో మిత్రుల దగ్గర సెలవు తీసుకుని తిరిగి ఇంటిదారి పట్టాడు ప్రభాకర్.
* * *
వారం గడిచింది.
ఈ వారంలోనే రాఘవరెడ్డిని వాళ్ల స్కూలు అడ్రస్ వాకబు చేశాడు. ఆరు నుండి పది తరగతుల వరకూ సైన్స్ పుస్తకాలు ఆర్డర్ పెట్టి తెప్పించాడు. సిలబస్‌లో పెద్ద మార్పులు లేవు. తనకి ఇరవై ఏళ్లనుండీ కొట్టిన పిండే. భార్యకు విషయం కోసం చెప్పాడు. కొడుకు అడిగాడు.. ‘గౌరవ వేతనమేదైనా ఇస్తారా!?’ అని.
అదేమో తెలియదు కానీ.. తనకి గౌరవం మాత్రమే చాలని చెప్పానని చెప్పాడు.
నెలరోజులలో అన్నిపాఠాలకూ లెసన్ ప్లాన్లు తయారు చేసుకున్నాడు. అవసరమైన కథలు సిద్ధం చేసుకున్నాడు. ఏవి తక్కువ సమయంలో ప్రయోగాలకు అనుకూలంగా ఉంటాయో ఆలోచించి పెట్టుకున్నాడు.
అన్నీ సిద్ధం చేసుకుని.. ఆ రోజు ఉదయాన్నే ఆరున్నర కల్లా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. లంచ్ తనే ఏర్పాటు చేస్తానని రాఘవ చెప్పాడు. తమ బిల్డింగ్ బయటకు వస్తుంటే.. కింద చాలా కోలాహలంగా ఉంది. ఆ రోజు నుండే సంఘమిత్ర యజ్ఞం ప్రారంభం కాబోతోంది. కింద సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి.
లిఫ్టు దగ్గర పక్క ఫ్లాటతను ఎదురై..
“యజ్ఞానికేనా!? ఇంత త్వరగా బయలుదేరారు?” అని వాకబు చేశాడు.
“ఆఁ, ఆఁ, యజ్ఞానికే!” అన్నాడు ప్రభాకర్ స్థిరంగా.
అవును మరి.. రాఘవరెడ్డి తనతో చేయిస్తున్న ఈ కార్యక్రమం ఏ యజ్ఞానికీ తక్కువకాదు.
– జి. ఉమామహేశ్వర్, 98498 02521
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

